e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home కథలు యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

  • ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. ఆ తరువాత ఎన్నో అనూహ్యమైన పరిణామాలు..

- Advertisement -

శ్రాఆద్యంత శూన్య మజమవ్యయమప్రమేయం ఆదిత్య రుద్ర నిగమాదినుత ప్రభావమ్‌ అంభోధిజాస్య మధులోలుప మత్తభృంగమ్‌ లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబమ్‌
వ్యమైన కంఠస్వరంతో ఈ శ్లోకాన్ని పఠించాడు బాలసంచారి. ‘ప్రహ్లాదుడే మళ్లీ ఈ భూమ్మీద పుట్టి, తన జన్మ పావనం చేయడానికి ‘బాలసంచారి’ రూపంలో కనిపిస్తున్నాడా’ అన్న సందేహం కలిగింది త్రిభువనుడికి.

“చక్రవర్తీ ఈ శ్లోకానికి అర్థం ఏమిటో తెలుసా? స్వామిని మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఇలా చేరుకోవాలి.
ఓ లక్ష్మీ నరసింహా! మొదలూ తుదీ లేని వాడివి. పుట్టుక ఎరుగని వాడివి. అమ్మ లక్ష్మీదేవి ముఖ కమలంలో తిరుగాడే తుమ్మెద వంటివాడివి. నిన్ను పూర్తిగా సేవించడంలో నాకు చేయూతనివ్వమని స్వామిని వేడుకోవాలి. అంతేకాదు, ఆ నారసింహుడే మనకు అన్నీ..
మాతా నృసింహశ్చ పితా నృసింహః
భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః
విద్యా నృసింహో ద్రవిణం నృసింహః
స్వామీ నృసింహ స్సకలం నృసింహః
తల్లి, తండ్రి, సోదరుడు నృసింహుడే! మిత్రుడు, విద్యాబుద్ధీ నారసింహుడే! ధనము-స్వామీ-సర్వమూ ఆ నారసింహుడే, ఆయననే నేను మనసారా నమ్ముకొని ఉన్నాను’ అని వివరించాడు బాలసంచారి.
బాలసంచారి చూడటానికి ఎనిమిది, పదేండ్ల బాలుడిగా ఉన్నా.. నారసింహ తత్వాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్న సాధకుడిలా కనిపిస్తున్నాడు.
బాలుడు చెప్పిన ప్రతి మాటనూ, అందరూ ప్రత్యేక భక్తిశ్రద్ధలతో వింటున్నారు. రాణి చంద్రలేఖ, యువరాజు సోమేశ్వరుడు, బాలసంచారిని అక్కడికి తీసుకొచ్చిన రామభట్టు ఎవరూ మాట్లాడటం లేదు. సకలశాస్ర్తాలు చదివిన సర్వాధికారి, సర్వం సహా చక్రవర్తి.. త్రిభువనమల్లుడు కూడా మౌనంగా వింటున్నాడు. అయితే, ఆయనకొక సందేహం కలిగింది.
“బాలసంచారీ! సరే నారసింహ అవతారం అద్భుతం, అమేయం. అది ప్రపంచానికంతా తెలిసిన దివ్యగాథ. కానీ, నీ గురుపరంపరలో ఆదిగురువూ, మహాత్ముడు మహర్షి యాదర్షి.. స్వామివారి దర్శనాన్ని ఎలా సాధించారు? భగవంతుడి పేరు మీదనే కదా కొండలూ, కోవెలలూ వెలిసేది! తిరుమూర్తి శ్రీవేంకటేశ్వరుడు కొలువైన కొండను తిరుమల, తిరుపతి అని పిలుస్తారు కదా! మరి, శ్రీ లక్ష్మీనారసింహుడు ఆవిర్భవించిన కొండను ‘నరసింహుని కొండ’ అనకుండా ‘యాదగిరి కొండ’ అని ఎందుకు పిలుస్తున్నారు? యాదరుషి చేసుకున్న పుణ్యమేమిటి? సాధించిన అద్భుతాలేమిటి?”

త్రిభువనమల్లుడి మాటలకు చిరునవ్వు విరిసింది బాలసంచారి వదనంలో! “చక్రవర్తీ! భగవంతుడి కంటే, ఒక్కోసారి భగవంతుడిని ప్రసన్నం చేసుకొని హృదయంలో నిలుపుకొన్న మహాభక్తుడే గొప్పవాడు అనిపిస్తాడు నాకు. రాముడు చేయలేని పనిని రామనామం చేయగలదని, రామభక్తుడైన హనుమంతుడు నిరూపించలేదా! హనుమ మహిమను వర్ణించతరమా? అలాగే నా గురుదేవులు, యాదర్షి వారి గురించి ఎప్పుడు తలుచుకున్నా, ఎన్నిసార్లు వారి దివ్యగాథను మననం చేసుకున్నా.. పుణ్యప్రదమే! నమో శ్రీ నారసింహా, నమో నారసింహుని భక్తాగ్రేసర.. యాదర్షి మహర్షి!” భక్తి భావంతో బాలసంచారి పలికిన పలుకులు మందిరంలో బహుశ్రావ్యంగా ప్రతిధ్వనించాయి.

సోమేశ్వరుడు అడిగాడు ఉత్సాహంగా.. “అయితే యాదరుషి వృత్తాంతం ఏమిటో చెప్పి మా అందరికీ సంతోషం కలిగించవచ్చు కదా!”
“యాదరుషిది అద్భుత చరితం.. అదొక మహాప్రసాదం. అది అందరికీ పంచవలసిందే. ఆ కథామృతం అందరికీ అందవలసిందే” అంటూ బాలసంచారి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. తూర్పు ముఖంగా తిరిగి కనులు మూసుకొని ప్రార్థించాడు. బహుశా మహర్షి కథను రసరమ్యంగా వినిపించడానికి యాదరుషి అనుమతి, అనుగ్రహం కోసం అర్థిస్తున్నాడేమో అనిపించింది అక్కడున్నవారికి.

యాదాద్రి వైభవం

“నమ రుషిభ్యో
మంత్రకృద్భ్యో మంత్ర పతిభ్యో
మామామృషయో
మంత్ర కృతో మంత్రకృతో మంత్ర పతయే
షరా దుర్మాహ మృషీన్మంత్రకృతో
మంత్ర పతీన్పరాదాం’
అంటే మంత్రద్రష్టలు, మంత్రపతులు అయిన మహర్షులకు నమస్కారం. ఈ మహాత్ములు నన్ను విడవకుందురు గాక, నేను వారిని విడువకుందును గాక. సనాతన సంప్రదాయాన్ని, శాస్ర్తాలను సకల ప్రపంచానికి అందించిన మన దేశ మహర్షులను, వారి పవిత్ర చరితములను వినడం, అవగాహన చేసుకోవడం, వారి జీవన సాఫల్య సాగరంలోని ఒక్క నీటిబొట్టునైనా గ్రహించి, అందులో వందో వంతైనా ఆచరణలో పెట్టగలిగితే మనందరం, మన భూమిని సుందర నందనవనంగా మార్చగలం కదా” అంటూ కనులు తెరిచాడు బాలసంచారి.
గవాక్షం నుంచి ప్రసరిస్తున్న సన్నని సూర్యకాంతి బాలసంచారి ముఖంపైన పడి, అతని దివ్య తేజస్సును ద్విగుణీకృతం చేస్తున్నది. బాలసంచారి యాదరుషి అద్భుత దివ్యగాథను వివరంగా చెప్పడం ప్రారంభించాడు.

“అదొక అద్భుతవనం. జీవవైవిధ్యానికి ప్రతిరూపమైన అందమైన అరణ్యం. అందులో కొండప్రాంతం. లేలేత సూర్యకిరణాలు ఆకుపచ్చని ఆకులపై పడి సన్నటి కాంతిరేఖలుగా మారి అరణ్యాన్ని హరితభరితంగా ప్రకాశింపజేస్తున్నాయి. ‘అడవంతా తనదే, చెట్లన్నీ తన ఛత్రచామరాలే, తన అడుగులు ఇతర జీవరాశులకు మడుగులై.. నువ్వే రారాజువని ఎలుగెత్తి చాటుతున్నాయ’ని భావిస్తూ ఒక సింహం ప్రకృతి ఏర్పర్చిన సహజ కొలనులో నీరు తాగడానికి వచ్చింది. స్వచ్ఛమైన నీరు.. కొలను అట్టడుగున ఉన్న చిన్నచిన్న మొక్కలు, జలచరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సింహం నీరు తాగబోతుండగా అకస్మాత్తుగా ఒక ప్రతిబింబం కనిపించింది. మనిషి.. ఓ యువకుడు! మృగరాజు తన వనంలోకి అనుమతి లేకుండా వచ్చిన ఆ యువకుడు ఎవరా అన్నట్టు తలను వెనక్కి తిప్పి చూసింది. సింహాన్ని చూస్తున్న ఆ యువకుడి మొహంలో భయం గానీ, సందేహం గానీ లేదు. ఉత్సాహం కనిపించింది. కళ్లల్లో కళ్లుపెట్టి చూశాడు. ఏదో ఆశ, ఏదో ఆతృత, ఏదేదో సాధనా ఫలం అందుకున్న అనుభూతి ఒక్కక్షణంలో కలిగి.. చేతులు జోడించాడు.
ఒక లిప్తపాటు భీకరంగా చూసిన ఆ సింహం మరుక్షణమే తన ఆత్మబంధువుని చూసిన భావనతో తన చూపు మార్చింది. తల చిన్నగా ఆడించి, ఒక్క అడుగు వెనక్కి వేసి సంతోషంగా గర్జించి పరుగులు తీస్తూ ఆ అడవిలో అదృశ్యమైపోయింది.
‘ఇది సింహమే కానీ, సింహదేవుడు కాదేమో! ఎందుకంటే, తనకు నారసింహుడే ఎదురై, ప్రత్యక్షమైతే, ఆశీర్వదిస్తాడు. కానీ, అదృశ్యమవుతాడా? ఎప్పుడు కనిపిస్తాడు.. నా స్వామి!
నరసింహస్వామి?
అయితే, నేను ఈ వనంలోకి అడుగుపెట్టాలంటే అనుమతి అడుగాలేమో! ఎవర్ని అడగాలి? గాలినా? నీటినా? నిప్పునా? పాదం మోపిన భూమినా? అనంతమైన ఆకాశాన్నా? అందరినీ ప్రార్థిస్తాను. నా దేవుడు కనిపిస్తాడేమో? కరుణిస్తాడేమో? ‘అందరికీ ప్రాణాధారమైన గాలిదేవుడా! నీవు లేక ప్రాణికోటి లేదు. ప్రతీ జీవి శరీరం లోపల, వెలుపల నీ శక్తి ఉంటుంది. నువ్వు లోపల ఉంటే మేము ఉన్నట్టు. నువ్వు మానుంచి వెలుపలికి వెళ్లిపోతే మేం ఈ లోకం నుంచి వెళ్లిపోయినట్టు! ఓ ప్రాణదాతా! ఈ వనంలోకి అడుగుపెట్టి, నా తపోవనంగా మార్చుకోవడానికి నీ అనుమతి కోరుతున్నాను’ అంటూ వాయుదేవుడికి ప్రణామం చేశాడు యాదర్షి.

‘మరి నా మాటేమిటి’ అంటూ నీటినుంచి బుడబుడ మంటూ చిరుసవ్వడులు వినవచ్చాయి.
‘ఓహో జలమా! నీకు ప్రణామం. ‘నీరు లేకపోతే మీరు ఎలా ఉండగలర’ని అడుగుతున్నది మడుగు. నిజమే, జలదేవత లేకుండా ఏ ప్రాంతమైనా సుజలాం, సుఫలాం, సస్యశ్యామలం ఎలా కాగలదు. ఊపిరి నిలుపుకోవడానికి, ఉపాధి పొందడానికి నీటిబొట్టే కదా మానవజాతికి నుదుటిబొట్టు. నీరు లేకపోతే ఊరు లేదు. నీరు తాగకపోతే ప్రాణికోటి నిలువలేదు. అర్ఘ్యంలో, ఆహారంలో, శరీరంలో అణువణువూ నీరు లేకపోతే నువ్వు లేను, నేను లేను. ఆకాశగంగ నేలమీదికి దుముకంగా, పుడమితల్లి పులకించదా! విత్తుల సత్తువను పెంపొందించి, మొక్కను మొలకెత్తించి అందరికీ ఆశ్రయమిచ్చే మహావృక్షంగా మార్చే నీటికి.. ఏనాటికైనా మనుషులందరూ, సకల ప్రాణికోటి రుణపడి ఉంటుంది. అమ్మా! గంగమ్మతల్లీ దండాలమ్మా. నీ సరసన ఈ చిన్న మనిషి కనులు మూసుకొని తపస్సు చేసుకోవడానికి అనుజ్ఞ ఇవ్వు తల్లీ!’ అంటూ కొలను దగ్గర వంగి దండం పెట్టాడు. నీటిని భక్తిగా చేతుల్లోకి తీసుకొని తలపై చల్లుకున్నాడు. చల్లనితల్లి నీరమ్మా.. తన అమృత హస్తాన్ని తలపైన ఉంచి దీవించినట్టు అనుభూతి కలిగింది. తలపైన చల్లుకున్న నీళ్లు.. కన్నీళ్లుగా ఉభయ నేత్రాలనుంచి ఉబికి వచ్చాయి. కన్నీరైనా, పన్నీరైనా, పట్టపగ్గాల్లేని పరవశమైనా నీరే కదా బాష్పరూపంలో అంతఃకరణ శుద్ధి చేయాలి. నీటి తల్లికి నమస్కారం.

‘అడుగడుగున మన బరువు మోసే అమ్మ.. నేలమ్మ ఓ భూమాత! పుట్టినప్పుడు మనం గాల్లోకి ఎగిరిపోకుండా గట్టిగా పట్టుకొని నడిపించే తల్లి భూదేవి కదా! అలాగే ప్రాణాలు గాల్లో కలిసినపుడు తన మట్టిపొట్టలోనే పుట్టెడు మందిని దాచుకునే దయామయి. పుట్టిన నాటినుంచి గిట్టే వరకు మట్టి ఆధారమే లేకపోతే మనిషికి పుట్టగతులుంటాయా? ఎవరిచ్చారు ఈ భూమిని? ఎంతకాలం ఉంటాం ఇక్కడ? ఎవరికీ తెలియదు. ఆకలిని తీర్చుకోవడానికి ఇచ్చిన అన్నాన్ని నేలపాలు చేస్తే ఎంత దోషమో, భూమ్మీద బాధ్యత నెరవేర్చుకోవడానికి ఇచ్చిన మనిషి జన్మను భూమికి భారంగా మార్చడం అంతకన్నా ఘోరం! నువ్వు భూమ్మీదికి వచ్చావంటే దానికో కారణం ఉంటుంది. పలుకలేని చెట్టు కూడా పది మందికి ఉపయోగపడుతుంది. బతికి బట్టకట్టి మళ్లీ మట్టిలోనే కలిసిపోయే మనిషి.. ఆ పోయేలోపు నలుగురికీ ఉపయోగపడే పని ఒక్కటైనా చేయకపోతే పుట్టినా, పుట్టకపోయినా, పుట్టి చచ్చినా ఒక్కటే! అందుకే అమ్మా.. భూదేవమ్మా.. నీకు వేలవేల ప్రమాణాలు. ఈ నేలమీద కాలు మోపేందుకు నీ చల్లని ఆమోదం కోరుతున్నాడమ్మా నీ బిడ్డడు!’
నేల మీదికి వొంగి, తల ఆనించి, మట్టివాసన చూసి, సాష్టాంగ పడి పరిపరి విధాలా ప్రార్థించాడు. సత్సంకల్పం కలిగిన బిడ్డ తన ఒడిలో నిశ్చింతగా ఉండొచ్చు అన్నట్టుగా సన్నని ఓంకార నాదం వినిపించింది. ఎంతో సంతోషించాడు.

‘అమ్మా నా పేరు యాదర్షి. పసితనంలోనే రుషిత్వం సిద్ధించాలని నాకీ పేరు పెట్టారేమో! రుష్యశృంగ మహర్షి మా తండ్రిగారు. ప్రహ్లాదుడిని అనుగ్రహించిన అవతారమూర్తి శ్రీలక్ష్మీ నారసింహుని అన్వేషిస్తూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు ప్రకృతి తప్ప ఎవరూ తెలియదు. నాకు తెలిసిన నారసింహుడు.. ఎన్నిచోట్ల తిరిగినా, ఎంత తపస్సు చేసినా.. ఏమాత్రం కనికరించడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. నా స్వామి కనిపిస్తాడేమో అనే ఆశతో..’ ప్రకృతికి, భూమాతకు తన గురించి చెప్పుకొన్నాడు.

చుట్టూ చూశాడు యాదర్షి. పక్షుల కిలకిల
రావాలతో, సడి చేస్తున్న గాలి విన్యాసాలతో, అక్కడక్కడా తన ఉనికిని చాటుకోవడం కోసం పలురకాల ధ్వనులు చేస్తున్న వన్యప్రాణుల ఉత్సాహం తప్ప నర సంచారం లేదు. మనిషి అనే వాడెవడూ కాగడా పెట్టి వెతికినా కనిపించే పరిస్థితి లేదు.
నారసింహుని దర్శనం కోసం తన హృదయంలో జ్వలిస్తున్న జ్వాల తప్ప, బయట ఎక్కడా ‘అగ్ని’ కనిపించలేదు. నిప్పు పుట్టని చోట బతుకులేదు. వెలుగు లేదు. మనిషి పుట్టిన నాటి నుంచి వెళ్లిపోయే వరకు నిప్పుతో సహజీవనం ఉంటుంది. అన్ని సంస్కారాలకూ అగ్ని ఒకటే సాక్షి. నిజానికి నిప్పు మనకు తోడు-నీడ. చుట్టూ చూశాడు. చిన్న కట్టెపుల్లలు తీసుకున్నాడు.
అగ్నిమీళే పురోహితం యజ్ఞస్యదేవ
మృత్విజమ్‌ హోతారం రత్న ధాతమమ్‌
‘సకలదేవతలకు ముఖద్వారం అగ్నిదేవుడే. అగ్ని యజ్ఞానికి పురోహితుడు, అమృత తుల్యుడు, రుత్విజుడు సమర్పించిన వాటిని ఆయాదేవతలకు అందించేవాడు. ఆకాశంలో సూర్యుని ప్రజ్వలన శక్తిగా, భూమండలంపై జ్వాలగా, వాతావరణంలో మెరుపుగా అగ్ని భాసిస్తున్నాడు.
కాంతివి నీవే, నీడలను ఏర్పరిచేది నీవే, జీవంతో ఉన్న శరీరానికి ఆహారాన్ని సిద్ధం చేసేది నీవే! నిర్జీవ శరీరాన్ని దహించేది నీవే, రెండు జీవితాల నిండు కలయికకు సాక్షివి నీవే! నీకు నా హృదయ పూర్వక ప్రణామాలు. నీవు సాక్షిగా, నీవే ఆధారంగా నిత్య అనుష్ఠానాలు నిర్వహిస్తూ స్వామి దర్శనం కోనం నా నిరీక్షణకు ఆరిపోని వెలుగులనివ్వు. అఖండ జ్యోతివై ఆదరించు.’ సభక్తిపూర్వకంగా అగ్నిని ప్రజ్వలింపజేశాడు యాదర్షి. జ్యోతికి నమస్కరిస్తూ ‘నీవే నా స్వామిని నాకు చూపాలి’ అన్నాడు.
పెద్దగా నవ్వు వినిపించింది.
వెనక్కి తిరిగి చూశాడు.
పండు ముదుసలి, తెల్లని జుట్టు, తెల్లని నెరిసిన గడ్డం, కనుబొమలు.. వింతగా కనిపించాడు.
‘అయ్యా! పెద్దలు, మీరెవరో? మీకు వినమ్ర నమస్సులు’ చేతులు జోడించాడు.
‘ఓహో నువ్వే యాదర్షివా?’ అని అడిగాడా ముదుసలి.
‘అవును! తమరెవరు?’ వినయంగా అడిగాడు యాదర్షి.
‘నేనా.. తపస్సులో నీకు తాతను’ నవ్వుతూ అన్నాడు.
‘ఎవరి గురించి మీరు తపస్సు చేశారు?’
‘నా దేవుడి గురించి! మరి నువ్వు ఎవరికోసం ఇక్కడికొచ్చావ్‌? అసలు, ఎవరి అనుమతి తీసుకున్నావ్‌?’ కోపంగా అడిగాడు.
‘నాకు ఎవరూ కనిపించలేదు’ చెప్పాడు యాదర్షి.
‘కనిపించకపోతే.. లేరని అర్థమా? అలా అయితే కనిపించని నీ దేవుడి కోసం ‘ఒక్కసారైనా కనిపించు స్వామి!’ అని ఎందుకు తపస్సు చేయాలనుకుంటున్నావ్‌?’
‘ఇప్పుడు కనిపించకపోయినా, ఆయన ఉన్నాడని తెలుసు కనుక. ఎప్పటికైనా కనిపిస్తాడన్న నమ్మకం ఉంది కనుక. అయినా పంచభూతాలను ప్రార్థించాను. ఆమోదాన్ని అర్థించాను.’
‘పంచభూతాలను అడిగానంటున్నావు సరే, పంచభూతాల తలరాతలు రాసే మా యజమానికి, విశ్వాసపాత్రుడైన ఈ దాస్యుణ్ని ఎలా మరచిపోయావ్‌?’ అడిగాడా పండు ముదుసలి.

అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement