కోదాడ : మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డు నుంచి బీఆర్ఎస్ గెలుపు షురూ కావాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలో 19వ వార్డులో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కౌన్సిలర్ అభ్యర్థిగా అజంత తుమ్మలపల్లిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోట్లాది రూపాయలు నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించిన చరిత్ర బీఆర్ఎస్కు ఉందని ఆయన తెలిపారు.
అలవి కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలో మునిసిపాలిటీ అస్తవ్యస్తంగా తయారయిందని మల్లయ్య యాదవ్ విమర్శించారు. రెండు సంవత్సరాల కాలంలో పట్టణం మురికి కూపంగా మారిందని, ప్రజలే బహిరంగంగా విమర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వార్డులో అన్ని వర్గాల మన్ననలు పొందిన అజంతా తుమ్మలపల్లికి మద్దతు ఇవ్వాలని కోరారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం ఖాయని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీం, సీనియర్ నాయకులు పైడిమరి సత్యబాబు, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, తుమ్మలపల్లి భాస్కర్, కర్ల సుందర్ బాబు, సంగిశెట్టి గోపాల్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.