‘అయినా వీళ్లు పసిగట్టలేదు గానీ, వీళ్లు చేస్తున్న తప్పులను ఆ దేవుడు ఎప్పటికప్పుడు ఎత్తిచూపిస్తూనే ఉన్నాడు. వీళ్లు వాటిని గమనిస్తేగా? అయినా.. తాతలనాటి పాపాలు ఎప్పటికైనా పండాల్సిందే’ అమ్మలక్కల ముచ్చట్లతో అక్కడంతా గందరగోళంగా ఉంది. ఇంతలో ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్ అక్కడికి
చేరుకొన్నారు. బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో కృష్ణమాచారి కుటుంబం నివసిస్తున్నది. ఆయన ఓ సైంటిస్ట్. నాస్తికుడు కూడా! ఆయన కుమార్తె సులేఖకు పెండ్లి సంబంధం కుదిరింది. వరుడు వరుణ్దీ హైదరాబాదే. ఒకే ఆఫీసులో పనిచేస్తున్న వీళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కులాలు వేరుకావడంతో కృష్ణమాచారి బంధువులు పెండ్లికి అడ్డుచెప్పారు. తండ్రి నచ్చజెప్పినా సులేఖ వినలేదు. చనిపోతానని బెదిరించడంతో చేసేదేమీలేక సరేనన్నాడు.
వీరి జాతకాలు చూసిన పండితులు ఈ పెండ్లి చేయడం మంచిదికాదని తేల్చిచెప్పారు. ఇదే విషయం కృష్ణమాచారికి చెబుదామనుకున్నారు బంధువులు. కానీ, జాతకాలు నమ్మనివాడికి చెప్పి ఏం ప్రయోజనమని ఊరుకున్నారు. పెండ్లి పనులు మొదలయ్యాయి. కాబోయే వధూ-వరులను పెండ్లికి ముందే శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి తీసుకెళ్లడం అమ్మాయివారింటి ఆచారం. ఈ తంతు తనకు ఇష్టంలేకపోయినా బంధువుల ఒత్తిడితో కృష్ణమాచారి సరేనన్నాడు. మార్చి 9, 10వ తేదీల్లో మూలవిరాట్‌పై సూర్యకిరణాలు ప్రసరించే దృశ్యాన్ని కాబోయే వధూవరులు చూడాలన్నది వారి ఆచారం. అందుకు తగ్గట్టే ముందురోజే అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆకాశం మేఘావృతం కావడంతో ఆ దర్శనభాగ్యం దక్కలేదు. దీంతో నలుగురూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు.
పెండ్లి ముందు రోజు రాత్రి.. హల్దీ ఫంక్షన్. సులేఖ ఒంటికి పసుపు రాసిన ఇద్దరు ముత్తయిదులు.. నీళ్లు పోసి మంగళ స్నానం చేయించబోయారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే సులేఖ మంటలకు ఆహుతైంది. అంతటా గందరగోళం. అసలేం జరిగిందో ఎవరికీ అర్థం కావట్లేదు. సులేఖకు పసుపు రాసి, నీళ్లు పోసిన ఆ ఇద్దరు ముత్తయిదుల చేతులు కూడా ఆ మంటల్లో కాలిపోయాయి. వెంటనే వారిని దవాఖానకు తరలించారు. సులేఖ అక్కడికక్కడే మరణించింది.
విషయం తెలుసుకొన్న రుద్ర అండ్ టీమ్ ఘటనాస్థలికి చేరుకొన్నారు. బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ‘సర్.. ఈ ప్రమాదం ఎలా జరిగింది?’ కృష్ణమాచారిని ప్రశ్నించాడు రుద్ర. ‘ఏం చెప్పమంటారు సార్. నీళ్లకు కూడా మండే స్వభావం ఉందని ఓ సైంటిస్ట్‌గా అంగీకరించమంటారా?’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు కృష్ణమాచారి. ఇంతలో కలుగజేసుకొన్న వకుళాదేవి.. ‘నోర్ముయ్యిరా వెధవా! ఎప్పుటినుంచో మొత్తుకొంటున్నా. మీ అయ్య, మీ తాత కూడా మన కులదైవాన్ని పట్టించుకోలేదు.
నువ్వు కూడా అలాగే తయారయ్యావ్. అమ్మాయి, అబ్బాయి జాతకాలు కలవలేదని మొత్తుకున్నా ఎవరైనా వింటేగా?? కనీసం అరసవెల్లిలో సూర్యకాంతి దర్శనం జరగనప్పుడైనా ఏదో అనర్థం తప్పదని అర్థం చేసుకోవాల్సింది. నా మనమరాలిని అందరం కలిసి పొట్టనబెట్టుకున్నాం’ అంటూ భోరుమన్నది. ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని గుక్కపెట్టి ఏడ్చాడు కృష్ణమాచారి. ప్రమాదం జరిగిన విధానాన్ని చూసి రుద్రకు మతిపోయినట్టయింది. నీటికి నిజంగా మండే స్వభావం ఉందా? అని ఆశ్చర్యపోతున్న రుద్రతో.. ‘సార్.. కొన్నిసార్లు దైవాన్ని తక్కువగా అంచనా వేయొద్దు సార్. వీళ్లు చేసిన పాపాలే ఇప్పుడు శాపాలుగా మారినట్టున్నాయ్. లేకపోతే నీళ్లనుంచి మంటలు రేగి పెండ్లికూతురు చనిపోవడమేంటి?’ అన్నాడు రామస్వామి.
ఇంతలో అక్కడికి వచ్చిన వరుణ్ నిశ్చేష్టుడయ్యాడు. ‘వరుణ్ ఈ విషయంలో మీరేమైనా చెప్పాల్సింది ఉందా?’ సూటిగా ప్రశ్నించాడు రుద్ర. ‘ఏం చెప్పమంటారు సార్.. నన్నెంతో ప్రేమించి, నాతోనే జీవితం అని మాటిచ్చింది. ఇప్పుడేమో ఇలా..’ అంటూ ఏడుపు ఆపుకోలేపోయాడు. ఇంతలో.. ‘నీ వల్లేరా నా మనుమరాలు ఈ స్థితికి వచ్చింది. తక్కువ కులమైనా పెండ్లికి ఒప్పుకొన్నాం. ఇప్పుడు నువ్వే నా మనుమరాలి పాలిట మృత్యువుగా దాపురించావ్’ అంటూ వకుళాదేవి వరుణ్ చొక్కా పట్టుకొని నిలదీసింది.
మరింత కుంగిపోయిన వరుణ్.. ‘మామయ్యా..’ అంటూ కృష్ణమాచారి మీద పడబోయాడు. ‘నేను నీ మామయ్యను కాదు.. నా దగ్గరికి రావొద్దు’ అంటూ ఏడుస్తూ దూరం జరిగాడు కృష్ణమాచారి. ఇంతలో కలుగజేసుకొన్న రుద్ర.. ‘బామ్మ గారూ ఏంటి మీరు అనేది? వరుణ్ ఏం చేశాడు?’ అంటూ ఆత్రుతగా ఆరాతీశాడు రుద్ర. ‘బాబూ. . పెండ్లికి ఈ ఇద్దరి జాతకాలు కలువలేదు. వీడి జాతకం ప్రకారం ఏదో దోషం ఉంది. పెండ్లయితే మా అమ్మాయికి మంచిదికాదని పండితులు కూడా మొత్తుకున్నారు. వీళ్లు వింటేగా..? ప్రేమ ప్రేమ అంటూ ఇంతదూరం తెచ్చుకొన్నారు. దైవం ఆగ్రహించింది. ఏదేమైనా నష్టం జరిగింది మాకే’ అంటూ కుదేలైంది వకుళాదేవి.
మంగళస్నానం కోసం సులేఖకు రాసిన పసుపును తీసుకురావాలని రుద్ర కానిస్టేబుల్‌ను పురమాయించాడు. పసుపు ప్యాకెట్ పట్టుకొచ్చి ఇచ్చాడు కృష్ణమాచారి. ‘ఇదే పసుపును సులేఖకు రాశారా?’ సూటిగా అడిగాడు రుద్ర. అవునంటూ తలూపాడు. ‘మరి.. మీ బిడ్డకు మంగళ స్నానం పోయడానికి సిద్ధం చేసిన నీళ్లు?’ అడిగాడు రుద్ర. ‘మంటలు రేగడంతో ఆ మంటలను ఆర్పడానికి.. ఆ నీళ్లనే వినియోగించాం’ అన్నాడు కృష్ణమాచారి. ‘మంటలు ఆరిపోయాయా?’ రుద్ర ప్రశ్న.
‘లేదు ఇంకా పెరిగాయి’ అన్నాడు. ‘ఇప్పుడు ఆ నీళ్లన్నీ పారబోసినట్టే కదూ’ రుద్ర మళ్లీ ప్రశ్నించాడు. అవునన్నట్టు తలూపిన కృష్ణమాచారి.. ‘ఇదంతా ఎందుకు అడుగుతున్నారు సార్’ అంటూ ప్రశ్నించాడు. ‘బామ్మగారూ.. మంగళస్నానం కోసం సిద్ధం చేసిన నీటిలో ఇంకేమైనా కలిపారా?’ అడిగాడు రుద్ర. ‘మా ఆచారం ప్రకారం.. పసుపు, గంధంతోపాటు పంచామృతాలను కూడా కలిపాం. మంగళస్నానం పూర్తయిన తర్వాత.. మామూలు నీళ్లతో అమ్మాయికి స్నానం చేయిస్తాం’ చెప్పింది వకుళాదేవి. ‘మరి, ఏమీ కలపని నీళ్లు సిద్ధం చేయలేదా?’ ఆత్రుతగా ప్రశ్నించాడు రుద్ర. ‘చేశాం బాబూ.. అయితే, పంచామృత నీటితో స్నానం చేయిస్తుండగానే మంటలు చెలరేగాయి.
దీంతో నా మనుమరాలు చనిపోయింది’ అంటూ వకుళాదేవి ఏడుస్తుండగానే.. ‘కృష్ణమాచారి గారూ.. ఇది దైవాగ్రహం కాదు. ఒకరి కర్కశత్వం. ఎలా అనేది సైంటిస్ట్ అయిన మీకు కూడా ఈజీగా అర్థమయ్యే ఉంటుంది. స్టేషన్‌కు వెళ్దామా?’ అంటూ బాంబు పేల్చాడు రుద్ర. ‘రెండు లాజిక్స్ మిస్ అయి దొరికిపోయా’ అంటూ తలవంచుకొన్నాడు. ‘రెండు కాదు సైంటిస్ట్ గారూ. మూడు’ అని చెప్పిన రుద్ర.. పోలీస్‌స్టేషన్‌కు కదిలాడు. అసలేం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంతకీ, కృష్ణమాచారిని రుద్ర ఎందుకు అరెస్ట్ చేసినట్టు? రుద్ర పట్టుకొన్న ఆ మూడు లాజిక్స్ ఏమిటి?
కృష్ణమాచారే ఎంతో ప్లానింగ్‌తో తన కూతురు సులేఖను చంపాడు. బంధువుల కంటే కృష్ణమాచారికి కులాల పట్టింపు మరింత ఎక్కువ. తన కూతురు వరుణ్‌ను పెండ్లి చేసుకుంటానంటే వారించాడు. ఆమె వినలేదు. దీంతో నాస్తికుడైనా.. పండితులకు డబ్బులు ఇచ్చి జాతకాల పేరిట పెండ్లి ఆపించాలనుకొన్నాడు. కుదరలేదు. ఇంతలో అరసవెల్లి ఘటనకూడా అతనికి కలిసొచ్చింది. అయినప్పటికీ సులేఖ వినే స్థితితో లేదు. దీంతో వృత్తిరీత్యా సైంటిస్ట్ అయిన కృష్ణమాచారి మంగళస్నానాల కోసం సిద్ధం చేసిన పసుపులో పొటాషియం పర్మాంగనేట్, పంచామృతాల పేరిట నీటిలో ఎక్కువ మోతాదులో గ్లిజరిన్ కలిపాడు. మండేస్వభావం ఉన్న ఈ రెండూ కలవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సులేఖ బతికి బయటపడొద్దనే.. మంటలను ఆర్పేస్తున్నట్టు ఆ గ్లిజరిన్ నీటినే మళ్లీ ఆమెపై పోసి చంపాడు. పసుపు ప్యాకెట్ తీసుకురమ్మని రుద్ర కానిస్టేబుల్‌ను పురమాయిస్తే, వేరే ప్యాకెట్‌ను కృష్ణమాచారి తీసుకొచ్చి ఇవ్వడం (మొదటి లాజిక్), వేరే నీళ్లు ఉన్నాకూడా మంగళస్నానాల నీటిని మంటలార్పడానికి వాడామని చెప్పడంతో (రెండో లాజిక్) రుద్రకు కృష్ణమాచారి మీద డౌట్ వచ్చింది. వరుణ్ బాధతో కౌగిలించుకోవడానికి వస్తే, తక్కువ కులం వాడన్న కారణంతో అతన్ని అసహ్యించుకొంటూ కృష్ణమాచారి దూరం జరుగడంతో (రుద్ర కనిపెట్టిన మూడో లాజిక్) రుద్ర అనుమానం పెరిగింది. ముత్తయిదల చేతులు కాలడానికి గల కారణాలు ఉన్న రిపోర్ట్ అప్పుడే రావడంతో అసలు హంతకుడు అమ్మాయి తండ్రేనని రుద్ర డిసైడయ్యాడు.
– రాజశేఖర్ కడవేర్గు