శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 16, 2020 , 02:22:44

టీఆర్‌ఎస్‌ సునామీ

టీఆర్‌ఎస్‌ సునామీ

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 111 పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)లు ఉండగా.. 109స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కట్టంగూర్‌ పీఏసీఎస్‌ పాలకవర్గం గడువు 2021వరకు ఉండగా.. ఓట్ల తొలగింపు ఫిర్యాదు కారణంగా గరిడేపల్లి మండలం పొనుగోడు పీఏసీఎస్‌ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. 109స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. టీఆర్‌ఎస్‌ బలపరిచిన డైరెక్టర్‌ సభ్యులు 96పీఏసీఎస్‌ల పరిధిలో మెజార్టీ స్థానాలు దక్కించుకున్నారు. శనివారం ఉదయం పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సభ్యులకు పోలింగ్‌ జరగ్గా.. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా అంతటా ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతూ వచ్చింది. అంతకు ముందే 20పీఏసీఎస్‌లను ఏకగ్రీవంగా గెలుచుకున్న టీఆర్‌ఎస్‌కు.. ఓట్ల లెక్కింపు తర్వాత ఆ సంఖ్య 96కు పెరిగింది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 10స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. నల్లగొండ మండలం గొల్లగూడ పీఏసీఎస్‌ పరిధిలోని 13వార్డులకు 6స్థానాలు టీఆర్‌ఎస్‌, 5వార్డులు కాంగ్రెస్‌, 2వార్డులు సీపీఎం గెలుచుకుంది. మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి పీఏసీఎస్‌లో 13వార్డులకు టీఆర్‌ఎస్‌ 6 స్థానాల్లో గెలవగా.. 7స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. హంగ్‌కు అవకాశం ఉన్న మూడు పీఏసీఎస్‌ల చైర్మన్‌ పీఠాలు సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే వరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 


టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా జై కొట్టిన రైతులు..

సహకార సంఘాల ఎన్నికల్లో రైతులు మొత్తం టీఆర్‌ఎస్‌కు ఘన విజయం కట్టబెట్టారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా.. నిరంతర విద్యుత్‌ సరఫరా, పంటలకు మద్దతు ధర కల్పించడంలోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న విషయమూ తెలిసిందే. పెద్ద రైతు కేసీఆర్‌ నాయకత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుపుతున్నామని చెప్తున్న టీఆర్‌ఎస్‌కు అన్నదాతలు పూర్తిస్థాయిలో మద్దతు పలికారు. 109పీఏసీఎస్‌లకు 96స్థానాలు ఆ పార్టీకి కట్టబెట్టి ఏకపక్ష మద్దతు ప్రకటించారు. నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరనుండగా.. 96తో పాటు మరో మూడు స్థానాలు సైతం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పక్షాన 10పీఏసీఎస్‌లు గెలుచుకోగా.. ఆయా డైరెక్టర్‌ సభ్యుల్లోనూ పలువురు ఆ పార్టీకి మద్దతు ప్రకటించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.      


logo