హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఏబీపీ నెట్వర్క్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన ‘సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. మంగళవారం చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరిగే సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. చర్చా కార్యక్రమంలో పాల్గొని దక్షిణ భారత దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ మూడో అడిషనల్ ఈ సారి ‘భవిష్యత్తుకు సిద్ధం, ఆవిష్కరణ, పరివర్తన, స్ఫూర్తి’ అనే ఇతివృత్తంతో జరగనున్నది. ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం, విద్య, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాల్లో దక్షిణ రాష్ర్టాలు ఏవిధంగా ముందుకు సాగుతున్నాయన్న అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించడంతో పాటు తయారీ రంగం, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెటిజెన్స్ (ఏఐ) వంటి ఆవిష్కరణల ఆధారిత రంగాల్లో వస్తున్న కొత్త అవకాశాలపై అభిప్రాయాలను పంచుకోనున్నారు.