నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 29: టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లో ఈ నెల 15న నిర్వహించనున్న విజయగర్జన సభకు పార్టీ శ్రేణులు చీమలదండులా కదలాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఎమ్మెల్యే అబ్రహం నేతృత్వంలో, ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయగర్జన సభకు భారీగా తరలివచ్చి విపక్షాల విమర్శలకు చెంపపెట్టు సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు మాత్రం చౌకబారు విమర్శలకు దిగుతున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాలు ఒకటంటే మనం వంద సమాధానాలు చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన, చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యకర్తలకు సూచించారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘నేనొక్కడినే తప్పు చేశానా.. ఎవరూ చేయలేదా’ అంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అలాంటి వ్యక్తి ఓ జాతీయ పార్టీకి అధ్యక్షునిగా ఉండే దుస్థితి రావడం శోచనీయమన్నారు. వడ్లు కొనుగోలు చేయబోమని సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోనే కేంద్రం స్పష్టంగా చెప్పిందని, తాను కూడా అప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నానని గుర్తుచేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దొంగ దీక్షలు చేశాడని మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. విజయగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. వచ్చే రెండు దశాబ్దాలు రాష్ట్రంలో టీఆర్ఎస్సే ఆధికారంలో ఉండి ప్రజాసంక్షేమ పాలన సాగిస్తుందని స్పష్టంచేశారు. గర్జనకు నియోజకవర్గం నుంచి 164 బస్సులను సిద్ధం చేశామని తెలిపారు.
రాష్ర్టానికి బీజేపీ ఏంచేసింది?: ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెరలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అధ్యక్షత నిర్వహించిన నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ సమావేశానికి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. 70 ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏడేళ్లలో సాధించామని స్పష్టంచేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్రంలో వైఫల్యాలు కనిపించక కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నాయని దుయ్యబట్టారు. ఓ కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలున్న బీజేపీ.. రాష్ర్టానికి ఏమి తెచ్చిందో ప్రజలకు తెలుపాలని డిమాండ్‌చేశారు.
వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి:టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకల సందర్భంగా వచ్చే నెల 15న నిర్వహించనున్న ‘విజయగర్జన సభ’ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ సభ కోసం వరంగల్ నగర శివారులో స్థలాలను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ శుక్రవారం పరిశీలించారు. మడికొండ, ఉనికిచర్లలోని ఖాళీ స్థలాలను గుర్తించారు.