పొద్దునలేస్తే బీఆర్ఎస్ను తిట్టిపోయాలి. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానమివ్వకుండా.. ఎదురుదాడికి దిగాలి. ప్రశ్నించే నేతలపై పగబట్టాలి. నిలదీస్తే కేసులు పెట్టాలి. రెండేండ్లలో ఒక్క ఇటుకైనా పెట్టకుండా తాము చేసిన లక్షన్నర కోట్ల అప్పు గురించి మాట్లాడకుండా.. పదేండ్లలో కేసీఆర్ చేసిన అప్పు గురించే గగ్గోలు పెట్టాలి. కాళేశ్వరాన్ని తిట్టిపోసి.. సంక్షేమ పథకాలను తాము రద్దు చేసిన వాస్తవాన్ని దాచేయాలి. చాపకింద నీరులా సర్కారు భూములను దోచేయాలి!’ అధికారపార్టీ పెద్దల తీరు ఇలాగే ఉన్నది.
మళ్లీ అవకాశం వస్తదో, రాదో అందినకాడికి ఇప్పుడే దోచుకుందామనే ధోరణి ఇది. ఐదు దశాబ్దాలుగా ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలిచ్చిన భూములను అగ్గువకే తెగనమ్మే ప్రజాధన సంతర్పణ ఇది. పారిశ్రామిక భూములను చవకగా అమ్మే ఎత్తుగడ ఇది. ‘హిల్ట్’ పేరిట అనధికార ఒప్పందాలకు తెరలేపిన కాంగ్రెస్ సర్కారు.. ఐదు లక్షల కోట్లు వెనకేసుకునే భూదందాకు తెరవెనుక రంగం సిద్ధం చేసింది.
(గుండాల కృష్ణ)
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రామచంద్రాపురం పారిశ్రామికవాడలో భారీ విస్తీర్ణంలో స్టీల్ పరిశ్రమ ఉండేది. దశాబ్దాలపాటు నడిచిన పరిశ్రమ 20 ఏండ్లుగా ఖాయిలా పడింది. ఆపై దాని భూములు చేతులు మారాయి. అసలే ముంబై జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)ని అనుసరించి ఉన్న భూములవి. బహిరంగ మార్కెట్లో చదరపు గజం లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా ఉంటుంది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములైనందున ఇన్నాళ్లూ ఏమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హెచ్ఐఎల్టీ) పాలసీ’ ప్రకారం చదరపు గజానికి రూ.3,562 ఉండగా బహిరంగ మార్కెట్ ధరలో 1.78 నుంచి 2.37 శాతం ధరకే మల్టీజోన్‌గా క్రమబద్ధీకరించనున్నారు. కొన్ని దశాబ్దాల కిందట పరిశ్రమ పెట్టేందుకు ప్రభుత్వం నుంచి నామమాత్రపు రేటుకు భూమి ఇవ్వగా.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 30 శాతానికే క్రమబద్ధీకరిస్తున్నది. దీంతో అక్కడ పెద్ద పెద్ద వ్యాపార, నివాస సముదాయాలు నిర్మించి, ప్రజలకు విక్రయించి వేల కోట్లు వెనకేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఉప్పల్ పారిశ్రామికవాడ కొన్ని దశాబ్దాల కిందట నగర శివారు అన్నట్టుగా ఉండేది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా అప్పటి ప్రభుత్వాలు అత్యంత చవకగా రిజస్ట్రేషన్ విలువ ప్రకారమే పారిశ్రామికవేత్తలకు భూముల్ని ఇచ్చాయి. కానీ చాలా పరిశ్రమలు కొన్ని దశాబ్దాలుగా నడవడమే లేదు. కాగితాలపై మాత్రం ఇప్పటికీ అక్కడ పరిశ్రమలు కొనసాగుతున్నట్టు రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతం వాణిజ్య, నివాస సముదాయాల మధ్యలో ఉన్నది. చదరపు గజం అక్కడ కనీసంగా రూ.లక్ష నుంచి లక్షన్నర పైమాటే! కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఐఎల్టీపీ కింద చదరపు గజానికి రూ.4,590 తీసుకొని మల్ట్టిపుల్ జోన్‌గా క్రమబద్ధీకరించనున్నది. అంటే ఎకరానికి గరిష్ఠంగా రూ.2.50 కోట్లవుతుంది. అన్నిరకాల నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపడితే ఎకరా స్థలంలో 30,492 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుంది. పది అంతస్తులు వేస్తే 3.05 లక్షల చదరపు అడుగులు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.2500 వేసుకున్నా పది అంతస్తుల నిర్మాణ వ్యయం రూ.80 కోట్ల కంటే తక్కువే. ఆ ప్రాంతంలోని బహిరంగ మార్కెట్లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) కనీసంగా రూ.7 వేల నుంచి 10 వేల వరకు పలుకుతున్నది. అంటే రూ.82.50 కోట్లు వెచ్చిస్తే వచ్చే మొత్తం రూ.200-300 కోట్లు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన భూ పందేరంలో ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలే. ఇలా రేవంత్ సర్కారు ఏకంగా 9 వేల ఎకరాలకు పైగా భూ పందేరానికి రంగం సిద్ధం చేసింది. పారిశ్రామిక జోన్ నుంచి మల్ట్టిపుల్ జోన్‌గా మార్చడం ద్వారా కురిసే కనకవర్షం కండ్ల ముందు కనిపిస్తున్నది. అయినా.. ప్రభుత్వ పెద్దలు అడ్డికి పావుసేరు కూడా కాదు! అంతకంటే.. చరిత్రలోనే అత్యంత చవకగా మల్ట్టిపుల్ జోన్ కింద భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించడం వెనుక ఆంతర్యమేమిటి? పైగా భూములను క్రమబద్ధీకరించిన తర్వాత విల్లాలు, అపార్టుమెంట్లు కట్టుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్న ప్రభుత్వం, సదరు పారిశ్రామికవేత్త తిరిగి కచ్చితంగా పరిశ్రమ ఏర్పాటు చేయాలనే షరతు కూడా పెట్టలేదంటే ఇది పారిశ్రామిక ప్రోత్సాహం ఎలా అవుతుంది? అసలు ఇంతకీ గతంలో పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో నడుస్తున్న పరిశ్రమలెన్ని? ఖాయిలా పడినవెన్ని? అసలు ఆ భూములు ఎంతమంది చేతులు మారాయి? మరీ ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా జరిగిన విక్రయాలు.. తెర వెనక పూర్తయిన ఒప్పందాలెన్ని? అనే కీలకమైన ప్రశ్నలు ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)’ చుట్టూ అల్లుకుపోయాయి.
టోకుగా క్రమబద్ధీకరణ
నగరం నడిబొడ్డున ఉన్న బాలానగర్ మొదలు చుట్టూ ఔటర్ రింగు రోడ్డు వరకు 22 పారిశ్రామికవాడల్లో కేవలం పరిశ్రమల కోసం కేటాయించిన 9292.53 ఎకరాల భూములను హెచ్ఐఎల్టీపీ కింద మల్ట్టిపుల్ జోన్‌గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేవలం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకే గత ప్రభుత్వాలు ఆయా సమయాల్లో ప్రభుత్వ రేటు ప్రకారం ఈ భూములను పారిశ్రామికవేత్తలకు రిజిస్ట్రేషన్ చేసిచ్చాయి. వాస్తవానికి ఈ భూముల ధరలన్నీ కేటాయింపుల సమయంలో ఎకరా ఐదు వేల నుంచి రూ.20-30 వేలకు మించి లేవని ఓ పారిశ్రామికవేత్త తెలిపారు. అప్పట్లో బహిరంగ మార్కెట్లో ఎకరా లక్షల రూపాయలు ఉన్నా ప్రభుత్వాలు పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భారీ ఎత్తున రాయితీలిచ్చి ప్రోత్సహించాయి. నగరం విస్తరించడంతో ఇప్పుడు పారిశ్రామికవాడల చుట్టూ వాణిజ్య, నివాస సముదాయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలనేది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న ప్రతిపాదనే. ఆ మేరకు ఔటర్ రింగు రోడ్డు బయట అనేక సెజ్‌లు కూడా ఏర్పాటు చేశారు. వాటికి అనుగుణంగా తరలింపు ప్రక్రియ చేపట్టేందుకు గత ప్రభుత్వాలు రకరకాల చర్యలు తీసుకున్నాయి. కానీ తరలింపు కోసం మరోసారి రాయితీలంటూ ఇలా టోకుగా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ అనేది చరిత్రలో తొలిసారి అని పలువురు పారిశ్రామికవేత్తలే చెప్తున్నారు.
తెరవెనుక భారీఎత్తున ఒప్పందాలు?
కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌ఐఎల్‌టీపీని తెరపైకి తెచ్చే ముందు ఎలాంటి సమగ్ర అధ్యయనం చేయలేదని అధికారులే చెప్తున్నారు. కేవలం ఆయా పారిశ్రామికవాడల్లో ఎన్ని పరిశ్రమలున్నాయి? భూముల విస్తీర్ణమెంత? అనే ప్రాథమిక వివరాలు మాత్రమే సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఇంత పెద్ద పాలసీ తెచ్చే ముందు అసలు క్షేత్రస్థాయిలో ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలు ఎన్ని? ఆయా పరిశ్రమలు తీసుకున్న భూముల విస్తీర్ణం? వాస్తవంగా వాళ్లు వినియోగిస్తున్న విస్తీర్ణం? ఖాళీగా ఉన్న భూముల విస్తీర్ణం? అసలు వాటిల్లో ఉత్పత్తి ఉన్నదా? లేదా? ఎంతకాలంగా మూతపడ్డాయి? ఖాయిలా పడటం వెనక కారణాలేంది? పరిశ్రమలు నడకపోవడం వల్ల నిబంధనల ప్రకారం వెనక్కి తీసుకునేందుకు ఉన్న అవకాశాలేమిటి? ఇంతకీ హానికర (రెడ్‌జోన్) పరిశ్రమలెన్ని? హానికరం కాని (ఆరెంజ్ జోన్) పరిశ్రమలెన్ని? ఇలా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన తర్వాత, సమగ్ర చర్చ తర్వాత పాలసీని రూపొందించాల్సి ఉంటుందని రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా రాత్రికి రాత్రి ఈ పాలసీని తేవడం వెనక భారీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఖాయిలా పడిన పరిశ్రమల భూముల యజమానులు కొన్ని దశాబ్దాలుగా భూములను వాణిజ్య, నివాస సముదాయాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేసి విఫలమైనట్టు తెలిసింది. ఇప్పుడు ‘ముఖ్యనేత’ వర్గం దగ్గరకు ఈ అంశాన్ని తీసుకుపోవడంతో హెచ్ఐఎల్టీ పాలసీకి బీజం పడినట్టు విశ్వసనీయ సమాచారం. అనంతరం భారీ ఎత్తున ఈ భూముల్లో అనధికారిక ఒప్పందాలు జరిగాయని తెలుస్తున్నది. ముందుగా అన్నీ సిద్ధం చేసుకున్నందునే తక్కువ సమయంలో తాము అనుకున్న పరిశ్రమల భూముల క్రమబద్ధీకరణను పూర్తి చేసేలా రంగం సిద్ధం చేశారని సమాచారం. అందుకే గత ప్రభుత్వాలు భూములను అప్పటి రిజిస్ట్రేషన్ విలువ ఎంత ఉంటే అంతకు ఇచ్చాయి. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం అని నిర్ణయించడమే భారీ కుంభకోణానికి నిలువెత్తు నిదర్శనమని పలువురు అభివర్ణిస్తున్నారు.
ఆరోపణలకు బలాన్నిస్తున్న సర్కారు తీరు
ఔటర్ రింగు రోడ్డు లోపల పరిశ్రమలు ఉండటంతో ప్రజారోగ్యానికి ముప్పు ఉందని, అందుకే ఔటర్ బయటకు పరిశ్రమలను తరలించాలనే హెచ్ఐఎల్టీ పాలసీ తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ పాలసీలో భాగంగా ఇష్టం ఉన్న వారు మాత్రమే ముందుకొచ్చి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. అంటే పరిశ్రమలు ఖాయిలా పడి ఏండ్ల తరబడి ఈ భూముల్ని వాణిజ్య, నివాస సముదాయాల నిర్మాణం కోసం వేచి ఉన్న వారు వెంటనే పాలసీని వినియోగించుకుంటారు.
పైగా ఔటర్ బయట పరిశ్రమను కచ్చితంగా ఏర్పాటు చేసి ఉత్పాదకతతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఎలాంటి షరతును విధించకపోవడం గమనార్హం. ఇక పరిశ్రమలు నడుపుతున్న వాళ్లు ఇంత తక్కువ సమయంలో ఇక్కడ పరిశ్రమను మూసి ఔటర్ బయట ఏర్పాటు చేయడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. అందుకే ఈ పాలసీని వినియోగించుకునే అవకాశాలు తక్కువ. దీంతో పాలసీ అమలు తర్వాత కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమలు ఔటర్ లోపలే ఉంటాయి. ఖాయిలా పడిన పరిశ్రమల భూముల్లో మాత్రం ఆకాశహర్మ్యాలు వస్తాయి. అలాంటప్పుడు కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ బయటకు పంపాలనే ప్రభుత్వ ఉద్దేశం ఎలా నెరవేరుతుంది? అని ఓ పారిశ్రామికవేత్త ప్రశ్నించారు. అసలు సర్కారు చిత్తశుద్ధిలోనే లోపం ఉన్నదని, దీని ప్రకారం ఈ పాలసీ పరిశ్రమలను బయటకు పంపడమా? పరిశ్రమల భూములను రియల్టీకి మళ్లించడమా? అనే సందేహాలను రేకెత్తిస్తున్నదని చెప్తున్నారు.