యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. లక్ష మందితో భారీ స్థాయిలో సభను నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో ఆ దిశగా జన సమీకరణకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ మండలాల వారీగా బాధ్యతలు అప్పగించి సభ విజయవంతంపై దృష్టి పెట్టారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా జనాన్ని తరలించేందుకు కృషి చేస్తున్నారు. దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బుధవారం మరోసారి సీఎం సభాస్థలిని పరిశీలించారు.
లక్ష మందితో భారీ సభ
భువనగిరి సభను లక్ష మందితో నిర్వహించాలని సంకల్పిస్తున్న నేపథ్యంలో ప్రతి పల్లెకూ వాహనాన్ని పంపి భారీగా జనాన్ని తరలించేలా ఏర్పాట్లు జరుగతున్నాయి. ఈ మేరకు జిల్లాలోని 17మండలాల నుంచి ఎప్పటి మాదిరిగానే జనసమీకరణ భారీగా ఉండేలా పార్టీ శ్రేణులు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం ఎప్పటికప్పుడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు భారీగా వచ్చేలా దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాలో ప్రతీ మండలం నుంచి 6వేల మందికి తగ్గకుండా సభకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులందరూ మండల, గ్రామ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలను భాగస్వామ్యులు చేసి సభకు జనాన్ని తేవాల్సిన బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇప్పటికే భువనగిరి, బీబీనగర్ మండలాల్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి జన సమీకరణకు సంబంధించిన కార్యాచరణ అమలుపై పార్టీ శ్రేణులను సమాయత్తపర్చి జోష్ నింపారు. బుధవారం జిల్లావ్యాప్తంగా అన్ని మం డలాల్లోనూ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశాల్లో సభ విజయవంతానికి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.
సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
భువనగిరిలో సీఎం సభ ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. జన సమీకరణ ఏర్పాట్ల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి సీఎం సభను జయప్రదం చేయాలని కోరారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం ఉదయం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి సభా స్థలి వద్ద జరుగుతున్న పనులు పరిశీలించారు.