లండన్, ఫిబ్రవరి 9 : తెల్లవారుజామున 4.30 గంటలకు వస్తున్న కోడి కూత.. పక్కింటి వాళ్లను చాలా ఇబ్బందిపెట్టింది. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయటంతో సదరు కోడిపుంజును పెంచుకుంటున్న యజమానికి నోటీసులు అందాయి. ఉదయం 8 గంటల వరకు కోడి కూత వినిపించడానికి వీల్లేదు.. అనేది నోటీసు సారాంశం. ఇంగ్లండ్ కౌంటీ ‘నార్ఫోక్’లోని గ్రామీణ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దీనిపై గ్రామంలోని 600 మందికిపైగా ప్రజలు సదరు కోడిపుంజుకు మద్దతుగా నిలబడేందుకు ముందుకు వచ్చారు. పొద్దునే వినిపించే ఆ కోడి కూతే తమ గ్రామానికి గుర్తింపుగా వారంతా పేర్కొన్నారు. నోటీస్‌పై కోడి పుంజు యజమాని స్పందిస్తూ కౌన్సిల్ నోటీస్ తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. మెరుగైన రోడ్లు, చెత్త సేకరణపై కౌన్సిల్ దృష్టిపెడితే బాగుంటుందని హితవు పలికారు.