పిల్లలు ఎందుకు ప్రతిదీ మర్చిపోతున్నారు? అనేది చాలామంది తల్లిదండ్రులు మనసులో అనుకునే ప్రశ్న. మర్చిపోవడం అనేది సోమరితనం, ఆసక్తి లేకపోవడం కాదు. నిద్ర, పోషణ, కదలిక, ఎలా చదువుతున్నారు అనే వాటిపై పిల్లల జ్ఞాపకశక్తి ఆధారపడి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. జ్ఞాపకశక్తి అనేది శిక్షణ ఇవ్వగలిగే నైపుణ్యం. పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచవచ్చు.
న్యూరోసైన్స్ అధ్యయనాలు తల్లిదండ్రులకు అభ్యాసాన్ని భారంగా మార్చకుండా, జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి స్పష్టమైన, ఆచరణాత్మక సాధనాలను అందిస్తున్నాయి. కునుకు తీయడం, మైండ్‌ఫుల్ బ్రీతింగ్ లాంటివి పిల్లలను ఆత్మవిశ్వాసంతో నేర్చుకునే వారిగా మార్చడానికి సాయపడతాయి. అవేంటో చూద్దాం రండి.
నిద్ర కేవలం మెదడుకు విశ్రాంతి ఇవ్వడమే కాదు, జ్ఞాపకాలను ఏకీకృతం చేస్తుంది. తద్వారా నిన్నటి అభ్యాసం ఈ రోజు గుర్తుంటుంది. 3 నుంచి 5 సంవత్సరాల వయసు వారికి పగటిపూట నిద్రను ప్రోత్సహించండి. పెద్ద పిల్లలకు 9 నుంచి 12 గంటల (వయసును బట్టి) పాటు నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్రకు ముందు స్క్రీన్లకు దూరంగా ఉంచండి. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తరగతి గదిలో పగటిపూట కునుకు తీయడం పిల్లలకు ఆ రోజు ముందు నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకోవడానికి సాయపడుతుందని తెలిపింది.
మెదడుకు శిక్షణ ఇవ్వడానికి శరీరాన్ని కదిలించాలి. క్రమం తప్పకుండా ఏరోబిక్స్ చేస్తే మెదడుకు శక్తినిచ్చే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ (శ్రద్ధ, నిగ్రహం, వర్కింగ్ మెమొరీ) బలోపేతం అవుతుంది. రోజూ 60 నిమిషాల పాటు పిల్లలకు ఆటలు ఉండేలా చూసుకోండి. సమయం తక్కువగా ఉంటే, హోమ్‌వర్క్‌కు ముందు 10 నుంచి 15 నిమిషాల చిన్నపాటి కదలికలు వారితో చేయించండి.
పిల్లలు ఒకే విషయాన్ని పదే పదే చదవడం కన్నా… వాళ్ల జ్ఞాపకశక్తి నుంచి సమాచారాన్ని గుర్తు చేసుకోవడం మంచిది. అలా మననం చేయడం వల్ల.. అభ్యసనా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పిల్లలు ఏదైనా చదివిన తర్వాత… మరుసటి రోజు అదే అంశంపై రెండు నిమిషాలపాటు క్విజ్ పెట్టండి. 2013లో సైకలాజికల్ సైన్స్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రాక్టీస్ టెస్టింగ్, డిస్ట్రిబ్యూటెడ్ ప్రాక్టీస్ అధిక ప్రయోజనాలను అందిస్తాయని వివరించింది.
సమూహ అధ్యయనం కన్నా.. విరామాలతో కూడిన సెషన్లు అన్ని వయసుల వారికి మెరుగ్గా పని చేస్తాయి. ఒకేసారి ఎక్కువ సేపు చదివే బదులు, చదవాల్సిన విషయాని మూడు చిన్న సెషన్లుగా రెండు, మూడు రోజులకు విభజించండి. కొద్దిగా మరచిపోయిన తర్వాత మళ్లీ చూసేలా క్యాలెండర్ రిమైండర్లను ఉపయోగించండి.
పదాలను స్కెచ్‌లుగా మార్చడం అర్థవంతమైన ప్రక్రియకు సాయపడుతుంది. సైన్స్ పదాల కోసం 20-సెకన్ల స్టిక్-ఫిగర్ డూడుల్స్ నిర్వచనాలను కాపీ చేయడం కన్నా స్కెచ్‌లు మెరుగ్గా పని చేస్తాయి. తర్వాత ఆ స్కెచ్‌ను వివరించమనండి. రాసిన వాటి కంటే గీసిన పదాలను మెరుగ్గా గుర్తుంచుకుంటారని 2016లో ప్రచురితమైన డ్రాయింగ్ ఎఫెక్ట్ అనే అధ్యయనంలో తేలింది.
మైండ్‌ఫుల్‌నెస్ బ్రీతింగ్ ఒత్తిడిని తగ్గించి వర్కింగ్ మెమొరీని మెరుగుపరుస్తుంది. చదువుకునే ముందు రెండు నిమిషాల స్క్వేర్ బ్రీతింగ్ చేయమని చెప్పండి. అంటే నాలుగు సెకండ్లపాటు శ్వాస తీసుకొని, రెండు సెకండ్లు శ్వాసను హోల్డ్ చేసి, మళ్లీ నాలుగు సెకండ్లపాటు శ్వాసను వదలాలన్నమాట. ఇలా ఆరు నుంచి ఎనిమిదిసార్లు చేయమని చెప్పండి. మైండ్‌ఫుల్‌నెస్ శిక్షణ పొందిన విద్యార్థుల్లో వర్కింగ్ మెమొరీ, ఏకాగ్రత పెరిగినట్టు 2016లో జర్నల్ ఆఫ్ ఆడాలసెంట్ హెల్త్‌లో ప్రచురితమైన అధ్యయనంలో గమనించారు. మర్చిపోవడం అనేది సహజ ప్రక్రియ. అందులో పిల్లల లోపం ఏమీ ఉండదు. కొన్ని మానసిక రుగ్మతలు, మెదడుకు గాయాలు అయిన వారు తప్ప అందరూ విషయాలను గుర్తుంచుకోగలరు. పిల్లలపై మొద్దులు అని పేరెంట్స్, టీచర్స్ ముద్ర వేయకుండా సరైన ప్రోత్సాహం, వాతావరణం కల్పిస్తే వారు చదువులో, బయటి ప్రపంచంలోనూ రాణిస్తారు.
పోషకాలతో కూడిన అల్పాహారం, తగినంత నీరు, ఉదయం తీసుకునే గ్లూకోజ్ కాన్సంట్రేషన్, వర్కింగ్ మెమొరీకి మద్దతునిస్తాయి. స్వల్పడీ హైడ్రెషన్ కూడా మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. పిల్లల ఆహారంలో ప్రోటీన్‌ను ఫైబర్‌తో జత చేయండి. బడిలో వాటర్ బాటిల్ దగ్గరే ఉండేలా చూసుకోవాలని చెప్పండి. పరీక్షలు, హోమ్‌వర్క్‌కు ముందు నీరు తాగమని సూచించండి. అల్పాహారం తినడం జ్ఞాపకశక్తిపై స్వల్పకాలిక సానుకూల ప్రభావం చూపుతుంది. ఎపిటైట్ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం అదనపు నీరు తాగిన పిల్లలు దృశ్య సంబంధమైన పనుల్లో మెరుగ్గా పనిచేశారని నిరూపించింది.