రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ ఉంటుందన్నది నానుడి. ప్రస్తుతం అచ్చం అలాగే ఉంది పరిస్థితి. బుధవారం సూర్యాపేట జిల్లాలో రికార్డు స్థాయిలో 44 డిగ్రీలు, నల్లగొండలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపించాడు. లాక్డౌన్తో ఇండ్లకే పరిమితమైన ప్రజలు ఏసీలు, కూలర్ల కింద కాస్త ఊరట పొందినా.. కరోనా కట్టడికి విధుల్లో ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్ వడగాలులతో అల్లాడిపోయారు.అయినా వెరవకుండా లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలుచేసేందుకు పోలీసులు రోజంతా రోడ్ల మీదే ఉన్నారు. రెండో విడుత జ్వర సర్వే చేస్తున్న ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేశారు. చెత్త సేకరణతోపాటు సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేస్తూ పారిశుధ్య కార్మికులు విశేష సేవలందించారు. చివరి దశలో ఉన్న ధాన్యం కొనుగోళ్ల కోసం దాదాపు 10 శాఖల సిబ్బంది కృషి చేస్తున్నారు. సూర్యాపేట కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించి కొనుగోళ్ల తీరును పరిశీలించారు.
సూర్యాపేట, మే 26 (నమస్తే తెలంగాణ) : రోహిణి కార్తె ప్రారంభం నుంచే భానుడు నిప్పులు కక్కుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడు. మంగళవారం రోహిణి ప్రారంభమవగా, సూర్యుడు రోజురోజుకూ తన విశ్వరూపాన్ని పెంచుతూ మంట గాలులతో భయపెడుతున్నాడు. ఉదయం 8నుంచి ప్రారంభమైన వడగాడ్పులతో కూడిన ఎండ వేడిమి సాయంత్రం 6గంటల వరకూ ఉంటున్నది. తర్వాత భానుడు విశ్రమించినా కూడా వేడి ప్రభావం మాత్రం రాత్రి 11గంటల వరకు ఉండి వాతావరణం చల్లబడడం లేదు. లాక్డౌన్ కారణంగా ఉదయం 6నుంచి 10గంటల సమయంలోనే ప్రజలు అన్ని పనులు చక్కదిద్దుకొని ఇండ్లకు చేరుకుంటున్నారు. దీంతో ఈసారి ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. అయితే లాక్డౌన్ డ్యూటీలో ఉన్న పోలీసులతోపాటు కొవిడ్ నివారణ కోసం ఇంటింటి సర్వే చేస్తున్న వైద్యారోగ్య, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మాత్రం ఎండలోనూ సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది, అక్కడికి వచ్చే రైతులు, హమాలీలు, ఉపాధి హామీ పనులు చేసే వారు ఎండ నుంచి ఉపశమనం కోసం తలకు కండువా, దస్తీలు కట్టుకుంటున్నారు. ఉపాధి పనులు చేపట్టే చోట టెంట్లు వేస్తూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇటీవల వర్షాలు పడి వాతావరణం కాస్త చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందినా మళ్లీ ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి.