బంజారాహిల్స్,సెప్టెంబర్ 20: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించడంతోపాటు అబద్దపు ప్రచారం చేసిన ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడిన తనపై పోలీసులు కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. సీఎం రమేష్‌పై చేసిన వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో గాదరి కిషోర్‌పై నమోదైన కేసులో శుక్రవారం విచారణకు హాజరయ్యారు.
సుమారు 30 నిమిషాల పాటు గాదరి కిషోర్‌ను పోలీసులు విచారించారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు డా.దాసోజు శ్రావణ్‌కుమార్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు బీఆర్ఎస్ లీగల్ టీమ్ సభ్యులు ఆయనకు సంఘీభావంగా పీఎస్‌కు వచ్చారు. విచారణ అనంతరం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన గాదరి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రమేష్ అనే వ్యక్తి టీడీపీ ఎంపీనా.. బీజేపీలో ఉన్నారా? అర్థం కావడం లేదన్నారు. తమ నాయకుడు కేటీఆర్‌పై అబద్దాలు మాట్లాడితే ఖండించానని, తాను మాట్లాడని వ్యాఖ్యలను ఆపాదించి కుట్రపూరితంగా తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పారు.
ఇలాంటి తాటాకు చప్పుళ్లకు, కేసులకు తాను బెదిరేది లేదని, పార్టీ కోసం ప్రజలకోసం పనిచేస్తూనే ఉంటామన్నారు. చట్టాలను గౌరవించి తాను విచారణకు హాజరయ్యానని, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానన్నారు. కాగా గాదరి కిషోర్ విచారణకు రావడంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు, విద్యార్థులు పీఎస్ వద్దకు చేరుకుని ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.