హైదరాబాద్ : సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వేను జాతీయ పురస్కారాలు వరించాయి. ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు 4 జాతీయ పురస్కారాలు వచ్చాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, విద్యుత్ శాఖ సంయుక్తంగా ఈ అవార్డులను ప్రకటించాయి. అందులో కాచిగూడ స్టేషన్, విజయవాడ డివిజినల్ రైల్వే ఆసుపత్రి, విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్కు జాతీయ పురస్కారాలు లభించాయి. సికింద్రాబాద్ సంచాలన్ భవన్కు మెరిట్ సర్టిఫికెట్ దక్కింది. అవార్డులను ఈ నెల 14 నుంచి 21 మధ్య జరిగే వారోత్సవాల్లో ప్రదానం చేయనున్నారు. రైల్వే శాఖకు జాతీయ పురస్కారాలు దక్కడంతో రైల్వే అధికారులను జీఎం గజానన్ మాల్యా అభినందించారు.