Thimmareddy Gudem : మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో అమ్మతనానికి మచ్చ తెచ్చే ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు కడుపున మోసిన బిడ్డను ఆ తల్లి ఎందుకనో అక్కర్లేదు అనుకుంది. అప్పుడే పుట్టిన పసికందు (New Born Baby)ను ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆమె నిర్దయగా.. ఆదివారం ఓ వీధిలోని గాబులో విడిచిపెట్టి వెళ్లిపోయింది. కొద్ది సేపటికి ఆ వీధిలో ఆడుకుంటున్న పిల్లలకు పసికందు ఏడుపు వినపించింది. దాంతో, వాళ్లు పక్కనే ఉన్న నీళ్లు లేని గాబులో చూడగా చంటిబిడ్డ కనిపించింది.
ఆ పిల్లలు పరుగున వెళ్లి.. చుట్టుపక్కల మహిళలకు సమాచారం ఇచ్చారు. వారంతా వచ్చి ఆ పసికందును అక్కున చేర్చుకున్నారు. అనంతరం ఆరోగ్య సిబ్బందికి తెలియజేశారు. అక్కడికి చేరుకున్న ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది సదరు శిశువును సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే.. ఆ చంటిబిడ్డను తల్లిదండ్రులు ఎందుకు అలా వదిలేసి వెళ్లారు? అనేది తెలియాల్సి ఉంది.