నువ్విక ప్రయాణించలేనపుడు
నువ్వు చదవలేనపుడు
జీవిత ధ్వనులను నువ్వు వినలేనపుడు
నువ్వు మెలమెల్లగా మరణించడం మొదలౌతుంది
నువ్వు నీ ఆత్మగౌరవాన్ని చంపుకున్నపుడు
వేరే ఎవ్వరినీ నీకు సహాయపడనివ్వనపుడు
నువ్వు మెలమెల్లగా మరణించడం ప్రారంభమౌతుంది
నువ్వు నీ అలవాట్లకు బానిసవైనపుడు
ప్రతిరోజూ ఆ దుష్టమార్గాల్లోనే నడుస్తున్నపుడు
నువ్వు నీ యాంత్రిక దినచర్యను మార్చుకోలేనపుడు
భిన్న వర్ణాలను నువ్వు ధరించలేనపుడు
అపరిచితులతో మాట్లాడలేకపోతున్నపుడు
మెలమెల్లగా నువ్వు మరణిస్తుంటావు
మోహానుభూతులను పరిత్యజిస్తున్నపుడు
నీ కళ్ళను కాంతివంతం చేసే మహోగ్ర ఆవేశాలనూ,
వేగవంతమైన నీ హృదయస్పందనలనూ విస్మరిస్తున్నపుడు
నువ్వు మరణిస్తుంటావు మెలమెల్లగా
అనిశ్చితిలో రక్షణార్థం దేన్నయినా ఎదుర్కోలేనపుడు
ఒక స్వప్నం వెంట వెళ్ళలేనపుడు
నీ నుండి నువ్వు ఒక్కసారైనా నిర్గమించలేనపుడు
మెలమెల్లగా నువ్వు మరణిస్తుంటావు
– పాబ్లో నెరుడా కవితకు తెలుగు అనువాదం
రామా చంద్రమౌళి ‘ఆత్మ’ కవితా సంకలనం నుంచి
* * *
అంతిమ అనివార్యత అహింసే
ఎన్ని రక్తపాత యుద్ధాలైనా చివరికి ‘చర్చల’తోనే ముగుస్తాయి
భరత భూమి సందేశంగా ‘అహింస’ ఒక్కటే అంతిమంగా
శాంతి కపోతాన్ని ఈ ప్రపంచాకాశంలో ఎగరేస్తుంది
గాంధీ ఒక్కడే ఈ యుగపు ఆఖరు ప్రవక్తగా ఇలలో మిగిలిపోతాడు
ఒక జాతి చరిత్రై
అంతిమ అనివార్యత అహింసే… కవితా ఖండిక నుంచి