హూజూరాబాద్: దళితులు దరిద్రులు కాదు.. వారి ఆర్థిక స్వాలంబనే రాష్ట్ర ప్రగతికి దిక్సూచీగా మారుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హూజూరాబాద్‌లో ఇవాళ ఆయన దళితబంధు ( Dalit Bandhu ) పథకాన్ని ప్రారంభించారు. నిజానికి ఏడాది క్రితమే ఈ పథకం మొదలు కావాలి, కానీ కరోనా వల్ల ఆలస్యమైందన్నారు. 5 రూపాయలు ఇవ్వాలని ఏనాడూ నోరుమెదపి అడగనోడు కూడా దళితబంధు పథకంపై విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు. దళితులు బాగుపడొద్దా అని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత మేధావులు, రచయితలు, యువత, విద్యార్థికి మనవి చేస్తున్నాని.. ఈ పథకాన్ని అమలు చేసి.. తుదముట్టించే ప్రధాన బాధ్యత మీ మీదే ఉందన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 21వేల కుటుంబాలు ఉన్నాయని, రాబోయే నెల, రెండు నెలల్లో అందరికీ దళితబంధు ఇవ్వబోతున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి ఒక కుటుంబానికి ఇస్తామన్నారు. ఆస్తులు లేక దళితులు అణిచివేయబడ్డారన్నారు. అంబేద్కర్ పోరాటం వల్ల రిజర్వేషన్ల రూపంలో కొందరికి కొన్ని అవకాశాలు వచ్చాయని, హుజురాబాద్ లాంటి బాధలు రాష్ట్రంలో ఇంకా 118 ఉన్నాయన్నారు. రైతు బంధు తరహాలోనే దళిత బందు అమలవుతుందని సీఎం తెలిపారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకూ దళిత బంధు వర్తిస్తుందని, ఉద్యోగులు చివరి వరుసలో తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉన్న కులం ఎస్సీలే అని, 75 లక్షలు జనాభా ఉందని, అతి తక్కువ ఆస్తి, ఉపాధులు ఉన్నది కూడా ఎస్సీలే అని సీఎం చెప్పారు. మనది ప్రజాస్వామ్యమే అయితే.. దళిత సమాజం పట్ల భారత ప్రభుత్వ అవలంబిస్తున్నది వివక్ష కాదా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇంకా ఎన్ని దశాబ్ధాలు ఎస్సీలు బాధల్లో ఉండాలిని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితజాతి ఉద్దరణకు హూజూరాబాదే పునాది రాయి కావాలన్నారు. ఈ స్కీంకు బ్యాంక్ లింక్ లేదన్నారు. కిస్తీ కట్టే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పది లక్షలు వాడాలన్నారు. మీకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవచ్చు అని సీఎం తెలిపారు. దళితులం.. దరిద్రులం కాదు అని నిరూపించాలన్నారు.
ఫర్టిలైజర్స్ షాపు పెట్టుకోండి.. వైన్‌షాపులు, బార్ షాపులు పెట్టుకోవచ్చు అని సీఎం సలహా ఇచ్చారు. దళితులకు ఇది సువర్ణవకాశం అని.. దళిత జాతి మేల్కొంటుందన్నారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరిగిందేంటో .. ఇక్కడెందుకు జరగలేదని అడుగతదని కేసీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ దళితబంధు ఉద్యమ మెరుపు కనిపిస్తుందన్నారు. చాలా బాధ్యతగా దీన్ని విజయవంతం చేసి చూపెట్టాలన్నారు.
దళిత బంధు పథకానికి ఖర్చు లక్షా 70 వేల కోట్లు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. వాడలన్నీ బంగారు మేడలవుతాయన్నారు. పథకం సక్సెస్‌లో నైపుణ్యం, గొప్ప సంస్కారం అవసరమన్నారు. మాది తెలంగాణ, మేం దళిత సోదరులం, మేం పైకి వచ్చాం అని గర్వంగా చెప్పుకోవాలి అని కేసీఆర్ అన్నారు. నేను ప్రవేశపెట్టే పథకాలు.. ఎవరూ తీసివేయలేరని.. ఎందుకంటే అవి అంత బలంగా ఉన్నట్లు సీఎం చెప్పారు. దేశంలో ఎక్కడ జరగని ఆవిష్కరణ ఇది అన్నారు. ప్రతి దళితుడు తల ఎత్తుకుని తిరగాలన్నారు.
దళితబంధు తీసుకున్నవారికి రేషన్ కార్డు, పెన్షన్ బంద్ కాదు.. అనుమానాలు పక్కనపెట్టి, సహాయం చేసుకోండి, పెద్దల సలహాలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. హూజూరాబాద్లోనే షాపు పెట్టాలని లేదు.. ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నారు. మెదడు కరగబెట్టి చేసిన ఓ గొప్ప ఆలోచన దళితబంధు పథకం అన్నారు. డబ్బుల కోసం కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలన్నారు. దాంట్లో డబ్బులు వేస్తాం.. స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆ అకౌంట్ సమాచారం చిప్‌లో ఉంటుందన్నారు.
50 వేల కోట్లతో హూజూరాబాద్‌లో రక్షణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. లక్షా 25 వేల దళిత సైన్యం ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందన్నారు. దళితులు కిందకు పోయే పరిస్థితి లేదని.. మళ్లీ పేదరికంలోకి వెళ్లరన్నారు. ఈ పథకంతో దళితజాతి రత్నాలను వెలికి తీయాలని.. ఆ శక్తితో మన రాష్ట్ర ఎకానమీ పెరుగుతుందని, అద్భుత ఆర్థిక ప్రగతి జరుగుతుందన్నారు. భారత దేశమే మన దగ్గర ఈ పథకం గురించి నేర్చుకుని పోవాలని సీఎం తెలిపారు. పథకం అమలులో ఓర్పు, నేర్పు, సహనశీలత ఎంతో అవసరం అన్నారు.
జై దళితబంధు.. జై భీమ్.. జై హింద్.. జై తెలంగాణ