పెన్‌పహాడ్, ఆగస్టు 29 : ఓ హెడ్ కానిస్టేబుల్ తప్ప తాగి కేసు విషయమై విచారణకు వెళ్లగా మత్తులో ఉన్న అతడిని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామంలో ఇద్దరి పాలివారి మధ్య కొంతకాలంగా వ్యవసాయ భూమి పంచాయతీ కొనసాగుతుంది. ఇరు వర్గాలు ఒకరి పైప్‌లైన్‌ను మరొకరు ధ్వంస చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ ఆంగోతు యాదగిరి బుధవారం గ్రామానికి వెళ్లాడు. వచ్చిన పని పక్కన పెట్టి ఫుల్లుగా మద్యం సేవించి మత్తులో తూలుతున్నాడు. బాధితులు చెప్పేది వినకుండా పంచాయతీకి సంబంధం లేని సమాధానం చెప్పడంతో అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు విస్తు పోయారు. మత్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌ను గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.