
‘భరోసా కేంద్రం దేశంలోనే తొలి ప్రయోగం. మహిళల హక్కులను కాపాడడంతోపాటు
బాధితులకు అన్ని రకాల సేవలు అందిస్తూ తెలంగాణ పోలీసులు భరోసాను విజయవంతం చేసి ఆదర్శంగా నిలిచారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన భరోసా భవనం, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్(టీటీసీ)ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు చట్టపరంగా ఉండే హక్కులు, న్యాయ సాయం, వైద్య సేవలు అందించడం, నేరస్తులకు శిక్ష పడేలా చేయడంలో భరోసా కేంద్రం కీలకంగా పని చేస్తుందన్నారు. స్పష్టమైన అవగాహనతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దేశంలోనే ఎవరూ సాటి లేరని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దడంతో శాంతి భద్రతల విషయంలో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని తెలిపారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా, ఐజీ శివశంకర్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఎస్పీ
రంగనాథ్ పాల్గొన్నారు.
నీలగిరి, ఆగస్టు 9 : మహిళ హక్కులను కాపాడడం, వారికి అన్ని రకాల సేవలు అందించడం కోసం దేశంలోనే రాష్ట్ర పోలీసులు చేసిన తొలి ప్రయోగం భరోసా కేంద్రం అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్(టీటీసీ)ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక కొత్త కార్యక్రమాలను ఆవిష్కరిస్తున్న విధి నిర్వహణలో పోలీసులు ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఆ శాఖలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. వాహనాలు, వేతనాల విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకున్నారన్నారు. ఇతర రాష్ర్టాల్లో నేరాల అదుపునకు రాష్ట్ర పోలీసుల సహకారం తీసుకోవడమే మన పోలీసుల పనితీరుకు నిదర్శనమన్నారు. సంక్షేమ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పోలీసుల భాగస్వామ్యం, ప్రజలు, ప్రభుత్వం మెచ్చుకునేలా పోలీసులు పనిచేయడం అభినందనీయమన్నారు. భరోసా కేంద్రంలో మరిన్ని సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తాన్నారు.
శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు తరువాత దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ తయారైందన్నారు. దేశంలో హైదరాబాద్ అత్యంత ముఖ్యమైన నగరమని, పోలీసులు చేస్తున్న ఎన్నో కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పోలీస్‌శాఖకు అత్యంత ప్రాధాన్యమిచ్చి అనేక మార్పులు చేశారన్నారు. రాష్ట్రంలో 50శాతం ఉన్న మహిళల భద్రత కోసం దేశంలోనే మొదటిసారిగా షీటీమ్స్ ఏర్పాటు చేశారన్నారు. ఎక్కడా లేని విధంగా ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేసి నాణ్యమైన, సమర్థవంతమైన సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో 9 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తరువాత పోలీస్ స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మైనర్లు ఇబ్బందులు పడుతున్నారని, యువతులు, మహిళలకు చట్టాలపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు షీటీమ్స్‌పై రూపొందించిన పాటలను ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా, ఐజీ శివశంకర్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్, డీఎఫ్ఓ రాంబాబు, ఏఎస్పీ నర్మద, ఐసీడీఎస్ పీడీ సుభద్ర, సీడీపీఓ నిర్మల, భరోసా కేంద్రం దాతలు ఎస్పీ రెడ్డి, గుమ్మి రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, ఐసీడీఎస్ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి పాల్గొన్నారు.