కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలపై సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామంలో ఎండిన పొలాల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాల్వల ద్వారా కాళేశ్వరం నీళ్లను పారిస్తే.. నేడు కాంగ్రెస్ పాలనలో రైతుల కండ్లలో కన్నీళ్లు పారుతున్నాయని అన్నారు. మండలంలో ఏ గ్రామానికి వెళ్లిన ఎండిన పొలాలే దర్శనమిస్తున్నాయని తెలిపారు. నీళ్లు లేక ఎండిన పొలాన్ని చూసిన రైతులు గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పంట పొలాలకు ప్రతి ఎకరానికి రూ.15వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.