రామగిరి, సెప్టెంబర్ 5 :విద్య ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం టీచర్స్ డే సందర్భంగా నల్లగొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించి మాట్లాడారు. దేశంలో ఉపాధ్యాయ వృత్తి ప్రత్యేకమైనదని, సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా కాకుండా ఉపాధ్యాయ వృత్తికి ప్రాధాన్యమిచ్చారని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం విద్య అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజల మధ్య అంతరాలు సృష్టించారని, చిన్నదేశాలు కూడా భారత దేశం మీదికి దండయాత్ర చేశాయని గుర్తు చేశారు. ఒకప్పుడు దేశంలో విద్య ఎంతగానో పరిఢవిల్లిందని, ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, కానీ కొందరి స్వార్థం వల్ల విద్య ప్రజలకు దూరమైనదన్నారు. అంబేద్కర్, పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదని చెప్పారు. ఒక తరానికి మంచి విద్యను అందిస్తే ఆ జాతి ఎంతో అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ భావిస్తారని, అందుకే రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
విద్య ద్వారానే వెలుగు వస్తుందని, తద్వారా మనిషి తానేంటో నిరూపించుకోగలుగుతాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సమాజ మార్పు కోసం పరితపించే వారే ఉపాధ్యాయులని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్లగొండలోని చిన్న వెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఎనలేని గౌరవం ఉన్నదని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతరమైన బాధ్యత వారిపై ఉన్నదని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. వృత్తికి అంకితమై పనిచేసే ఉపాధ్యాయులు తమ బాధ్యతను అంకితభావంతో నిర్వర్తించి భవిష్యత్ తరానికి ఆదర్శవంతులుగా నిలువాలని ఆకాంక్షించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యాబోధనలో నైపుణ్యాలు పెంచుకుని నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 205 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, డీఈఓ బి.భిక్షపతి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు, ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.