శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 22, 2020 , 03:16:43

కరోనాపై భయం వద్దు..జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనాపై భయం వద్దు..జాగ్రత్తలు తీసుకోవాలి

  • జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు లేవు
  •  అంతా కలిసికట్టుగా వైరస్‌ వ్యాప్తిని నివారిద్దాం
  •  నేటి జనతా కర్ఫ్యూకు అంతా సహకరించాలి 
  •  కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
  •  ఎవరు బయట కొచ్చినా కట్టడి తప్పదు: ఎస్పీ  

కరోనా వైరస్‌ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అలాగని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైరస్‌ వ్యాప్తి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్పీ భాస్కరన్‌తో కలిసి సర్వమతాల పెద్దలతో సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని తెలిపారు.  అంతా కలిసికట్టుగా నేటి జనతా కర్ఫ్యూకు సహకరించాలని కోరారు. ఎస్పీ భాస్కరన్‌ మాట్లాడుతూ.. కర్ఫ్యూ అనేది అధికారుల నుంచి కాకుండా ప్రజల నుంచే ఉండాలని పేర్కొన్నారు. నేటి కర్ఫ్యూకు అందరూ సహకరించాలని, ఎవరైనా  అతిక్రమించి  బయటికొస్తే కట్టడి తప్పదని హెచ్చరించారు.

సూర్యాపేట జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌తో భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ భాస్కరన్‌తో కలిసి సర్వమతాల పెద్దలతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క పాజిటీవ్‌ కేసు నమోదు కాలేదని, ఇతర దేశాల నుంచి వచ్చిన 55మందిని గుర్తించి పరీక్షలు చేసి హోం క్వారంటీన్‌ చేశామని తెలిపారు. ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఏకంతంగా పూజలు నిర్వహించి, భక్తులను రాకుండా కట్టడి చేయాలని  సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 1 నుంచి విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారందరినీ గుర్తిస్తూ క్వారంటీన్‌ చేస్తున్నామని, ఇప్పటి వరకు 55 మందిని గుర్తించగా ఒక్కటి కూడా పాజిటీవ్‌ కేసు నమోదు కాలేదన్నారు. 14 రోజుల వరకు ఎవరు బయటకు వచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఇప్పటి వరకు అనుమానం వచ్చిన వారిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా, అత్యవసరం అనుకుంటే సూర్యాపేట జనరల్‌ దవాఖానాలోనే ఉంచేలా 20 పడకల ఐసోలేషన్‌ వార్డులు, 5 పడకలతో ఐసీయూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విపత్కర పరిస్థితులు వస్తే ముందస్తుగా మరో 7 చోట్ల భారీ ఎత్తున ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు భవనాలను గుర్తించామన్నారు.

బయటకు వస్తే కట్టడి తప్పదు : ఎస్పీ భాస్కరన్‌ 

కరోనా కట్టడి కోసం ఆదివారం జరిగే జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ భాస్కరన్‌ హెచ్చరించారు. నేడు గ్రామ దేవతల పండుగలను చేసుకుంటున్నట్లు సమాచారం వచ్చిందని, అలాంటి వాటిని కుటుంబసభ్యుల వరకే చేసుకోవాలని, బంధువులను పిలిస్తే పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు. జిల్లాకు ఉన్న అంతర్రాష్ట్ర లింకులైన రామాపురం, మఠంపల్లి, చింతలపాలెం మండలం బుగ్గమాదారం, పులిచింతల రోడ్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరినీ పరీక్షించి అనుమతిస్తున్నామని తెలిపారు. ఈ నెల 31 వరకు ఫంక్షన్‌హాళ్లలో ఫంక్షన్లు చేసుకోవచ్చని, 200లకు మించి జనం హాజరుకావద్దని ఆదేశించామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 38 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షల అనంతరం హోం క్వారంటైన్‌ చేశామని తెలిపారు. 


logo