ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 30, 2020 , 03:06:59

రైతు బీమా రాలే సారూ..

రైతు బీమా రాలే సారూ..

  • ఆన్‌లైన్‌లో భూమిని మాయం చేసి బీమా ఇస్తలేరు..
  • l  మూడు సార్లు రైతు బంధు డబ్బులు కూడా వచ్చినయి 
  • l  తల్లిదండ్రులను కోల్పోయి కష్టపడుతున్న అన్నదమ్ముళ్లుచిత్రంలో కన్పిస్తున్న ఈ ఇద్దరు యువకులు అన్నదమ్ముళ్లు. తండ్రిని కోల్పోయిన వీరు మూడు నెలల కిందట తల్లిని కూడా పోగొట్టుకున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కులేక కూలి పనులకు వెళ్లి కష్టపడుతున్నారు. తల్లి పేరిట 1.02ఎకరాల భూమి ఉండడంతో రైతుబీమా కోసం దరఖాస్తు చేశారు. కానీ, ఆన్‌లైన్‌లో భూమి చూపించడం లేదంటూ అధికారులు తిరస్కరించారు. చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరగ్గా బీమా దరఖాస్తు గడువు ముగిసిన తర్వాతే ఆన్‌లైన్‌లోకి ఎక్కించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బీమా డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. శాలిగౌరారం మండలంలోని శాలిలింగోటం గ్రామానికి చెందిన చింత పరశురాములు,  అవనిజ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కాగా, అనారోగ్యం కారణంగా పరశురాములు కొన్నేండ్ల కింద మరణించగా అతని భార్య అవనిజ సైతం గత 3నెలల క్రితం మృతి చెందింది. కాగా ఆమె పేరున శాలిలింగోటం శివారులో సర్వే నెంబర్‌ 210/3లో 1.02ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. అవనిజ అకాల మరణం అనంతరం ప్రభుత్వం అందించే రైతుబీమా కోసం వివరాలతో సహా వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా అసలు విషయం బయటపడింది. వ్యవసాయాధికారులు వివరాలను సేకరించే క్రమంలో అవనిజ పేరు మీద భూమి లేదని చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లి అడగ్గా ఆన్‌లైన్‌లో పేరు లేదని తెలుపడంతో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం అందించే రూ.5లక్షల రైతుబీమా అందకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాసిల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరగ్గా చివరికి రైతుబీమాకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిశాక ఆన్‌లైన్‌లో ఎక్కించినట్లు చూపించారని వారు తెలిపారు.  
 కలెక్టర్‌కు ఫిర్యాదు.. 
అమ్మానాన్నలతోపాటు ప్రభుత్వం అందించే రైతుబీమా సైతం తమకు అందడం లేదని ఈనెల 24న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సోదరులు చింత హరిప్రసాద్‌, రాములు తెలిపారు. మా అమ్మ పేరున ఉన్న ఎకరం భూమి మాయమైందని, తమకు న్యాయం చేసి రైతుబీమా అందించాలని వేడుకున్నట్లు చెప్పారు. బస్‌చార్జీలకు సైతం డబ్బులు లేవని, కూలీకి పోతే వచ్చిన డబ్బులతో చార్జీలు పెట్టుకొని నల్లగొండ వెళ్లామని విలపించారు. 
  తాసిల్దార్‌ వివరణ..
చింత అవనిజ పేరు మీద ఉన్న భూమి తనకంటే ముందు ఉన్న తాసిల్దార్‌ హయాంలో రికార్డుల్లో లేదని శాలిగౌరారం తాసిల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో భూమిని ఎక్కించినట్లు చెప్పారు. అవనిజ మరణానంతరం రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆమె పేరున ఆన్‌లైన్‌లో భూమి కనిపించలేదని మండల వ్యవసాయాధికారులు తెలిపారు.  


logo