సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - May 01, 2020 , 02:34:57

కరోనా జాడ లేకుండా జల్లెడ పట్టినం

కరోనా జాడ లేకుండా జల్లెడ పట్టినం

  • కేసులు తగ్గినయ్‌.. బాధితులంతా కోలుకుంటున్నరు..
  • పరీక్షలు నిర్వహిస్తలేదనడం అనాలోచితం
  • ఆకలితో ఏ ఒక్కరూ ప్రస్తులుండొద్దన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష
  • తప్పుడు ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదు
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • తెల్ల రేషన్‌కార్డు లేని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ

సూర్యాపేట టౌన్‌ : కరోనా మహమ్మారి జాడ ఉమ్మడి జిల్లాలో ఉండకూడదనే ఎక్కడికక్కడ కట్టడిచేసి బాధితులతో పాటు అనుమానితులను జల్లెడపట్టి నియంత్రణ చర్యలు చేపట్టామని.. అందువల్లే కేసులు తగ్గుముఖం పట్టి ఒక్కొక్కరుగా కోలుకుంటూ డిశ్చార్జి అవుతున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘పేట’ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం దాతల సహకారంతో సేకరించిన బియ్యం, నిత్యావసర సరుకులను 600 మంది పేద కుటుంబాలకు మంత్రి పంపిణీ చేశారు. రేషన్‌కార్డు లేని పేదలను గుర్తించి ఒక్కొక్కరికి 15కిలోల బియ్యం, ఇతర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్‌ అతి తక్కువ సమయంలో విస్తృతంగా వ్యాపించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు అధికారులను అప్రమత్తం చేసి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో కొత్త కేసులు నమోదు కావడం లేదన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే  ఉమ్మడి నల్లగొండను కరోనా రహిత జిల్లాగా మార్చుకునే అవకాశం ఉంటుందన్నారు. విపక్ష నాయకుల మాటలకు అడ్డూ, అదుపులేకుండా పోయిందని, ప్రస్తుతం కరోనా బారినుంచి ఊపిరి పీల్చుకుంటూ ప్రజలంతా ప్రభుత్వ చర్యలను కొనియాడుతుంటే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైద్య పరీక్షలు నిర్వహించడం లేదనడం సరికాదన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తూ, విపత్కర పరిస్థితుల్లో సైతం విషబుద్ధిని ప్రదర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కరోనాపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఏ ఒక్కరూ పస్తులుండొద్దన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని, అందుకు పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఆయన ఆలోచనల మేరకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకారం అందించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ముందస్తు జాగ్రత్తలే తెలంగాణకు శ్రీరామరక్షగా నిలిచాయని, ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ప్రజలంతా విధిగా పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. అలాగే రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించి, కరోనా నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ దవాఖాన యాజమాన్యం డాక్టర్‌ రామకృష్ణ- విజయలక్ష్మి దంపతులు రూ.లక్ష చెక్కును మంత్రి జగదీశ్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, ప్రత్యేకాధికారి వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పుట్ట కిశోర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

భగీరథ నీరే సురక్షితం

  • కంటైన్మెంట్‌ జోన్‌ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
  • మున్సిపల్‌ పాలకవర్గంతో మంత్రి జగదీశ్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకం ద్వారా రూ.వేల కోట్లు వెచ్చించి స్వచ్ఛమైన నదీజలాలను అందిస్తున్నారని, బోరు వాటర్‌ కన్నా అవే శ్రేయస్కరమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం సూర్యాపేట మున్సిపల్‌ పాలకవర్గంతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. కౌన్సిలర్లు తమ ప్రాంతాల్లో వాటర్‌ ప్లాంట్లను ఓపెన్‌ చేయాలన్న అంశం చర్చకు రాగా మంత్రి జగదీశ్‌రెడ్డి భగీరథ నీటిపై స్పందించారు. బోరు నుంచి ఫిల్టర్‌ అయిన నీరు ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణతోపాటు వార్డు కౌన్సిలర్లు కరోనా కట్టడి అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. మున్సిపల్‌ కార్మికుల శ్రమ వెలకట్టలేనిదన్నారు. రెడ్‌జోన్‌తోపాటు కంటైన్మెంట్‌ పరిధిలోని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, నిత్యావసరాలు, ఇతర సహకారాలు అందజేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. మున్సిపల్‌  వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, ఓఎస్‌డీ వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ రామానుజులరెడ్డితోపాటు మున్సిపల్‌ కౌన్సిలర్లు ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


logo