
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కిరాయి భవనాల్లో సాగుతున్న 13-14 వేల అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలకు తరలించనున్నారు. స్థానిక వనరులకు అనుగుణంగా కేంద్రాలను మార్చాలనే అంశంపై మంగళవారం మహిళా శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
వీటిలో 31,711 అంగన్వాడీ కేంద్రాలు, మరో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. కొన్నింటికి సొంత భవనాలున్నాయి. మరికొన్ని ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. మరో 15 వేల కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లోనే ఉన్నాయి. 58 శాతం కేంద్రాలను కిరాయి భవనాల్లో నిర్వహిస్తూ నెలకు రూ.30-40 కోట్లను చెల్లిస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని నూతన జాతీయ విద్యావిధానం తెలిపింది. దీంతో అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయా? అనే చర్చ నడుస్తున్నది. రాష్ట్రంలో ఎన్ఈపీని యథాతథంగా అమలు చేయాల్సి వస్తే, అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాల్సి ఉంటుంది.