రాత్రి తొమ్మిది కావొస్తున్నది. ఏదో కేసు ఫైల్ చూస్తున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో మొబైల్ మోగింది. ‘సార్.. ఓఆర్ఆర్ మీద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మీరు త్వరగా రండి’.. ఫోన్లో అటునుంచి ఎవరో కంగారుపడుతూ చెప్పాడు. వివరాలు తీసుకొన్న రుద్ర సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొన్నాడు. మృతుడి వయసు 20 ఏండ్లకు అటూ ఇటూగా ఉంటుంది. శరీరాన్ని ఏదో జంతువు రక్కిన గుర్తులు కూడా ఉన్నాయి.
‘ఫోన్ చేసింది మీరేనా?’ ఎదురుగా ఉన్న వ్యక్తిని ప్రశ్నించాడు రుద్ర. ‘అవును సార్. నేనే మీకు ఫోన్ చేశా’ సమాధానమిచ్చాడు అతను. ‘మీ పేరు? ఈ టైమ్‌లో మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఓఆర్ఆర్పై ఎందుకు ఆగినట్టు?’ సూటిగా ప్రశ్నించాడు రుద్ర. ‘సార్.. నా పేరు క్రాంతి. నేను కొత్తగా కొన్న నా ఎలక్ట్రిక్ కారులో వెళ్తున్నా. బ్యాటరీ డౌన్ కావడంతో కారు ఆగిపోయింది. చార్జింగ్ స్టేషన్లు కూడా దగ్గర్లో ఎక్కడా కనిపించలేదు. ఇంతలో ఎదురుగా రోడ్డు మీద జంతువు దేన్నో రక్కుతున్న శబ్దం వినిపించింది. ఏంటా అని కారు హెడ్లైట్లు ఆన్‌చేసి చూశా. ఎదురుగా శవం కనిపించింది. వెంటనే మీకు ఫోన్ చేశా’ ఆందోళనతో క్రాంతి చెప్తూ పోయాడు. సరేనన్న రుద్ర.. క్రాంతి ఫోన్ నంబర్, ఇతర వివరాలు తీసుకొన్నాడు.
ఇంతలో..‘సార్.. ఇదేదో యాక్సిడెంట్ కేసులా కనిపిస్తుంది. పాపం కుర్రాడిది చిన్నవయసే’ అంటూ బాధపడ్డాడు హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి. ‘అవును బాబాయ్. చిన్నవయసే. కానీ, ఇది యాక్సిడెంట్ కేసులా కనిపించట్లేదు. నిజంగా యాక్సిడెంట్ జరిగితే ఓఆర్ఆర్ మీద వాహనాలు వచ్చే స్పీడ్‌కు డెడ్‌బాడీ పరిస్థితి ఇంకోలా ఉండేది. అయితే ఈ కుర్రాడి శరీరం మీద ఏ కుక్కనో, నక్కనో రక్కినట్టు కొన్ని గుర్తులు ఉన్నాయి తప్ప మరేం గాయాలు కనిపించట్లేదు. ఏదేమైనా, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక గానీ మరిన్ని విషయాలు తెలియవు’ అన్నాడు రుద్ర. అవునన్నట్టు తలూపాడు రామస్వామి.
‘సార్.. నాకు లేట్ అవుతుంది. నేను వెళ్లొచ్చా?’ క్రాంతి అడిగాడు. ‘బ్యాటరీ డౌన్ అయ్యి కారు చెడిపోయింది అన్నారుగా. ఎలా వెళ్తారు?’ ప్రశ్నించాడు రుద్ర. ‘ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తా’ సమాధానమిచ్చాడు క్రాంతి. ‘మరి కారు?’ మళ్లీ ప్రశ్నించాడు రుద్ర. ‘రేపు వచ్చి కారు తీసుకుపోతాను సార్’ మళ్లీ బదులిచ్చాడు క్రాంతి. ‘హత్య గురించి ఇంతరాత్రి పూట మాకు విలువైన సమాచారం ఇచ్చారు. మిమ్మల్ని ఒక్కరినే అలా ఎలా పంపిస్తాం? మరేంపర్లేదు. మిమ్మల్ని మా కానిస్టేబుల్స్ ఇంటి దగ్గర విడిచిపెడతార’ని రుద్ర క్రాంతికి చెప్పాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకముందే, ఆ కుర్రాడిది హత్య అని రుద్ర ఎలా కనిపెట్టాడని రామస్వామిసహా మిగతా కానిస్టేబుల్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతలో ‘నేను ఒంటరిగానే వెళ్తా సార్. పోలీసుల సాయం ఏమీ వద్దు’ అంటూ కాస్త భయపడుతూ క్రాంతి అన్నాడు. ‘ఎందుకు వద్దు?’ గద్దించాడు రుద్ర. ‘మాది పద్ధతిగల ఫ్యామిలీ సార్.. ఇంటికి పోలీసులు వస్తే, మా అమ్మానాన్న తట్టుకోలేరు’ అన్నాడు క్రాంతి. ‘మరి అంత పద్ధతిగల ఫ్యామిలీ నుంచి వచ్చిన నువ్వు.. ఈ కుర్రాడిని ఎందుకు చంపావ్?’ బాంబు పేల్చాడు రుద్ర. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం.
‘సార్.. ఏం మాట్లాడుతున్నారు? యాక్సిడెంట్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా తప్పేనా? అదే తప్పయితే ఇకపై ఎవరూ ఎవరికీ ఏ సాయం చేయరు. మానవత్వమే మంటగలిసిపోతుంది’ అంటూ ఏడ్చినంత పని చేశాడు క్రాంతి. ‘డియర్ క్రాంతి. ఈ సెంటిమెంటల్ డైలాగ్స్ ఇక ఆపడం నీకే బెటర్. ఈ హత్య నువ్వే చేశావని ఇప్పటికిప్పుడు నేను రుజువు చేయగలను. మర్యాదగా నువ్వే నిజం చెప్తే అది నీకే మంచిది’ స్పష్టంగా అన్నాడు రుద్ర. కాస్త ఆలోచించాక.. ఏం పాలుపోని క్రాంతి.. ఆ హత్య తానే చేశానని ఒప్పేసుకొన్నాడు. అయితే ఆ కుర్రాడికి తనకు ఎలాంటి సంబంధంలేదని, తాను ఈ హత్య కావాలని చేయలేదని ఓ షాకింగ్ విషయం కూడా చెప్పాడు. అది విన్న రుద్ర అండ్ టీమ్‌కు ముచ్చెమటలు పట్టాయి. ఆ విషయం పక్కనబెడితే, క్రాంతినే ఆ కుర్రాడిని హత్య చేశాడని రుద్ర ఎలా కనిపెట్టాడు?
ఓఆర్ఆర్పై పడివున్న కుర్రాడిని తానే హత్య చేశానని ఎట్టకేలకు ఒప్పుకొన్న క్రాంతి.. ఆ కుర్రాడికి తనకు ఎలాంటి సంబంధంలేదని, తాను ఈ హత్య కావాలని చేయలేదని చెప్పాడు. దీంతో మరెందుకు ఈ హత్య చేశావని ఇన్స్పెక్టర్ రుద్ర గద్దించాడు. దీనికి క్రాంతి స్పందిస్తూ.. ‘సార్.. గత కొన్ని రోజులుగా నన్ను ఓ చీకటి శక్తి వెంటాడుతుంది. అది చెప్తేనే నేను ఈ అబ్బాయి మీదకు ఆ వాయువును వదిలా’ అంటూ క్రాంతి చెప్తూ పోయాడు. ఆ మాటలు విన్న రుద్ర, హెడ్ కానిస్టేబుల్ రామస్వామి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు. ‘ఏం బాబూ.. మేం మీకు ఎలా కనిపిస్తున్నాం? లాఠీకి పని చెప్పించేలా ఉన్నావే..’ అంటూ కాస్త కఠువుగా అంటున్న రామస్వామిని వారించిన రుద్ర.. క్రాంతిని స్టేషన్‌కు తీసుకురమ్మని పురమాయించాడు.
మరుసటి రోజు.. ‘మిస్టర్ క్రాంతి. హత్య చేశానని ఒప్పేసుకొన్నావ్. అంతవరకూ ఓకే. అయితే, అసలు కారణం ఏమిటన్నది మాత్రం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావ్. ఇది నీకు మంచిదికాదు’ అంటూ గంభీరంగా అన్నాడు రుద్ర. ‘సార్.. హత్య నేనే చేశా. అయితే, నాకు తెలియకుండానే అది జరిగిపోయింది. అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు’ క్రాంతి నిశ్చయంగా చెప్పాడు. ‘తెలియని అబ్బాయిని ఎందుకు చంపావ్?’ ప్రశ్నించాడు రుద్ర. ‘చెప్పాను కదా సార్.. ఓ చీకటి శక్తి చెప్తేనే చేశా’ మళ్లీ అదే చెప్పాడు క్రాంతి. దీంతో క్రాంతి అబద్దమైనా చెప్తుండాలి లేదా మతి స్థిమితంగానైనా లేకుండా ఉండాలి అని రుద్ర మనసులో అనుకొంటూ ఉండగా కుర్రాడి పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది.
సమాధానం : క్రైమ్ స్పాట్‌కు వచ్చీరాగానే ‘ఈ టైమ్‌లో ఓఆర్ఆర్పై ఏం చేస్తున్నారం’టూ క్రాంతిని రుద్ర ప్రశ్నించాడు. దానికి తాను ఓఆర్ఆర్ మీదుగా కారులో వెళ్తుండగా బ్యాటరీ డౌన్ కావడంతో కారు ఆగిపోయిందని క్రాంతి బదులిచ్చాడు. ఇంతలో ఎదురుగా రోడ్డు మీద జంతువు దేన్నో రక్కుతున్న శబ్దం వినిపించి కారు హెడ్లైట్లు ఆన్‌చేసి శవాన్ని చూసినట్టు చెప్పాడు. నిజానికి కారు బ్యాటరీ డౌన్ అయ్యాక, హెడ్లైట్లు కూడా ఆన్ కావు. ఈ చిన్న లాజిక్‌నే రుద్ర కనిపెట్టాడు. పక్కనే ఉన్న టోల్‌ప్లాజా నుంచి కారు దాటడం సీసీటీవీలో రికార్డు కావడంతో భవిష్యత్తులో ఈ హత్య తనమీదకు వస్తుందని భావించిన క్రాంతి.. తాను తప్పించుకోవడానికి ఏమీ తెలియనట్టు తానే పోలీసులకు సమాచారమిచ్చాడు. అయితే, కారు బ్యాటరీ డౌన్ అయిందని అబద్ధం చెప్పి దొరికిపోయాడు. కాగా.. క్రాంతి ఈ హత్యను ఎందుకు చేశాడు? ఒక్క గాయం కనిపించకుండా కుర్రాడిని ఎలా చంపాడు? దీని వెనుక కారణమేంటన్న విషయాలపై రుద్ర టీమ్ దర్యాప్తు మొదలుపెట్టింది.