ఆన్లైన్లో పన్నులు కడుతున్నారా? పాన్‌కార్డుకు సంబంధించిన ఏవైనా లావాదేవీలు చేస్తున్నారా? అయితే, మీకో ముఖ్యమైన హెచ్చరిక! కొత్తగా జరుగుతున్న ఒక ఫిషింగ్ స్కామ్ గురించి కేంద్రం యూజర్లను అలర్ట్ చేసింది. ‘PAN 2.0’ పేరుతో స్కామర్లు లూటీకి పాల్పడుతున్నారని హెచ్చరించింది. కొత్త పాన్ కార్డు అప్‌గ్రేడ్ చేస్తామంటూ నకిలీ ఇ-మెయిల్స్ పంపుతున్నారు ఫ్రాడ్స్టర్లు. అలాంటి ఫిషింగ్ మెయిల్స్ తొందరపడి క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు! ముఖ్యమైన పర్సనల్ డేలా, ఆర్థిక వివరాలు మొత్తం హ్యాకర్ల చేతికి చిక్కి.. మీరు రిస్క్‌లో పడ్డట్టే! మెయిల్స్‌ని యాక్సెస్ చేసే నెటిజన్లు ఈ పాన్ 2.0 ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిందే!!
ఎలాంటి ఆర్థిక లావాదేవీలకైనా పాన్‌కార్డు తప్పనిసరి అయింది. బ్యాంక్ అకౌంట్‌తో పాన్‌కార్డు లింక్ చేయడం ఇప్పుడు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే హ్యాకర్లు పాన్‌కార్డులపై గురి పెట్టారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్, ఆదాయపు పన్ను శాఖ చెబుతున్న ప్రకారం.. ఈ ‘PAN 2.0’ ఇ-మెయిల్స్ పూర్తిగా నకిలీవే! వీటికీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధం లేదని తేలింది. ట్యాక్స్ పేయర్స్ రిటర్న్స్ దాఖలు చేసే సీజన్లో సైబర్ నేరగాళ్లు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని సైబర్ ఎక్స్‌పర్ట్‌లు హెచ్చరిస్తున్నారు.
ఈ తరహా మోసపూరిత ఇ-మెయిల్స్ info@smt.plusoasis.com లాంటి అనుమానాస్పద అడ్రస్‌ల నుంచి వస్తున్నాయని నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. మెయిల్స్ సబ్జెక్ట్ లైన్లో ‘Get Your PAN 2.0 Card’ అని రాస్తున్నారు మోసగాళ్లు. అంతేకాదు.. మెయిల్స్‌లో ప్రభుత్వ పోర్టల్ లాగా కనిపించే లింకులు ఉంచుతున్నారు. నిజమనిపించేలా ప్రొఫెషనల్‌గా మెయిల్ కంపోజ్ చేస్తున్నారు. ఇదంతా నమ్మి అందులోని లింక్ క్లిక్ చేశామా.. నకిలీ వెబ్సైట్లు తెరుచుకుంటాయి. అక్కడ మీ ఆధార్, పాన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేశారా.. అసలుకే ఎసరొస్తుంది. కొన్నిసార్లు ఇతర వ్యక్తిగత వివరాలు కూడా అడుగుతుంటారు. అవన్నీ హ్యాకర్ల చేతికి చేరిపోతాయి. వీటితో ఆర్థిక మోసాలకు, అనధికారిక లావాదేవీలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు చాలా ప్రొఫెనల్‌గా ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అచ్చంగా ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిందే అని నమ్మేలా వ్యవహారం నడుపుతున్నారు.
బ్యాంకులు, మరే ఇతర ఆర్థిక పరమైన సేవల్ని అందించే సంస్థలు ఇ-మెయిల్స్ రూపంలో ముఖ్యమైన సమాచారాన్ని కోరవు. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలని ఆదాయపు పన్ను శాఖ స్పష్టంగా చెబుతున్నది. మీ ఇ-పాన్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయమని కోరుతూ మెయిల్ వస్తే పట్టించుకోవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. తాము ఎప్పుడూ వ్యక్తిగత వివరాలు, ఖాతా నంబర్లను అడుగుతూ సందేశాలు పంపబోమని చెబుతున్నారు. నిజమైన పాన్ సేవలు కేవలం .gov.in లేదా .nic.inతో ముగిసే అధికారిక వెబ్సైట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంటున్నారు.
‘PAN 2.0’, ఇతర ఫిషింగ్ స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండడం ఎలాగో యూజర్లు తెలుసుకోవడం చాలా అవసరం. చెక్ మెయిల్: ప్రభుత్వం పంపే ఇ-మెయిల్స్ ఎప్పుడూ .gov.in లేదా .nic.in డొమైన్లతోనే వస్తాయి. తెలియని డొమైన్ల నుంచి ఈ తరహా మెయిల్స్ వస్తే అనుమానించాల్సిందే. డోన్ట్ క్లిక్ లింక్స్: పాన్ అప్డేట్స్, డబ్బు ఇస్తామని చెప్పే గుర్తు తెలియని ఇ-మెయిల్స్‌లోని లింక్‌లు గానీ, అటాచ్మెంట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. యూజ్ అఫీషియల్ పోర్టల్స్: పాన్ సంబంధిత సేవలు కావాలంటే, నేరుగా ఆదాయపు పన్ను శాఖ లేదా NSDL/UTIITSL.. లాంటి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి. గూగుల్‌లో వెతికి వచ్చిన లింకులను కాకుండా, మీకు తెలిసిన అధికారిక వెబ్సైట్లు ప్రయత్నించండి. టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్: మీ ఇ-మెయిల్, బ్యాంకింగ్ లాంటి అన్ని ముఖ్యమైన ఖాతాలకు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) ను ఆన్ చేసుకోండి. ఇది మీ ఖాతాకు అదనపు భద్రతను ఇస్తుంది. రిపోర్ట్ చేయండి: ఫిషింగ్ ఇ-మెయిల్స్‌ని webmanager@incometax.gov.in, incident@cert-in.org.inకు ఫార్వార్డ్ చేయండి. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బీ అప్డేట్: ఫ్యాక్ట్ చెక్, వెరిఫైడ్ సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి. జరుగుతున్న మోసాల గురించి, సైబర్ ఫ్రాడ్ హెచ్చరికల గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఈ టిప్స్‌ని పాటిస్తే, మీరు ‘PAN 2.0’ లాంటి మోసాల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చు.