నల్లగొండ, ఆగస్టు 23 ;వరుణుడి కరుణతో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో నీటి వనరులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా నీటి నిల్వలు తొణికిసలాడుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం, హరితహారం కార్యక్రమాల ఫలితంగా వానలు సకాలంలో కురిసి సాగును సస్యశ్యామలం చేస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 30.1, సూర్యాపేటలో 32 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. దాంతో భూగర్భ జలాలు సైతం పైపైకి ఉబికి వస్తున్నాయి. ప్రస్తుతం మోతె మండలంలో 0.89 మీటర్లు, నకిరేకల్‌లో 1.96 మీటర్లలోపే నీళ్లున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తిరుమలగిరి మండలంలో 30 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు 3 మీటర్లలోపే లభ్యమవుతున్నాయి. రెండు జిల్లాల్లో మెరుగుపడిన ఈ పరిస్థితికి వానలకుతోడు ప్రతి
సీజన్లో కృష్ణా, గోదావరి, మూసీ జలాలు దోహదపడుతున్నాయి.
సమృద్ధిగా భూగర్భ జలాలు..
నైరుతి రుతు పవనాలకు తోడు అల్పపీడనం కారణంగా నల్లగొండ జిల్లాలో గత నెలలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. దాంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా సగటు భూగర్భజలాలు 6.38 మీటర్ల లోపు ఉండగా ఈసారి 2 మీటర్లలోపే లభ్యమవుతున్నాయి. ఈ సీజన్లో నకిరేకల్‌లో 1.96 మీటర్ల లోపే భూగర్భ జలాలు ఉండగా 14మండలాల్లో ఐదు మీటర్లలోపు, 15 మండలాల్లో 10మీటర్ల లోపు ఉన్నాయని భూగర్భ జల వనరుల శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. చందంపేట మండలంలో మాత్రం 16.51 మీటర్ల లోపు నీరు అందుబాటులో ఉన్నది. తాజాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల కొనసాగుతుండటం, మరో రెండు నెలలు సీజన్ ఉన్నందున భూగర్భజలాలు మరింత పెరిగే అవకాశం ఉన్నది.
30.1శాతం అదనపు వర్షపాతం..
అధిక వర్షాలతో జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటికే అదనపు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 31 మండలాలు ఉండగా తిరుమలగిరి సాగర్, త్రిపురారం, దామరచర్ల, పెద్దవూర మండలాల్లో మైనస్ వర్షపాతం నమోదు కాగా చండూరు, అనుముల, నిడమనూరు, వేములపల్లి, మిర్యాలగూడ, మర్రిగూడ, పీఏ పల్లి, నేరేడుగొమ్ము, కొండ మల్లేపల్లి మండలాల్లో సాధారణ వర్ష పాతం నమోదైంది. మిగిలిన 18 మండలాల్లో అదనపు వర్షపాతం రికార్డు అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఇక ఈ సీజన్లో జూన్‌లో సాధారణ వర్షపాతం 85.2 మిల్లీమీటర్లు కాగా 93.1 మి.మీ. కురవడంతో 9.3శాతం అదనంగా నమోదైంది. ఇక జూలైలో 145.2 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను 248.1మి.మీ. పడటంతో 70.9 మి.మీ. అదనపు వర్షపాతం రికార్డు కాగా ఈ నెలలో 137.3 మి.మీ.వర్షానికి గాను ఇప్పటి వరకు 81.6 మి.మీ. కురిసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 324.9 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 422.8 మిల్లీమీటర్లు పడటంతో మొత్తంగా 30.1శాతం అదనంగా నమోదైంది.
8.84లక్షల ఎకరాల్లో పంటల సాగు..
జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలం సీజన్లో 8,84,552 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. అత్యధికంగా పత్తి పంట 6,50,511 ఎకరాల్లో సాగు చేయగా వరిని 1,95,659 ఎకరాల్లో సాగు చేశారు. ఇక జీలుగు, పొద్దు తిరుగుడు, కంది, పెసర, జొన్న, మొక్క జొన్న పంటలు మరో 38,382 ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది సీజన్ ఆసాంతం 11.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా అత్యధికంగా పత్తి 6.53లక్షల ఎకరాల్లో వరి 4.62 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఈ సీజన్లో సైతం వరిసాగు పెరగటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. ఇప్పటికే నాన్ ఆయకట్టు కింద వరి సాగు పూర్తయినప్పటికీ సాగర్ ఎడమ కాల్వ, వరద కాల్వ, హైలెవల్ కాల్వలతో పాటు మూసి ప్రాజెక్టు కింద వరి సాగు మరో రెండు లక్షల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అదికారులు చెబుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం జలాల రాకతో..
సూర్యాపేట, ఆగస్టు 23 : రాష్ట్ర ఏర్పాటు నాడు 25 నుంచి 30 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలతో నేడు సూర్యాపేట జిల్లాలో సగటున కేవలం 3.50 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉప్పొంగుతున్నాయి. జూలై నెలలో మోతె మండలంలో ఏకంగా ఒక మీటరు కంటే తక్కువ లోతులో భూగర్భ జలాలు అందు బాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం రెండు మీటర్ల లోతు భూగర్భజలాలు కలిగిన మండ లాలు 4, మూడు మీటర్ల లోతు ఉన్నవి 7, నాలుగు మీటర్ల లోతు ఉన్నవి 7, ఏడు మీటర్ల లోతు భూగర్భ జలాలు ఉన్నవి 3 ఉన్నాయి. కేవలం చింతలపాలెంలో మాత్రమే 9 మీటర్ల లోతులో జలాలు ఉన్నాయి.
భుగర్భ జలాల వివరాలు..
జూలై నెలలో జిల్లాలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. జిల్లాలో సగటున 3.38 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. మోతె మండలంలో కేవలం 0.89 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. జిల్లాలోని 23 మండలాల పరిధిలో భూగర్భ జలాల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి 2.04 మీటర్లు, చిలుకూరు-2.31, చింతలపాలెం-8.73, హుజూర్నగర్-2.86, కోదాడ-2.26, మఠంపల్లి-4.15, మేళ్లచెర్వు-6.30, మునగాల-3.18, నడిగూడెం-3.10, ఆత్మకూర్(ఎస్)-1.90, చివ్వెంల-1.75, గరిడేపల్లి-3.96, జాజిరెడ్డిగూడెం-3.13, మద్దిరాల-2.11, మోతె-0.89, నాగారం-1.68, నేరేడుచర్ల-3.96, నూతనకల్-2.34, పాలకవీడు-6.28, పెన్‌పహాడ్-3.62, సూర్యాపేట-3.65, తిరుమలగిరి-2.95, తుంగతుర్తి-1.80 మీటర్లుగా ఉన్నాయి.
30 నుంచి 3 మీటర్లకు..
భూగర్భ జలాల పెరుగుదలకు తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలమే నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు జిల్లాకు రాక ముందు తిరుమలగిరి మండలంలో భూగర్భ జలాలు ఏకంగా 30 మీటర్ల లోతులో ఉండేవి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాల రాకతో మండలంలో భూగర్భజలాలు ఒక్క సారిగా పెరిగాయి. మండలంలో అప్పటి వరకు 30 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రసుత్తం 3 మీటర్లకే అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో అత్యంత లోతులో భూగర్భ జలాలు ఉన్న మండలం ఇప్పుడు తక్కువ లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న మండలంగా మారింది.
నిండుకుండలా 519 చెరువులు..
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరింది. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా ఐదు విడుతల్లో చెరువుల్లో పూడిక తీసి పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో వేసవిలోనూ చెరువులు అడుగంటలేదు. దానికితోడు గత నెలలో జిల్లాలో కురిసిన వర్షాలతో చెరువులకు జళకళ సంతరించుకుంది. జిల్లాలో మొత్తంగా 1,927 చెరువులు ఉండగా అందులో 383 చెరువుల్లో 0-25శాతం నీటి నిల్వలు ఉండగా 525 చెరువుల్లో 25-50శాతం, 490 చెరువుల్లో 50-75శాతం నిల్వలున్నాయి. 474 చెరువుల్లో 75నుంచి 100 శాతం నీటి నిల్వలు ఉండగా 55 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. గత నెల వర్షాలకు జిల్లాలో 108 చెరువులు మత్తడి దూకగా ఇటీవల ఆ నీరు కాస్త తగ్గింది. సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడం అంతకుముందే ఎడమకాల్వతో పాటు ఏఎంఆర్పీ హైలెవల్, లో లెవల్ కాల్వలు, మూసీ ప్రాజెక్టుకు నీటి విడుదల చేసన నేపథ్యంలో చెరువుల్లోకి నీటి నిల్వలు భారీగా చేరుకొని నిండుకుండలా మారాయి.