e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home సూర్యాపేట మహావీరుడికి మరో గౌరవం

మహావీరుడికి మరో గౌరవం

మహావీరుడికి మరో గౌరవం

సూర్యాపేట, జూన్‌ 11 (నమస్తే తెలంగాణ) : మహావీరచక్ర కర్నల్‌ బిక్కుమళ్ల సంతోశ్‌బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 15న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. జిల్లాకేంద్రంలోని కోర్టు సమీపంలో ఉన్న చౌరస్తా వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని శుక్రవారం విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ అండగా నిలిచింది. సీఎం కేసీఆర్‌ నేరుగా సూర్యాపేటకు వచ్చి 5కోట్ల నగదు, హైదరాబాద్‌లో 711 గజాల స్థలం, సంతోష్‌బాబు సతీమణి సంతోషికి ఉద్యోగం కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె యాదాద్రిభువనగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.

అక్కడే హామీ… వెంటనే కార్యాచరణ
కర్నల్‌ సంతోష్‌బాబు అమరుడైన రోజున మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హుటాహుటిన సూర్యాపేటకు చేరుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సూర్యాపేటలో ఒక చౌరస్తాకు కర్నల్‌ సంతోష్‌ పేరు పెట్టి అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూర్యాపేటకు వచ్చినప్పుడు కూడా కర్నల్‌ కుటుంబ సభ్యుల కోరిక మేరకు .. జిల్లాకేంద్రంలో విగ్రహం ఏర్పాటు, చౌరస్తాకు ఆయన పేరు పెట్టడంపై హామీ ఇచ్చారు. వారి హామీ మేరకు ఈ నెల 15న కర్నల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పట్టణంలోని మెయిన్‌ రోడ్డు కోర్టు చౌరస్తా వద్ద 110 ఫీట్ల పొడవు, 22 ఫీట్ల వెడల్పు ప్రాంతంలో గార్డెన్‌ ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో 6 అడుగుల ఎత్తున్న దిమ్మెపై రూ.20లక్షల వ్యయంతో రూపొందించిన 9.6 అడుగుల ఎత్తైన సంతోష్‌బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

కర్నల్‌ సేవలకు గుర్తింపుగా విగ్రహం : మంత్రి జగదీశ్‌రెడ్డి
భారత్‌ చైనా సరిహద్దులో వీర మరణం పొందిన సూర్యాపేట ముద్దుబిడ్డ పరమవీరచక్ర కర్నల్‌ సంతోష్‌బాబు దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం.. ఈ నెల 15న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నామని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కోర్టు సమీపంలోని చౌరస్తా వద్ద విగ్రహ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నల్‌ సంతోష్‌బాబు సూర్యాపేట పేరును జాతీయ స్థాయికి తీసుకుపోయారని, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం కోర్టు చౌరస్తాకు కర్నల్‌ సంతోష్‌బాబు పేరు పెట్టడంతో పాటు అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు చెందిన ఫైన్‌ ఆర్ట్‌ కళాశాల వారు విగ్రహాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్‌ రామానుజులరెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఉప్పల ఆనంద్‌, చింతలపాటి చినశ్రీరాములు, కౌన్సిలర్లు ఆకుల లవకుశ, తాహెర్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మహావీరుడికి మరో గౌరవం

ట్రెండింగ్‌

Advertisement