సూర్యాపేట రూరల్, మే 30 : పశు సంపద పెంచడానికి, పశువులకు గ్రామాల్లోనే వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో పశు వైద్యశాలలు నిర్మించాలని నిర్ణయించి.. ఆ మేరకు నిధులు మంజూరు చేశారు. దీంతో పలు గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టగా.. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి.
సూర్యాపేట మండలంలోని టేకుమట్ల, బాలెంల, ఎండ్లపల్లి, కాసరబాద, సోలిపేట, ఇమాంపేట గ్రామాల్లో పశు వైద్యశాలలు ఉన్నాయి. సోలిపేట, ఇమాంపేట గ్రామాల్లోని పశు వైద్యశాల భవనాలు శిథిలావస్థకు చేరుకోగా.. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. పశు వైద్యశాల భవనంలో మూడు విశాలమైన గదులతోపాటు ప్రహరీ, గేటు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో పశు వైద్యశాలకు రూ.15లక్షలు మంజూరు చేశారు. దీంతో నిర్మాణ పనులు ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటికే సోలిపేటలో అన్ని వసతులతో భవన నిర్మాణం పూర్తయింది. త్వరలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇమాంపేట గ్రామంలో పనులు స్లాబ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. మిగిలినవి త్వరగా పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేశారు. గ్రామాల్లో పశువులకు మెరుగైన వైద్యం కోసం పశు వైద్యశాలలు నిర్మిస్తుండడంతో రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గ్రామంలోనే వైద్యం
సోలిపేట గ్రామంలో పశువులకు మెరుగైన వైద్య సేవలందించడానికి ప్రభుత్వం అన్ని వసతులతో పశు వైద్యశాల భవనాన్ని నిర్మించింది. పశువులు, జీవాలకు ప్రమాదం జరిగినా, జబ్బులు వచ్చినా మండల కేంద్రానికి వెళ్లకుండా గ్రామంలోనే వైద్యం అందే అవకాశం ఉంది. గ్రామంలో పశువుల ఆసుపత్రిని అన్ని వసతులతో నిర్మించిన ప్రభుత్వానికి, మంత్రి జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతలు.