కమిషనరేట్ నుంచి అప్పుడే స్టేషన్‌కు వచ్చాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఏదో గొడవ జరుగుతుండటంతో.. ‘ఏమైందంటూ?’ హెడ్‌కానిస్టేబుల్ రామస్వామిని ఆరా తీశాడు. ‘మర్డర్ కేసు సార్’ అంటూ సమాధానమిచ్చిన రామస్వామి ఏం జరిగిందో చెప్పాలంటూ ఓ యువతి వైపునకు చూశాడు.
‘సార్.. నా పేరు తన్మయి. మాదాపూర్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్‌ని. నేను, నా తమ్ముడు కృష్ణ ఇద్దరమే ఇంట్లో ఉంటాం. పేరెంట్స్ విజయవాడలో ఉంటారు. తమ్ముడు కూకట్‌పల్లిలో ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. హెల్త్ బాగోలేకపోవడంతో ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు. అందుకే, వాడ్ని చూసుకోవడానికి ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టి ఇంట్లో పనిచేసుకుంటున్నా. పని ఎక్కువగా ఉండటంతో టైమ్‌లేక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఫుడ్ డెలివరీ పేరిట ఇంట్లోకి వచ్చిన వీడు (డెలివరీ బాయ్ రమేశ్‌ను చూపిస్తూ..) నా ఒంటిమీద ఉన్న జ్యువెలరీ, బీరువాలో డబ్బు ఇవ్వాలని కత్తితో బెదిరించాడు. నన్ను తాడుతో కుర్చీలో ఎటూ కదలకుండా కట్టిపడేశాడు. ఇంతలో పైనున్న రూమ్‌లో నుంచి మంచినీళ్ల కోసమని బయటకొచ్చిన కృష్ణ ఇతనితో గొడవపడ్డాడు. ఆ పోట్లాటలో వీడు తోసేయడంతో కృష్ణ తల గోడకు తగిలి తీవ్ర రక్తస్రావమైంది. భయంతో అక్కణ్నుంచి పారిపోయాడు. వెంటనే నేను పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాను’ అంటూ చెప్తున్న తన్మయి కన్నీటిపర్యంతమైంది.
ఇంతలో కలుగజేసుకొన్న డెలివరీ బాయ్ రమేశ్.. ‘సార్..ప్రమాణ పూర్తిగా చెప్తున్నా.. ఆ హత్యతో నాకు ఎలాంటి సంబంధంలేదు. నేను వెళ్లేసరికి ఆ మేడమ్ (తన్మయి) ఒక్కరే ఇంట్లో ఉన్నారు. రక్తపు మడుగులో ఓ కుర్రాడు (కృష్ణ) ఆమె ముందు పడి ఉన్నాడు. భయపడిపోయిన నేను.. వెంటనే అక్కడి నుంచి బయటికి పరిగెత్తేశా’ అంటూ వణుకుతూ చెప్తూ పోయాడు రమేశ్. ‘సార్.. వాడు చెప్పేది అబద్దం. నిజంగా వాడు ఏమీ చేయకపోతే, 15 నిమిషాలపాటు మా ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చూడండి’ ఆగ్రహంతో చెప్పింది తన్మయి. ఇంతలో కలుగజేసుకొన్న రామస్వామి.. ‘అవును సార్. సీసీటీవీ ఫుటేజీ చెక్ చేశాం. ఈ రమేశ్.. తన్మయి వాళ్లింట్లోకి ఎంటరైన 15 నిమిషాల తర్వాతే.. బయటకు పరిగెత్తుకొంటూ వచ్చాడు’ కన్ఫర్మ్ చేశాడు రామస్వామి.
కేసు ఫైల్ ఇవ్వాలంటూ రామస్వామికి సైగ చేశాడు రుద్ర. రామస్వామి ఇచ్చాడు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లిన రమేశ్.. 2.15 గంటలకు బయటికి పరిగెత్తినట్టు తెలుస్తున్నది. 2.20 నిమిషాలకు తన్మయి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. 2.45 నిమిషాలకు అక్కడికి చేరుకొన్న పోలీసులు.. తన్మయి కట్లను విప్పి కృష్ణ బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపించినట్టు రిపోర్ట్‌లో రాసి ఉంది. రిపోర్ట్ అంతా చదివిన రుద్ర.. రమేశ్, తన్మయిని తన క్యాబిన్లోకి రమ్మన్నాడు. రామస్వామి కూడా వారితోపాటు లోపలికొచ్చాడు.
‘రమేశ్.. నువ్వు నిజంగా ఏమీ చేయకపోతే, 15 నిమిషాలు అక్కడ ఏం చేశావ్?’ అంటూ రుద్ర లాలనగా ఆరా తీయడాన్ని చూసి రామస్వామి విస్తుపోయాడు. ఇంతలో ‘ఏంటి సార్? హత్య వాడే చేశాడని నేను చెప్తున్నాగా. మళ్లీ వాడిని మీరు ఆప్యాయంగా వివరాలు అడగడమేంటి?’ ఆగ్రహంతో ఊగిపోయింది తన్మయి. ‘మిస్ తన్మయి. కాస్త మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే విషయం గుర్తుంచుకోండి. మీరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావొచ్చు. అతను డెలివరీ బాయ్ కావొచ్చు. ఆ మాత్రం దానికి అతన్ని మీరు వాడు, వీడు అనడం ఏంటి? మిమ్మల్ని మేడమ్ అని అతను సంబోధిస్తున్నప్పుడు.. మీరు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు’ అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశాడు రుద్ర.
‘బాగుంది సార్. మర్డర్ చేసిన ఓ ఖూనీకోరుని సార్ అంటూ సంబోధించాలా? చనిపోయింది నా తమ్ముడు. బాధ ఉండేది నాకు. అయినా.. కేసు సాల్వ్ చేయకుండా నాకు నీతులు చెప్తారేంటి’ ఆగ్రహంతో అరిచినంత పని చేసింది తన్మయి. ‘ఓహో.. అక్కడి వరకు వచ్చిందా? వ్యవహారం. అయితే, సరే. మీ తమ్ముడిని ఎవరు చంపారో చెప్పాలా?’ సూటిగా అన్నాడు రుద్ర. గది అంతా నిశ్శబ్దం.
లేడీ కానిస్టేబుల్‌ను పిలిచిన రుద్ర.. తమ్ముణ్ని చంపిన తన్మయిని అరెస్ట్ చేయమంటూ ఆదేశించాడు. అలాగే, 15 నిమిషాలు అక్కడ ఏం చేశావని రమేశ్‌ను మళ్లీ అడిగాడు. అప్పటికే భయపడిపోయిన రమేశ్.. ‘సార్.. డెలివరీ ఇద్దామని డోర్ బెల్ కొట్టా. ఎవరూ తీయలేదు. ఫోన్ చేస్తే, ఓ 10 నిమిషాలు ఉండు ప్లీజ్ అంటూ మేడమ్ రిక్వెస్ట్ చేసింది. పది నిమిషాలైనా డోర్ తియ్యలేదు. దీంతో ఏమైందోనని కిటికీలోంచి చూశా. అక్కడ మేడమ్.. ఎదురుగా ఓ అబ్బాయి రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. భయపడిపోయి బయటకు పరిగెత్తా. అదే గేటు దగ్గర ఉన్న సీసీటీవీలో పడి ఉండొచ్చు. విషయం పోలీసులకు చెప్తే పొట్టపోసుకోవడం కోసం డెలివరీలు చేసే మాలాంటి చిరుద్యోగులను ఎక్కడ కేసులో ఇరికిస్తారని చెప్పలేదు. క్షమించండి’ అంటూ తల కిందకు దించుకొన్నాడు. రమేశ్ భుజం తట్టాడు రుద్ర. ఇంతకీ, కృష్ణను తన్మయినే హత్య చేసిందని రుద్ర ఎలా కనిపెట్టాడు?
రమేశ్ తనను ఎటూ కదలకుండా కుర్చీలో కట్టిపడేశాడంటూ రిపోర్ట్‌లో తన్మయి చెప్పింది. పోలీసులు ఇంటికెళ్లినప్పుడు కూడా కుర్చీలో అలాగే కదలకుండా ఉండిపోయింది. ఇంట్లోకి వెళ్లిన పోలీసులే ఆమె కట్లు విప్పారు. నిజంగా, రమేశ్ ఎటూ కదలకుండా కుర్చీలో తన్మయిని కట్టిపడేస్తే ఆమె పోలీసులకు ఎలా ఫోన్ చేసినట్టు? ఇదే విషయాన్ని గుర్తించిన రుద్ర.. ఫోన్ కాల్ డేటాను తెప్పించుకోవడంతో పాటు.. తన్మయి ఇంటి వెనుకున్న మరో బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజీని తెప్పించుకొని తన క్యాబిన్లో ప్రత్యేకంగా పరిశీలించాడు. ఆఫీస్ కొలిగ్‌తో తన డేటింగ్ విషయాన్ని కృష్ణ గుర్తించడంతో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తన్మయి తమ్ముడిని చంపింది. అయితే కృష్ణ అప్పటికే తన్మయి అకౌంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం.. ఇంతలో డెలివరీ బాయ్ రావడంతో తన్మయి తాను తప్పించుకోవడానికి ఇంత నాటకం ఆడినట్టు తదుపరి విచారణలో తేలింది. బాయ్‌ఫ్రెండ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
…? రాజశేఖర్ కడవేర్గు