సాంకేతికతలో ముందడుగు వేసే దేశాల కన్నా.. ఆరోగ్యంగా ఉండే దేశాలే గొప్పవని ఆ యువకుడు నమ్మిన సిద్ధాంతం. భూమి తల్లిని పరిరక్షించడానికి, ఆ తల్లి బిడ్డలకు ఆరోగ్యాన్ని పంచడానికి సేంద్రియ సాగే మార్గమని నమ్మాడు. నష్టాలకు వెరవకుండా ఆ బాటలోనే అడుగులు వేస్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువరైతు తుప్పతి సురేష్. ఆయన చేస్తున్న సేద్యం సంగతులను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ.. సేంద్రియ సాగు గొప్పదనాన్ని వివరిస్తున్నాడు. లక్షల్లో ఫాలోవర్స్, మిలియన్లలలో లైక్‌లు సాధిస్తూ.. సంచలనం సృష్టిస్తున్న రైతుబిడ్డ సురేష్ ప్రస్థానం ఆయన మాటల్లోనే..
మాది యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో నాన్నతో కలిసి పొలానికి వెళ్తుండేది. మాకు పద్నాలుగు ఎకరాల పొలం ఉండేది. అందులో పత్తి, వరి సాగుచేసేవారు. అమ్మానాన్న తీరిక లేకుండా పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. నేను డిగ్రీ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడ్డాను. కానీ, రెండుసార్లు కానిస్టేబుల్ పరీక్షకు రాసినా కొద్ది మార్కుల తేడాతో క్వాలీఫై కాలేదు.
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని బెంగ పడలేదు. అమ్మానాన్నకు తోడుగా వ్యవసాయం చేయాలని నిశ్చయించుకున్నాను. సాగుబడిలో ఉన్న నాకు.. మా చేనులో ఎర్రలు, నత్తలు కనిపించడమే గగనమైంది. కృత్రిమ ఎరువులు, రసాయనాల వాడకమే దీనికి కారణం అనిపించింది. ఈ పరిస్థితిలో మార్పు కోసమే సేంద్రియ సాగువైపు అడుగులు వేయాలనుకున్నా. పాలేకర్ విధానం గురించి లోతుగా అధ్యయనం చేశా. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తానంటే.. పంట దిగుబడి రాదు, నష్టపోతాం అన్నారు అమ్మానాన్న. కానీ, దిగుబడి కన్నా.. ఆరోగ్యమే ముఖ్యమని, నేల తల్లిని కాపాడుకోవాలని వారికి నచ్చజెప్పి ఒప్పించాను.
తొలుత రెండు ఎకరాల్లో సేంద్రియ విధానంలో వరి, కూరగాయల సాగు మొదలుపెట్టాను. జీవామృతం, దేశీ ఆవుపాలతో చేసిన పుల్లటి చల్ల మొక్కలకు పిచికారీ చేసేవాణ్ని. వేప కషాయం, పంచద్రవ్యాలు తయారు చేసి పంటకు వేసేవాణ్ని. ఆ పంటలో లాభాలు రాకున్నా.. నష్టాలు మాత్రం కలగలేదు. సేంద్రియ సాగుతో లాభాలు రావని చాలామంది అనడంతో.. నా కష్టమంతా వృథా అయిపోతున్నదా అని ఆత్మైస్థెర్యం కోల్పోయిన రోజులూ ఉన్నాయి. కానీ, తొలిపంట గట్టెక్కడంతో నాలుగేండ్లుగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం కొనసాగిస్తున్నా. వరి, శనగలు, కందులు, కూరగాయలతోపాటు డ్రాగన్ ఫ్రూట్ కూడా వేశాను. ఎప్పుడూ నష్టాలు రాలేదు.
సేంద్రియ సాగుతో లాభాలు రావని చాలామంది అపోహ పడుతున్నారు. అలాంటివారికి కనువిప్పు కలిగించడానికే సురేష్.ఫార్మర్ అనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించాను. చానెల్ ప్రారంభించిన కొత్తలో చేసిన వీడియోల్లో కాస్త తడబడేవాణ్ని. సేంద్రియ సాగులో నేను పాటిస్తున్న విధానాలను ఆ వీడియోల్లో పంచుకునేవాణ్ని. చానెల్ సంగతి పదిమందికి చెప్పడంతో, వాళ్లు కామెంట్లు పెట్టి నన్ను ప్రోత్సహించారు. తర్వాత కొద్ది కాలంలోనే నా వీడియోలకు మంచి స్పందన వచ్చింది. చాలామంది నా వీడియోలు చూసి సేంద్రియ సాగు పద్ధతులను తెలుసుకొని, పాటిస్తున్నామని చెబుతున్నారు.
ఇప్పటి వరకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో 630 వీడియోలు అప్లోడ్ చేశాను. యూ ట్యూబ్ చానెల్‌ను 4.70 లక్షలమంది సబ్‌స్ర్కైబ్ చేసుకున్నారు. ఇన్‌స్టాలో 4.45 లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు మిలియన్ల కొద్దీ లైక్స్ వచ్చాయి. లైక్స్ కోసమో, షేర్స్ కోసమో నేనీ చానెల్ నిర్వహించడం లేదు. నా వీడియోలు చూసి పదిమందైనా సేంద్రియసాగుకు మొగ్గుచూపితే.. నేలతల్లి కష్టం తగ్గుతుందనే ఆశతో ఇదంతా చేస్తున్నాను. నాకు వనజీవి రామయ్య ఆదర్శం. ఆయన తన జీవితాన్ని ప్రకృతికే అంకితం చేశారు. లెక్కలేనన్ని మొక్కలు నాటి, ఎంతోమందికి ప్రాణవాయువు అందించారు. వారి ఆదర్శాలు కొనసాగించడంలో నా వంతు కృషి చేస్తాను.
నా భార్య పేరు మానస. మా బంధువుల అమ్మాయే. పెండ్లికి ముందే నేను చేస్తున్న సేంద్రీయ వ్యవసాయం గురించి తనకు చెప్పాను. నా వెంట నడవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. నాతోపాటే ఎండనక, వాననక వ్యవసాయపనుల్లో తోడుగా ఉంటున్నది. అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం.
– రాజు పిల్లనగోయిన