సూర్యాపేట రూరల్: చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఎర్కారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎర్కారం గ్రామానికి చెందిన మోదాల లింగయ్య (70) చేతబడి చేస్తాడని, మంత్రాలు వస్తాయని కొన్నేండ్లుగా ప్రచారం జరుగుతుంది. రెండేండ్ల క్రితం లింగయ్య భార్య చనిపోవడంతో అప్పటి నుంచి లింగయ్య ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.
ఈ నెల1న అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న మోదాల లింగయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయ డంతో తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. మరుసటి రోజు లింగయ్య కుటుంబ సభ్యులు గమనించి 108 కి సమాచారం అందించడంతో లింగయ్యను సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 6న మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై లవకుమార్ తెలిపారు.