హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నేండ్ల వరకు ఎలాంటి కదలిక లేని ఈ కేసులో మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. బుధవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆయన మంగళవారమే ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తున్నది. యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే చారిటీ సంస్థకు అంజన్‌కుమార్ రూ. 20 లక్షల విరాళం ఇచ్చారు. దీనిపైనే ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నట్టు సమాచారం. గతంలో ఈడీ విచారణ ఎదుర్కొన్న ఆయనకు మళ్లీ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది.