
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కొత్త జోన్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం క్యాడర్ స్ట్రెంత్ విభజనతో మరింత స్పష్టతనిచ్చింది. స్థానికతకు పెద్దపీట వేస్తూ, సమన్యాయాన్ని పాటిస్తూ జీఓలు విడుదల చేయడంపై ఉద్యోగులు, సంఘాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే జోన్లను ప్రకటించిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాతోపాటు జనగామ జిల్లాను కలుపుతూ యాదాద్రి జోన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లతో కలిపి మల్టీ జోనల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. వీటి ఆధారంగానే శాఖల వారీగా ఉద్యోగాలను కూడా మూడూ కేడర్లుగా విభజిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఉద్యోగాలు ఏ పరిధిలోకి వస్తాయనేది స్పష్టం కావడంతో ఖాళీల సంఖ్య, భర్తీకి నోటిఫికేషన్లు, బదిలీలు, పదోన్నతులు మరింత సులభం కానున్నాయి. దీంతో స్థానికులకు 95శాతం రిజర్వేషన్లు, ఓపెన్ కోటాలో 5 శాతమే ఉద్యోగాలకు అవకాశం ఉండనున్నది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ అంశాలల్లో ఏ స్థాయి ఉద్యోగులు వస్తారనే అంశాలతో ఉత్తర్వులు రావడంతో ఉమ్మడి జిల్లా ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.
ఉద్యోగ నియామకాలు జరుగాలన్నా, పదోన్నతులు లభించాలన్నా క్యాడర్ స్ట్రెంత్ కీలకం. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ప్రతిపాదికనే అర్హులైన వారికి పదోన్నతులు కల్పించారు. కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినా…. జిల్లాల వారీగా క్యాడర్ స్ట్రెంత్ వర్గీకరణ జరుగలేదు. తాజాగా ప్రభుత్వం క్యాడర్ స్ట్రెంత్‌ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా, జోనల్, మల్టీజోనల్‌లో ఎవరెవరు వస్తారనే విషయమై స్పష్టత రాగా.. నేరుగా నియమించే అధికారుల పోస్టుల్లో వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థులకు అవకాశం కలుగుతుండటం విశేషం. పదోన్నతులు, నియామకాలు కూడా ఇక ముందు దీని ప్రకారం ఉండనున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న క్యాడర్‌స్ట్రెంత్ నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు లాభం కలుగనున్నది. ఏండ్ల తరబడి సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత ప్రాంతాలకు రావడానికి అవకాశం కలుగుతుంది. ఇతర జిల్లా, జోనల్లోని వారు ఇక్కడ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్తే స్థానికంగా ఏయే శాఖలో ఎన్ని ఖాళీలున్నాయనే స్పష్టత వస్తుంది. దీంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సులభమవుతున్నది. చిన్న జిల్లాల వారీగా కూడా క్యాడర్ స్ట్రెంత్ వర్గీకరణ జరుగడంతో జిల్లా పోస్టుల వారికి మరింత దగ్గరగా ఉద్యోగాలు చేసే అవకాశం లభించనున్నది. పాత పద్ధతి ప్రకారం దేవరకొండకు చెందిన వారు కూడా ఆలేరు, తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. కానీ కొత్త జిల్లాల ప్రకారం క్యాడర్ స్ట్రెంత్‌ను నిర్ణయించడంతో ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే పని చేసే అవకాశం ఏర్పడుతుంది.
పాత జోనల్ వ్యవస్థ ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు కలిపి ఆరో జోన్ కింద ఉండేది. ఈ జిల్లాల పరిధిలోని వారంతా ఈ జోన్లో ఎక్కడైనా పని చేయాల్సి వచ్చేది. అయితే నిజామాబాద్, మెదక్ లాంటి ప్రాంతాలు ఇక్కడి నుంచి దూరంగా ఉన్నాయి. కొత్త జోనల్ వ్యవస్థతో ఉమ్మడి జిల్లా ఉద్యోగులు యాదాద్రి జోన్ పరిధిలోకి వచ్చే నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగాం జిల్లాల్లోనే పనిచేసే అవకాశం లభిస్తుంది. మల్టీ జోనల్ పోస్టులు అయితే యాదాద్రి జోన్ పరిధిలో చార్మినార్, జోగులాంబ జోన్లు మాత్రమే వస్తాయి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలకు ఇందులో నుంచి వెళ్లిపోవడం వల్ల ఆయా స్థాయిల్లోని ఉద్యోగులకు దూరభారం తగ్గనుంది. తాజాగా కొత్త జోన్లు, క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణ కావడంతో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యశాఖలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు వచ్చే అవకాశం లభిస్తుంది. ఆప్షన్ల అవకాశం ఇవ్వనున్నారు. క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయంతో స్థానిక ప్రాంతాలవారికి ప్రాధాన్యం లభిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో పనిచేసే వారు తమ ప్రాంతాల అభివృద్ధిలో మరింత చిత్తశుద్దితో భాగస్వాములు కావచ్చు.
ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చిన జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థతోపాటు క్యాడర్ స్ట్రెంత్తో సమాజ సమన్యాయం జరుగుతుంది. జిల్లాస్థాయిలో వివిధ శాఖ ఖాళీల భర్తీపై స్పష్టత వస్తుండంగా ఆ ప్రాంత వాసులకు అవకాశాలు వస్తాయి. దీని ద్వారా వలసల నియంత్రణతోపాటు స్వయం సమృద్ధి సాధించడానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు త్వరగా వస్తాయి. సొంత ప్రాంతాలకు వచ్చి సేవచేసే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా స్వాగతించేదే.