Allu Arjun – Lokesh Kanagaraj | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం రాబోతుందని వార్తలు వైరలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి నేడు చిత్రయూనిట్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కెరీర్లో 23వ చిత్రంగా ఈ సినిమా రాబోతుండగా.. అప్డేట్ ఎప్పుడూ వస్తుందా అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ‘పుష్ప’ సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో, ఈ కొత్త కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాలకు ఉండే ప్రత్యేకమైన ‘LCU’ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) క్రేజ్ దృష్ట్యా, అల్లు అర్జున్ సినిమా కూడా అందులో భాగమవుతుందా లేదా అనేది అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించబోతున్నట్లు సమాచారం. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రాబోతుంది.
సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ (#AA22) చేస్తున్నారు. ఆ సినిమా పనులన్నీ పూర్తయిన తర్వాత, 2026 జూన్ లేదా జూలై నెలలో లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ దాదాపు రూ.75 కోట్ల మేర భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్ నడుస్తుంది. ఇది కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన హై-వోల్టేజ్ ఎంటర్టైనర్ అని ఇందులో బన్నీ మేకోవర్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని తెలుస్తోంది.