తాను అడిగిన ప్రశ్నలకు ఇన్స్పెక్టర్ రుద్ర టీమ్ సభ్యులు కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో ఒక్కో దశలో ఏం జరుగబోతుందో లోతుగా వివరించి చెప్పడం ప్రారంభించాడు డోలో. ‘రుద్ర.. మా మిషన్ గురించి లీక్ చేస్తే, మేం చస్తామని నీకు ముందే చెప్పాను. అయినా.. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసుగా! ‘విషయం తెలిసినా కూడా నా దేశాన్ని, నా దేశ ప్రజలను కాపాడుకోలేకపోయానే’.. అంటూ చనిపోయే ముందు నువ్వు కుమిలిపోవాలి. అఫ్కోర్స్. ఈ 8 దశల్లో ఏదో ఒక దశలో నువ్వు కూడా చస్తావ్. అది చాలు నాకు’ అంటూ గట్టిగా నవ్విన డోలో.. మళ్లీ చెప్పడం ప్రారంభించాడు
‘రుద్ర.. మిషన్ గురించి లీక్ చేయడం ప్రారంభించిన తర్వాత ఏ క్షణమైనా నేను చనిపోవచ్చు. అందుకే, త్వరగా చెప్తూ పోతా! మధ్యలో ఎవ్వరూ అడ్డురాకండి. 8 దశల గురించి మొత్తం రివీల్ చేశాక.. నేను చనిపోవాలని కోరుకో.. హహ్హ.. తొలి దశ పేరు ‘సూసైడ్ వెపన్’ ఇది చైనాలో పురుడుపోసుకొంటుంది.. అల్టిమేట్ టార్గెట్ ఇండియా. సూసైడ్ బాంబర్ అంటామే.. ఇది కూడా అలాంటిదే. అయితే, కొంచెం వేరుగా ఉంటుంది. ‘సూసైడ్ బాంబర్’గా మారిన వ్యక్తి తాను ఆత్మాహుతి చేసుకోవడంతో పాటు బాంబుల ద్వారా తన పక్కనున్న వందల మందిని చంపాలని టార్గెట్‌గా పెట్టుకొంటాడు. అయితే, ఈ సూసైడ్ వెపన్‌లో మా మిషన్‌లో భాగంగా ట్రెయిన్ అయిన వ్యక్తి రోబోలను యాక్టివేట్ చేసి దేశంలోని మెట్రో సిటీల్లో డెప్లాయ్ చేస్తాడు. అవి లేజర్ రేస్‌ను వెదజల్లుతాయి. అంతే, మనుషుల శరీరాలు ఛిద్రమౌతాయి.
రెండో దశ.. శ్రీలంకలో యాక్టివేట్ అయ్యే.. హ్యూమన్ షీల్డ్.. రాత్రుళ్లు మా మనుషులు ఊళ్లపై పడి మీ పౌరులను తినేస్తారు. ప్రజలను తినేయడమేంటీ? అనుకొంటున్నావా? మా మనుషులకు హ్యూమన్ షీల్డ్‌గా ఉండే వాటి గురించి నువ్వు డైరెక్ట్‌గా తెలుసుకొంటేనే బాగుంటది. ఇక, మూడో దశ ఇటలీ నుంచి విరుచుకుపడే బయోకెమీ క్రియేచర్. కరోనాలో ఏమైందో తెలుసుగా.. ఇది అంతకు కోటి రెట్ల శక్తిమంతమైంది. నాలుగో దశ బల్గేరియాలో పురుడుపోసుకొనే హంగర్ వెపన్.. దేశంలోని కోట్లాది మంది ప్రజలు పస్తులతో చస్తారు. తినడానికి తిండి ఉంటుంది. అయితే, తినలేరు. అదెలా? అంటావా?? వెయిట్ అండ్ సీ.
ఇక, ఐదో దశ.. బెలారస్లో నుంచి యాక్టివేట్ అయ్యే ఇన్విజిబుల్ టార్గెట్.. పస్తులను తట్టుకొని బతికిపోయిన వారిని అదృశ్య రాకాసి అమాంతం మింగేస్తుంది. తర్వాతి ఆరో దశలో ఫిన్లాండ్లో యాక్టివేట్ అయ్యే మాస్ కిల్లింగ్.. దీని గురించి నీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు అనుకొంటా. ఇక, ఏడో దశలో యాక్టివేట్ అయ్యే లింక్డ్ డేంజర్ గేమ్ ఫ్రాన్స్ నుంచి ప్రారంభమవుతుంది. సైకో మూవీస్ నీకు ఇష్టమటగా.. అయితే, ‘సా’ మూవీ తెలిసే ఉంటుంది. ఇదీ అలాంటిదే. కానీ చాలా భయంకరమైంది. ఇక చివరకు పాకిస్థాన్‌లో మాస్ స్టెరిలైజేషన్ దశ యాక్టివేట్ అవుతుంది. గత 7 దశల్లో బతికి బట్టకట్టిన వారికి మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపేదే ఇది’ అంటూ డోలో ఆగాడో లేదో.. తన శరీరం నుంచి బీప్ సౌండ్ యాక్వివేట్ కావడం మొదలైంది. ‘రుద్ర నేను చనిపోబోతున్నా.. తొలి దశ చైనాలో ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసుకోవాలంటే..’ అంటూ తన అరచేతిలో అప్పటికే ఉంచుకొన్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఫొటోను చూయిస్తూ.. ఇంకా ఏదో చెప్పబోతుండగా.. కండ్లు, నోరు, చెవులు, ముక్కు ఇలా నవరంధ్రాల నుంచి రక్తం చిమ్ముకొచ్చి డోలో అక్కడికక్కడే చనిపోయాడు. అది చూసిన అందరూ షాకయ్యారు.
‘ఒరేయ్ రుద్ర. మనం ఇప్పుడే బయల్దేరాలి. చైనాలో తొలి దశ ఎక్కడ యాక్టివేట్ అవుతుందో కనిపెట్టాలి’ అంటూ ఫోరెన్సిక్ ఇన్చార్జి జయ అంటుండగానే, ‘అవును రుద్ర.. మనకు టైమ్ లేదు. మన టీమ్‌కు కావాల్సిన బ్యాకప్, ఎక్విప్మెంట్, ట్రాన్స్పోర్ట్ ఇలా అన్నింటినీ నేను రెడీ చేస్తా. పై అధికారుల పర్మిషన్ ఇప్పుడే తీసుకొంటా’ అంటూ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కరణ్ అన్నాడు. ‘అది కరెక్టే! కానీ, మన ఫస్ట్ క్లూ కోసం ఏ వేంకటేశ్వరుడి గుడికి వెళ్లాలి?’ అంటూ రుద్ర కజిన్ స్నేహిల్ ఆశ్చర్యార్ధకంగా అడుగుతుండగానే.. ‘డౌట్ ఎందుకు, ఈ డోలోగాడు చస్తే చచ్చాడుగానీ, ఎందుకో ఏమో ఓ క్లూ ఇచ్చి పోయాడు. ఈ ఫొటో వెనుక చూడండి. ‘తమిళనాడులో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి. పంచభూత లింగాల నడుమ.. ఈ క్షేత్రాల్లోని ఓ నగరిలో కొలువైన ఆ శ్రీనివాసుడి గర్భగుడిలో పాదల చెంత.. చైనీయుల రహస్యం’ అని క్లియర్‌గా రాసి ఉందిగా’ అంటూ కచ్చితంగా చెప్పాడు రామస్వామి. ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మళ్లీ మాట్లాడుతూ.. ‘ఈ కోడ్‌ను నేనే డీకోడ్ చేస్తున్నా వినండి.. పంచభూత లింగాల నడుమ కొలువైన శ్రీనివాసుడు ఆ తిరుపతి బాలాజీనే. ఫొటోలో ఉన్నది ఆయన ఒరిజినల్ రూపం. డౌటేలేదు’ అంటూ డిసైడ్ చేసిన రామస్వామి.. ‘అందరం వెళ్దాం.. తిరుమలకు’ అంటూ రుద్రను చూస్తూ అన్నాడు. ఆ వెంటనే ఫొటోలోని బాలాజీని తీక్షణంగా చూసిన రుద్ర.. ‘మనం వెళ్లాల్సింది తిరుమలకు కాదు.. కంచికి’ అంటూ దానికి గల కారణం చెప్పాడు. అది విన్న అందరూ నిజమేకదా అంటూ కంచికి పయనమయ్యారు. రామస్వామి చెప్పినట్టు తిరుమల బాలాజీ గుడిని కాదని.. కామాక్షీ దేవి, పృథ్వీ లింగం ఉన్న కంచికి రుద్ర ఎందుకు వెళ్దామన్నట్టు? మీరు కనిపెట్టారా?
డోలో చూయించిన ఫొటోలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి తిరుమలలోని బాలాజీలా ఉన్నప్పటికీ, ఆ దేవుడు కాదు. తిరుమలలోని బాలాజీ కుడి చేయి.. ‘తన కాళ్లను దర్శించండి’ అన్నట్టు భక్తులకు సంజ్ఞ చేస్తున్నట్టు ఉంటుంది. అయితే, కంచిలోని అత్యంత పురాతనమైన ఎంతో శక్తిమంతమైన వరదరాజ పెరుమాళ్ టెంపుల్లో ఉన్న శ్రీనివాసుడు భక్తులకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు చేయి పెడతాడు. పైగా ‘పంచభూత లింగాల నడుమ.. ఈ క్షేత్రల్లోని ఓ నగరిలో’ అన్న వాక్యం రుద్రకు హుక్ పాయింట్లా తగిలింది. పెరుమాళ్ ఉన్న కంచిలోనే పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఉంటుంది. దీంతో చైనా కథ కంచిలో మొదలైనట్టు కనిపెట్టాడు రుద్ర.