హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల వల్ల తిరుమల ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులను ఆఫ్కాన్ సంస్థకు అప్పగించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఐఐటీ నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పనులు పూర్తిచేసేందుకు నెలరోజుల సమయం పడుతుందని తెలిపారు. తిరుపతి-తిరుమల మధ్య రెండో ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడినందున శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలను అనుమతిస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బండరాళ్లు పడిన ప్రాంతాన్ని ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు పరిశీలించి ట్రాఫిక్‌ను అనుమతించాలని సూచించారని చెప్పారు. లింకు రోడ్డు ద్వారా డౌన్ ఘాట్ రోడ్డుకు వెళ్లేలా తిరుమలకు అనుమతిస్తామని వెల్లడించారు.