
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): పారిశుధ్యం, పచ్చదనమే లక్ష్యంగా రూపొందించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ప్రతి నెలా జనాభా ప్రాతిపదికన నిధులు విడుదలవుతుండగా ప్రతి పంచాయతీలో ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంపింగ్‌యార్డు నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ మరో టార్గెట్ నిర్దేశించారు. ప్రతి మండలానికీ ఒక బృహత్ ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నేతృత్వంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జూలై మూడో వారంలో ప్రారంభమైన పనులు అన్ని మండలాల్లోనూ చురుకుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేనిచోట్ల గ్రామాల్లో స్థలాలను సేకరించారు.
పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలను నాలుగు భాగాలుగా విభజిస్తున్నారు. స్థలంలో మధ్య నుంచి ప్లస్ ఆకారంలో 8ఫీట్లతో నలుదిక్కుల నుంచి మధ్యకు చేరడానికి వాకింగ్ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. దీంతో పాటు 10ఫీట్ల వెడల్పుతో ప్రకృతివనం చుట్టూ ప్రధాన వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మధ్యలో ఓ వైపున కనీసం 30గుంటల స్థలానికి తగ్గకుండా చిన్నపిల్లలు ఆడుకునేందుకు వీలుగా చిల్డ్రన్ పార్కులను కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు పెద్ద పట్టణాలకే పరిమితమైన ఇలాంటి పార్క్‌లు ఇక మండలాల్లోనూ కనువిందు చేయనున్నాయి.
రూ.43లక్షల ఉపాధిహామీ నిధులతో చేపడుతున్న వనాల్లో రూ.15లక్షలు మొక్కలు నాటేందుకు మరో రూ.28లక్షలు కాంపౌండ్ మెటీరియల్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఇతర అవసరాల కోసం జిల్లా కలెక్టర్ నిధుల నుంచి రూ.2లక్షలు కేటాయిస్తున్నారు. ప్రతి ప్రకృతివనం చుట్టూ ముందే హద్దులు నిర్ధారించి మెష్ లేదా వైర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన గేటును అమర్చడంతోపాటు ప్రకృతి వనంబోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్లాంటేషన్ మార్కింగ్, వాకింగ్ ట్రాక్, బోర్వెల్ డ్రిల్లింగ్ లేదా లీజు లాంటి వాటి కోసం నిధులను వెచ్చిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల సరిహద్దుల నిర్ధారణ, ఫెన్సింగ్, గేట్, బోర్డుల ఏర్పాటు పూర్తయ్యాయి. వాకింగ్ ట్రాక్‌లు, ప్లాంటేషన్, బోర్వెల్ పనులు చివరిదశలో ఉన్నాయి. వీటిని కూడా వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యత రెండేండ్ల పాటు ప్రభుత్వమే చేపట్టనున్నది. ఏడాదికి రూ.11లక్షలు వెచ్చించనుంది.
ప్రకృతి వనంలో 31వేల చొప్పున 6లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 18రకాల మొక్కలకు ప్రాధాన్యమిస్తూ ఇప్పటివరకు 3.20లక్షలు నాటించారు. ప్రస్తుతం అన్ని మొక్కలు అందుబాటులో ఉన్నప్పటికీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకేరోజు మాస్ ప్లాంటేషన్ చేపట్టి మొక్కలన్నింటినీ నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మండల పరిధిలోని స్థానిక సంస్థల సిబ్బందిని, అధికారులను రప్పించి దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
వనాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ నేతృత్వంలో నలుగురు జిల్లా స్థాయి అధికారులతో నోడల్ అధికారులను నియమించారు. రాహుల్‌శర్మ స్వయంగా ఏడు మండలాలను, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి ఆరు మండలాలను, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి 10 మండలాలను, డీఆర్డీఓ కాళిందిని 8మండలాలను పర్యవేక్షిస్తున్నారు. వీరు నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా సమస్యలు, ఇతర ఆటంకాలు ఎదురైతే కలెక్టర్ సహకారంతో పరిష్కరిస్తూ టార్గెట్ పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్నారు.
తిరుమలగిరి, ఆగస్టు 7 : సూర్యాపేట జిల్లాలో బృహత్ వనాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేయనున్న ఆయా వనాల కోసం సమీప గ్రామాల్లో స్థలాలను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం స్థలాన్ని చదును చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే మొక్కల నాటింపు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మకూర్.ఎస్ మండలంలో ఎనుబాముల, చివ్వెంల-ఉండ్రుగొండ, మద్దిరాల-గోరెంట్ల, మునగాల-నేలమర్రి, నడిగూడెం-సిరిపురం, నాగారం-ఫణిగిరి, నూతనకల్-మిర్యాల, తిరుమలగిరి-మామిడాల, తుంగతుర్తి-గానుగుబండ, మేళ్లచెర్వు మండలకేంద్రంలో, అనంతగిరి-ఖానాపురం, చిలుకూరు, గరిడేపల్లి-గడ్డిపల్లి, చింతలపాలెం-చింతిర్యాల, హుజూర్నగర్ – లింగగిరి, జాజిరెడ్డిగూడెం-రామన్నగూడెం, కోదాడ-కాపుగల్లు, మోతె-విభళాపురం, పెన్‌పహాడ్ -అన్నారం, సూర్యాపేట-రామారం, మఠంపల్లి-గుండ్లపల్లి, పాలకవీడు-శూన్యంపహాడ్/మహంకాళిగూడెం (ప్రతిపాదన), నేరేడుచర్ల-లాల్ లక్ష్మీపురంలో స్థలాన్ని ఎంపిక చేశారు.
అతి త్వరలోనే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం..అన్ని మండలాల్లో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. మండల కేంద్రాల్లో స్థలం అందుబాటులో లేని కారణంగా సమీప గ్రామాల్లో ఎంపిక చేసి చదును చేయిస్తున్నాం. ప్రస్తుతం ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి. మొక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వర్షం పడగానే మెగా ప్లాంటేషన్ చేపట్టి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.
కనగల్, ఆగస్టు 7 : మండలంలోని జి.యడవల్లిలో కనగల్-చండూరు ప్రధాన రహదారికి అనుకుని ఏర్పాటు చేస్తున్న మెగా పల్లె ప్రకృతి వనం జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇక్క 44ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించిన అధికారులు 16ఎకరాల విస్తీర్ణంలో వనాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఐదంచెల్లో ఏర్పాటు చేసే ఈ వనంలో పూలు, పండ్లు, ఔషధ మొక్కలతో పాటు వేలాది మొక్కలు నాటి దట్టమైన చిట్టడవిని సృష్టించనున్నారు.
బృహత్ ప్రకృతి వనం ద్వారా కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుతం అవి ఆహారం కోసం ఊళ్లల్లోకి చొరవడి ఇండ్లలో సామగ్రిని ఎత్తుకుపోతున్నాయి. జనంపై దాడికి పాల్పడుతున్నాయి. బృహత్ ప్రకృతి వనాలు పూర్తయితే కోతులకు ఆవాసం దొరుకుతుంది.
సరంపేటకు వరం
మర్రిగూడ, ఆగస్టు 7: మండలంలోని సరంపేటలో చేపట్టిన ప్రకృతి వనం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మాల్ నుంచి కనగల్ను అనుసంధానం చేసే డబుల్ రోడ్డుకు ఆనుకుని వనం ఏర్పాటు చేస్తున్నారు. పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలు చేస్తున్నారు. మొత్తం 31వేల మొక్కలకు గాను జిల్లా కేంద్రం నుంచి 13వేల మొక్కలు, అటవీశాఖ ద్వారా 8వేలు, గ్రామ పంచాయతీల నుంచి 10వేల మొక్కలను సేకరించనున్నారు.
పల్లె ప్రగతి పనులతో మా ఊరు ఇప్పటికే ఎంతో మారిపోయింది. ఇప్పుడు మెగా పార్కు ఏర్పాటు చేస్తుండడంతో మా ఊరికి మంచి గుర్తింపు వస్తుంది.
పదెకరాల్లో 31వేల మొక్కలు
మునుగోడు, ఆగస్టు 7 : మండలంలోని కొరటికల్‌లో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 10ఎకరాల విస్తీర్ణంలో 31వేల మొక్కలు నాటుతున్నారు. వనం ఏర్పాటు మొత్తం యాదాద్రి అభయారణ్యం తరహాలో ఏర్పాటు చేస్తున్నారు. గుంతల తవ్వకం, మొక్కలు నాటడం, నీటి వసతి, నిర్వహణకు అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. పది ఎకరాల స్థలాన్ని 1.71 ఎకరాల చొప్పున నాలుగు భాగాలుగా విభజించారు. ఒక్కో భాగంలో 6,925 చొప్పున 27,700 మొక్కలు నాటనున్నారు. 1.56 ఎకరాల్లో 3,300 మొక్కలు నాటుతారు. కంచెకు 0.14 ఎకరం, దారులకు 0.69 ఎకరం పోగా.. మిగిలిన 30గుంటల స్థలంలో వృత్తాకారంలో ఆట స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు.
పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఇది. ఒకేచోట 31వేల చెట్లు ఉండటం చాలా అరుదు. కేవలం అడవుల్లో మాత్రమే పెద్ద సంఖ్యలో చెట్లను చూడగలుగుతాం. ఇప్పుడు బృహత్ వనాల పుణ్యాన మండలానికి ఒక చిట్టడవి ఆవిష్కృతం కానున్నది.
త్వరలో 100శాతం పూర్తికి చర్యలు…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేకంగా బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తు న్నాం. ఈ నెల 10నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే చాలా పనులు పూర్తయ్యాయి. భారీ వర్షం కురిస్తే ఒకే రోజు మాస్ ప్లాంటేషన్ చేపట్టి పూర్తి చేస్తాం.
నల్లగొండ ఒకే రోజు 12 వేల మొక్కలు
నల్లగొండ రూరల్, ఆగస్టు 7 : నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి మెగా ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 20 వేల మొక్కలు నాటించాలని ప్రణాళికలు రూపొందించారు. వారం రోజుల కిందట ఒకే రోజు పంచాయతీ కార్మికులు, వాచర్లు, ఉపాధి కూలీల సాయంతో రికార్డు స్థాయిలో 12వేల మొక్కలు నాటారు. ఉన్నతాధికారులు సైతం పరిశీలించి సంబంధిత సిబ్బందిని ప్రశంసించారు. మొక్కల సంరక్షణకు ఐదుగురిని నియమించడంతో పాటు డ్రిప్ ఏర్పాటు చేస్తున్నారు.
కొత్తపల్లి గ్రామంలో 6ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. 20మొక్కలు నాటించాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటికే 12వేల మొక్కలను నాటించాం. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా చిట్టడవిగా మారుస్తాం.
నేరేడు, ఉసిరి, టేకు, వెలగ, వేప, ఇప్ప, చందనం, రేగు, సీమచింత, కుంకుడు, పనస, చింత, నెమలినార, ఈత, హెన్నా, సీతాఫలం, జామ, దానిమ్మ, కరివేపాకు, నిమ్మ, తాటి, వెదురు, జమ్మి, వావిలి, తంగేడు, అడ్డసారం, పారిజాతం, తిప్పతీగ, పొడపత్రి, జీవ కంచె కోసం వెదురు, గచ్చకాయ, గోరింట.