తొమ్మిది రోజులు బతుకమ్మ పేర్చి, గౌరీదేవిని నిష్ఠగా పూజించడం వల్ల మనలో క్రమశిక్షణ అలవడుతుంది. ఉదయమే లేవడం, శుచి శుభ్రత తర్వాత అమ్మవారిని భక్తితో కొలవడం, సాయంత్రం నిర్దిష్ట సమయానికి బతుకమ్మ ఆడటం ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం, దానిని సక్రమంగా ఆచరించడం ద్వారా సమయపాలన, స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చెందుతాయి. మన పూర్వికుల ఆచారాలకు కారణాలు తెలుసుకొని పాటించడం వల్ల అవి మనకు నిజాయతీగా ఉండటం నేర్పుతాయి. మంచి అలవాట్లను పెంపొందిస్తాయి. బతుకమ్మను అందంగా, కనులవిందుగా పేర్చడం ఒక కళ.
వెదురుసిబ్బిలో మొదటగా బీర ఆకులను గానీ, సొర ఆకులను గానీ పరచి వాటిపై ఒక్కో వలయంగా పూలను పేర్చుతారు. రకరకాల పూలను ఎలా పేర్చాలో, రంగుల పూలను ఒకదాని తర్వాత ఒకటి ఆకర్షణీయంగా ఎలా అమర్చాలో, రంగుల కలయిక ఎలా ఉండాలో, వైవిధ్యంగా ఎలా తీర్చిదిద్దాలో.. భిన్న కోణాల్లో ప్రయత్నించడం ద్వారా కొత్త ఆలోచనలకు నాంది పడుతుంది. సృజన పెరుగుతుంది.
బతుకమ్మ కోసం పూలను సేకరించడం ద్వారా… ఒకరింటికి ఒకరు వెళ్లడం, సేకరించిన పూలను పంచుకోవడం, ఒకరి దగ్గర ఉన్న పూలను ఇంకొకరికి ఇవ్వడం, కొంతమంది కలిసి పెద్ద బతుకమ్మను పేర్చుకోవడం, ఇలా పేర్చడంలో ఒకరికొకరు సహాయపడటం ద్వారా సహకారభావం పెంపొందుతుంది. ఒకరిపట్ల ఒకరికి గౌరవం కలుగుతుంది. వీధిలోని వారంతా ఒకచోట చేరి, అక్కడ ప్రతిరోజూ బతుకమ్మ ఆడతారు.
ఆటకు వెళ్లేటప్పుడు ఇరుగుపొరుగు వారిని కలవడం, మాట్లాడుకోవడం, అందరూ కలిసికట్టుగా బయలుదేరడం, కబుర్లతో కాలక్షేపం చేయడం, సంతోషాలను పంచుకోవడం, బాధలను చెప్పుకోవడం ద్వారా మనసు బరువు తేలికై బంధాలు బలపడతాయి. కష్టసుఖాలను పంచుకోవడంతో సుముఖత పెరుగుతుంది. అందరం ఒక్కటనే భావన పెంపొందుతుంది. మొత్తంగా బతుకమ్మ పండుగ ఆధ్యాత్మికతను పెంచడంతోపాటు జీవన విలువలనూ పెంచుతుంది.