గంగా భీషణ్ అగర్వాల్… ఈ పేరు ఎప్పుడైనా విన్నట్టు అనిపిస్తుందా… లేదు కదా! మరి హల్దీరామ్ విన్నారా? అది వినక పోవడం ఏమిటీ, భుజియా నుంచి మూంగ్‌దాల్ దాకా వాళ్ల ఉత్పత్తులు తిన్నాం కూడా అంటారు చాలామంది. ఎందుకంటే అది ఇంటింటికీ చేరిన భారత బ్రాండ్. దీని రూపకర్తే గంగా భీషణ్ అగర్వాల్. పూర్తి పేరు ఇదే అయినా అతన్ని అంతా హల్దీరామ్ జీ అనే పిలిచేవారు. కేవలం వంద రూపాయలతో సేగు (భుజియా) వ్యాపారం ప్రారంభించి స్నాక్స్, స్వీట్లు, రెస్టారెంట్ల దాకా దాన్ని విస్తరించి, ఈ రోజు లక్ష కోట్ల రూపాయల విలువ కలిగిన సామ్రాజ్యాన్ని నిర్మించారు.
మనం సేగు, మురుకులు తిన్నట్టుగా బికనూర్‌లో భుజియా తినేవాళ్లు. హల్దీరామ్ తాత భుజియా అమ్మే వాళ్లు. దాని అమ్మకంతో వచ్చే ఆదాయం అంతంత మాత్రమే అవడంతో కుటుంబ పరిస్థితి సాదాసీదాగానే ఉండేది. చిన్నప్పటి నుంచే హల్దీ రామ్ భుజియా తయారీ పట్ల ఆసక్తి చూపేవాడు. ఆయన అత్త దీన్ని చేయడం నేర్పించింది. చేసీ చేసీ దాని తయారీలో మంచి అనుభవం గడించాడు. 1908లో పుట్టిన హల్దీరామ్ కేవలం 12 ఏండ్ల వయసులోనే భుజియా తయారు చేసి సొంతంగా అమ్మడం మొదలు పెట్టాడు. అందులో తనకంటూ సొంత బ్రాండ్ ఇమేజ్ ఉండాలని చిన్న వయసులోనే అతను భావించాడు.
అంతేకాదు, మార్కెట్లో అందరు అమ్మేదానిలా కాకుండా తన భుజియాకు ప్రత్యేక రుచి ఉండాలి అని అనుకున్నాడు. అందుకే అప్పటివరకు మార్కెట్లో అందరు చేసినట్టు కాకుండా, భుజియాను సన్నగా చేశాడు. ప్రత్యేకమైన రుచికోసం దానిలో మోతిదాల్ కలిపాడు. ఇక, బికనూర్ ప్రాంతంలో మహారాజా దుంగర్ సింగ్ అనే పూర్వపు రాజుకు ప్రజల్లో మంచి పేరు ఉండేది. హల్దీరామ్ తన భుజియాకు బ్రాండ్ ఏర్పడాలి అనుకున్నందున దానికి ఆ మహారాజు పేరు పెట్టాడు. ‘దుంగర్’ పేరుతో తొలిగా తన వ్యాపార అమ్మకాలు జరిపాడు. ఈ పేరు మార్కెట్లోని ఇతర వ్యాపారుల నుంచి భిన్నమైందిగా నిలబెట్టింది.
కొత్త ఆరంభం
హల్దీరామ్‌కు 36 ఏండ్ల వయసు వచ్చే సరికి వ్యాపారం వేగం పుంజుకుంది. భార్య, ఇద్దరు సోదరుల సహకారంతో ఆయన దీన్ని నడిపేవారు. ఈ ఉమ్మడి కుటుంబ వ్యాపారం బాగానే సాగుతున్నది అనుకుంటున్న సమయంలో కుటుంబంలోని మహిళల మధ్య గొడవ తలెత్తింది. దీంతో వ్యాపారాన్ని సోదరులు తీసేసుకుని, హల్దీరామ్ను బయటకు పంపించారు. మళ్లీ బతుకు తెరువు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ‘హల్దీరామ్…’ అన్న పిలుపు దేవుడు పిలిచినట్టుగా ఆయనకు వినిపించింది. చూస్తే తన బాల్య మిత్రుడు చాలా కాలం తరువాత బికనూర్ వచ్చాడు. హల్దీరామ్ తన దయనీయమైన పరిస్థితి మిత్రుడికి చెప్పాడు.
ఎప్పుడో మిత్రుడికి హల్దీరామ్ రెండు వందల రూపాయలు ఇచ్చాడు. అప్పటికప్పుడు మిత్రుడు వంద రూపాయలు తిరిగి ఇచ్చేసి, మిగిలిన డబ్బు కూడా ఇచ్చేస్తాను అని చెప్పాడు. 1944లో ఆ వంద రూపాయలతోనే హల్దీరామ్ బికనూర్‌లో ఒక గది అద్దెకు తీసుకొని భుజియా తయారు చేసి వ్యాపారాన్ని ప్రారంభించాడు. భార్య చంపాదేవి సహకారంతో భుజియాతో పాటు మూంగ్ దాల్ తయారు చేసి స్థానికంగా ఉన్న కార్మికులు, ఉద్యోగులకు వారు పని చేసే చోటుకు వెళ్లి అమ్మేవాడు. వ్యాపారం పుంజుకోవడంతో షాప్ ప్రారంభించాడు.
అసలైన మలుపు
1950 సంవత్సరంలో కలకత్తాకు మిత్రుడి కుమార్తె పెండ్లి కోసం వెళ్లడంతో హల్దీరామ్ దశ తిరిగింది. ఈ వేడుకలో హల్దీరామ్ అందరికీ భుజియా రుచి చూపించాడు. అతిథులకు దాని రుచి నచ్చడమే కాదు బోలెడు ఆర్డర్స్ లభించాయి. కలకత్తాలో తన వ్యాపారానికి మంచి అవకాశం ఉందని హల్దీరామ్‌కు అర్థమయింది. తన చిన్న కుమారుడు రామేశ్వర్ లాల్‌ను, మనవడు శివ కిషన్‌ను 1955 లో హల్దీరామ్ కలకత్తా పంపించాడు. ఎనిమిది చదరపు అడుగుల చిన్న గదిలో అక్కడ వ్యాపారం మొదలు పెట్టారు. క్రమేణా రోజుకు 150 నుంచి 200 కిలోల భుజియా అమ్మే స్థాయికి చేరుకున్నారు.
బెంగాలీల టేస్ట్‌కు అనుగుణంగా తయారీలో మార్పులు చేర్పులు చేశారు. బెంగాలీ మిక్చర్ పేరుతో మిక్చర్‌ను తయారు చేశారు. 12 ఏండ్లలో కలకత్తాలో వ్యాపారం బాగా పెరిగింది. క్రమంగా బికనూర్ కన్నా కలకత్తా వ్యాపారం పెద్దదయింది. 1968 నాటికి హల్దీరామ్ ముగ్గురు కుమారులు వ్యాపారంలో రాటు దేలారు. పెద్ద కుమారుడు మూల్ చంద్ బికనూర్ వ్యాపారాన్ని చూసుకుంటే, మరో కుమారుడు సతి దాస్ కుటుంబం నుంచి విడిపోయి సొంత వ్యాపారం పెట్టుకున్నాడు.
రామేశ్వర్ లాల్ కలకత్తా వ్యాపారం చూసుకుంటున్నాడు. 1968లో మనవడు శివ కిషన్ నాగ్‌పూర్‌లో వ్యాపారం మొదలు పెట్టాడు. ఇతనే హల్దీరామ్‌లో స్వీట్స్ మొదలు పెట్టాడు. గుజరాత్ పేడా, మైసూర్ పాక్, లడ్డు రుచి చూపించాడు. తొలుత ఫ్రీ శాంపిల్స్ ద్వారా హల్దీరామ్ స్వీట్స్‌కు అలవాటు పడేట్టు చేశాడు. ఆ రోజు వీరు మొదలు పెట్టిన ఈ ప్రయోగం ఇప్పుడు ఇండియాలో అతి పెద్ద స్వీట్స్ బ్రాండ్‌గా హల్దీరామ్ను నిలబెట్టింది.
ఓ రోజు శివ కిషన్ నాగ్‌పూర్‌లో కీర్తి రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఆ రెస్టారెంట్లో దోశ , ఇడ్లీ మాత్రమే లభిస్తుంది. అయినా జనం కిక్కిరిసి పోయి ఉన్నారు. దక్షిణాది అల్పాహారం పట్ల జనం లో ఉన్న ఆసక్తిని అర్థం చేసుకుని, హల్దీరామ్ రెస్టారెంట్ల రంగంలోకి ప్రవేశించింది. అలా ఒక దాని తరువాత ఒకటి 30 రెస్టారెంట్లు ప్రారంభించారు. మరో దశలో ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో విదేశీ కంపెనీలే తప్ప ఇండియన్ బ్రాండ్ ఒక్కటీ లేకపోవడాన్ని గమనించి అటువైపు అడుగులేశారు.
భుజియాతో పాటు రకరకాల చిరుతిళ్లను ఐదు రూపాయల ప్యాకెట్ మొదలుకొని 200 రూపాయల ప్యాకెట్ దాకా రూపొందించి మార్కెట్లో అమ్మడం ప్రారంభించారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఏ ఊరు వెళ్లినా హల్దీరామ్స్ అంటే అందరికీ పరిచయం అయింది. ఇప్పుడు మన దగ్గరే కాదు ప్రపంచంలోని 80 దేశాల్లో హల్దీరామ్ స్వీట్లు, హాట్లు లభిస్తాయి. పెద్ద ఎత్తున చేస్తేనే వ్యాపారం అనుకునే వారికి కేవలం వంద రూపాయల పెట్టుబడితో కారప్పూస అమ్మకం ప్రారంభించి, ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన హల్దీరామ్స్ ప్రయాణం కొత్త దారిని చూపుతుంది.
…? బుద్దా మురళి, 98499 98087