చివ్వెంల, డిసెంబర్ 25 : కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్కు గురై తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన చివ్వెంల మండల కేంద్రంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని 7జీ కాలనీలో నివాసం ఉంటున్న మాదాసు బుచ్చయ్య (48) సొంత పైసలతో కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇంటి నిర్మాణానికి బుధవారం మట్టి తరలింపు పనులు చేపట్టారు.
గురువారం సాయంత్రం పిల్లర్లకు నీళ్లు కొట్టేందుకు ట్రాక్టర్ ట్యాంకర్లో మోటర్ వేసి, నీళ్లు కొడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో బుచ్చయ్య కుప్పకూలాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన చిన్న కుమారుడు మాదాసు లోకేష్ (22) సైతం ట్యాంకర్ను తాకడంతో అతడూ విద్యుత్ షాక్కు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి తండ్రీకొడుకులను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బుచ్చయ్య, లోకష్ను పరిశీలించిన వైద్యులు వారిద్దరు అప్పటికే ఇద్దరూ మృతి చెందారని చెప్పారు. తండ్రీకొడుకు ఒక్కసారే మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.