హయత్నగర్, సెప్టెంబర్ 20 ః వైద్యుల నిర్లక్ష్యంతోనే ఓ బాలిక మృతిచెందిన సంఘటన హయత్నగర్ డివిజన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన ధ్యానమొయిన జ్యోతి, శేఖర్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు. కూతురు ధ్యానమొయిన నిహారిక(11) గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు రూ.10 నాణేన్ని మిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చిన్నారిని చికిత్స నిమిత్తం వనస్థలిపురంలోని హుడాసాయినగర్ కమాన్ వద్దనున్న తన్వి హాస్పిటల్కు తీసుకొచ్చారు.
అదేరోజు రాత్రి నిహారికకు సర్జరీ చేసిన వైద్యులు మింగిన నాణేన్ని తొలగించారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు పేషెంట్ పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన రోజు సాయంత్రం మళ్లీ నిహారిక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు తిరిగి నిహారికను తన్వి హాస్పిటల్కు తీసుకొచ్చి తమ కూతురుని కాపాడాలని ఆస్పత్రి వైద్యులను వేడుకున్నారు.
దీనికి ఆస్పత్రి యాజమాన్యం అడ్మిట్ చేసుకోకుండా వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడంతో పరిస్థితి విషమించి నిహారిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న నిహారిక బంధువులు ఆస్పత్రికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.