సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో కొనసాగుతున్న బ్యాంక్ స్ట్రీట్ ఉప పోస్ట్ ఆఫీస్ ను హెడ్ పోస్ట్ ఆఫీస్ లో విలీనం చేయాలనుకునే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ డిమాండ్ చేశారు. పెన్షన్ దారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బ్యాంక్ స్ట్రీట్ ఉప తపాల కార్యాలయం ముందు పెన్షన్ దారులతో కలసి ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ పోస్ట్ ఆఫీస్ కింద 3వేల మంది పెన్షన్ దారులతో పాటు 3వేల మంది ఖాతాదారులు ఉన్నారన్నారు.
దీన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్ లో విలీనం చేయడంతో వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్లు తీసుకునేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఇదే పోస్ట్ ఆఫీస్ ని గతంలో చర్చి కాంపౌండ్ ప్రాంతంలో నిర్వహించగా దూర భారం కావడంతో తాము అధికారులకు విన్నవించిన వెంటనే 25వ వార్డులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇటీవల పోస్ట్ ఆఫీస్ విజిట్ కు వచ్చిన పిజిఎం ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు లేవని కేవలం పెన్షన్ల కోసమే కొనసాగుతుందని చెబుతూ దీన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్ లో విలీనం చేయాలని రిపోర్టు ఇవ్వడం సరికాదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ దారుల జీవితాలతో చెలగాటాలాడుతూ ఉప పోస్ట్ ఆఫీస్ లను ఎత్తి వేయాలని చూడడం దారుణం అన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులను దృష్టిలో ఉంచుకొని బ్యాంకు స్ట్రీట్ పోస్ట్ ఆఫీస్ ను ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అర్వపల్లి లింగయ్య, బైరు వెంకన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.