PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. దేశ రాజధాని డిల్లీలో కేంద్ర మంత్రి (Union Minister) మురుగన్ (Murugan) నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల (Pongal celebrations) లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు సంక్రాంతి శుభాంకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధాని గోవులకు పూజ చేశారు. ఆ తర్వాత పొంగలి వండారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు కూడా ఉన్నారు.
సంక్రాంతి వేడుకల అనంతరం మోదీ మాట్లాడుతూ.. గత ఏడాది తాను తమిళనాడులో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైనట్లు గుర్తుచేసుకున్నారు. వెయ్యి సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయాల్లో తమిళుల చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం సహజ వ్యవసాయంపై తమిళనాడులో జరిగిన ఓ సమావేశానికి తాను హాజరైనట్లు మోదీ చెప్పారు.
లాభదాయకమైన వృత్తులను వదిలి, వ్యవసాయం వైపు మళ్లిన యువతను తాను అక్కడ కలిశానని, వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి వారు చేస్తున్న కృషిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నానని ప్రధాని అన్నారు. దేశంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత వంటివి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రధాని చెప్పారు. రైతులు దేశ నిర్మాణంలో బలమైన భాగస్వాములని, వారిని మరింత శక్తిమంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తోందని అన్నారు.