హైదరాబాద్: తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2017-19 మధ్య అన్నదాతల బలవంతపు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని పేర్కొంది. 2017లో 846, 2018లో 900 మంది రైతులు తెలంగాణాలో ఆత్మహత్య చేసుకోగా 2019లో ఈ సంఖ్య 491కు పడిపోయిందని వివరించింది. దేశంలోనే అత్యంత తక్కువ రైతు మరణాలు తెలంగాణాలో నమోదైనట్లు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం వల్ల అన్నదాతల ఆత్మహత్యలు గణనీయగా తగ్గాయని కొనియాడింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక ప్రశ్నకు లోక్సభలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
మరోవైపు తెలంగాణాలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం అన్నదాతల ఆత్మహత్యలను తగ్గించిందని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్కు చెందిన జీవీ రామంజనేయులు అంగీకరించారు. కనీస మద్దతు ధర ఉన్న వరి, పత్తి సాగుకు రైతులు మళ్లడానికి ఈ పథకం సహాయపడిందని అన్నారు. కాగా, రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేసే రైతు బంధు పథకాన్ని 2018 అక్టోబర్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టగా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్, బీహార్, హర్యానా, ఉత్తరాఖండ్తోపాటు ఈశాన్య రాష్ట్రాలు దీనిని అనుసరించాయి.