మార్నింగ్ జాగ్కి వెళ్లొచ్చిన ఇన్స్పెక్టర్ రుద్ర.. కుర్చీలో కూర్చొని పేపర్ తిరగేస్తున్నాడు. పనిమనిషి శ్యామల కాఫీ తీసుకొచ్చి రుద్ర చేతికి అందించింది. అక్కడినుంచి వెళ్లకుండా అలాగే నిలబడిపోయింది. ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించిన ఆమెను చూసి ‘ఏంటి?’ అన్నట్టు కనుబొమలు ఎగరేశాడు రుద్ర. ‘చిన్నసారూ.. రీడ్ బిట్వీన్ ది లైన్స్’ అంటే ఏంటి?’ అని సూటిగా అడిగింది శ్యామల. చదువుకోలేదని చెప్పిన శ్యామల ఇంగ్లిష్ మీడియమ్ గురించి వాకబు చేయగానే ఆశ్చర్యపోయాడు రుద్ర.
పక్కనే ఉన్న తన తల్లి వంక చూస్తూ.. ‘శ్యామలక్క చదువుకోలేదని చెప్పిన మాట అబద్ధమేమో కదా!’ అన్నాడు. ‘నువ్వు ఊరుకోరా! అదేదో సినిమాలో ఈ డైలాగ్ వింది. దాని అర్థం తెలుసుకుందామని అడిగింది’ అన్నది రద్ర వాళ్లమ్మ రూప. రుద్ర సమాధానం చెప్పేంతలోపు ఫోన్ మోగింది. ‘తర్వాత చెప్తాలే..’ అని ఫోన్ పట్టుకొని అక్కణ్నుంచి కదిలాడు రుద్ర. ఫోన్లో అటునుంచి స్నేహిల్. ‘హలో అన్నయ్యా.. ఎలా ఉన్నావ్?!’ అడిగాడు రుద్ర. ‘బాగానే ఉన్నాను. ఒకసారి నిన్ను కలవాలి’ అన్నాడు.
అన్నదమ్ములు ఎప్పుడూ కలిసే రెస్టారెంట్‌కు చేరుకున్నాడు రుద్ర. కాసేపటికి స్నేహిల్ వచ్చాడు. అతనితోపాటు ఓ అమ్మాయి కూడా వచ్చింది. వచ్చీరాగానే పాయింట్లోకి వెళ్లిపోయాడు స్నేహిల్. ‘రేయ్ రుద్ర.. ఈ అమ్మాయి పేరు యశోధర. మా కొలీగ్. ఆమెదే ఈ సమస్య. అందుకే నిన్ను పిలిచా’ అంటూ యశోధర వైపు తిరిగాడు స్నేహిల్. రుద్ర కూడా సమస్య ఏంటోనని ఆసక్తిగా వినడం ప్రారంభించాడు.
యశోధర ప్రారంభించింది.. ‘సార్.. నాపేరు యశోధర. నాలుగేండ్ల కిందటివరకూ అమెరికాలోనే ఉండేదాన్ని. కరోనాతో మా నాన్నగారు చనిపోవడంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యా. నాన్నకు నేనొక్కదాన్నే. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న చనిపోయాక.. ఇన్నేండ్లు ఎలాగోలా గడిపా.
ఇప్పుడు ఇండియాలో ఉండాలని లేదు. దీంతో మా ఆస్తులన్నీ అమ్మేసి అమెరికా వెళ్లిపోవాలని ఫిక్సయ్యా. పార్టీ కూడా దొరికింది. అయితే, చనిపోయేముందే ఆస్తులన్నిటినీ నాన్న తనపేరిట రాసినట్టు మా బాబాయ్ చెప్తున్నాడు. నాకు తెలిసి నాన్నగారు అలా చేస్తే, నాకు కచ్చితంగా చెప్పేవారు’ చెప్పుకొంటూ పోతున్నది యశోధర. ‘మరి, ఈ విషయం మీ బాబాయ్‌ను అడగలేదా?’ ప్రశ్నించాడు రుద్ర.
‘అడిగాను సార్! అదంతా నాకు తెలియదు. మీ తండ్రి-కూతుళ్ల మధ్య ఏం జరిగిందో నాకు అనవసరం. మీ నాన్న నాకు రాసిచ్చినట్టు ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లు, రుజువులను కావాలంటే వెరిఫై చేస్కో’ అంటూ నాకు కాపీలు కూడా ఇచ్చాడు’ చెప్పింది యశోధర.
‘వెరిఫై చేశారా?’ అని ప్రశ్నించాడు రుద్ర. మౌనంగా ఉండిపోయింది యశోధర. కలగజేసుకొన్న స్నేహిల్.. ‘రేయ్.. వీళ్ల బాబాయ్‌కి ఇక్కడ పొలిటికల్ సర్కిల్ ఎక్కువ. అలాంటివాళ్లకు ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించడం ఎంతసేపు. అందుకే, వెరిఫై చేస్కోమని ధైర్యంగా అన్నాడు’ అంటూ చెప్పాడు స్నేహిల్. ‘ఒకసారి డాక్యుమెంట్లు చూస్తా. రేపు వచ్చేప్పుడు తీసుకురమ్మని చెప్పు’ అన్నాడు రుద్ర.
స్నేహిల్.. మెరుస్తున్న కండ్లతో ‘రేపటివరకు ఎందుకు.. ఇప్పుడే చూడొచ్చు. ఆల్రెడీ తెచ్చేశాం’ అంటూ డాక్యుమెంట్లు అతనికి ఇచ్చాడు. డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న రుద్ర.. యశోధరతో ‘మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు?’ అడిగాడు. ‘కరోనా ఫస్ట్‌వేవ్, జూన్ 9న చనిపోయారు’ చెప్పిందామె. ‘ఎలా పోయారు?’ అన్నాడు రుద్ర.
‘కరోనాతో..’ అంది యశోధర. ‘అన్నట్టు మీ నాన్న పేరు?’ రుద్ర ప్రశ్న.. ‘కమలాకర్’ అందామె. యశోధర చెప్పినట్టే కమలాకర్ 2020, జూన్ 9న మరణించారు. అంతకుముందు రోజే యశోధర బాబాయ్ సుధాకర్‌కు యావదాస్తి రాసిచ్చినట్టు డాక్యుమెంట్లో ఉంది.
ఇది చూసిన రుద్ర.. ‘చూడండి. ఇందులో క్లియర్‌గా ‘కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలో జూన్ 8, 2020న నా ఇంట్లో లాయర్ ముందు నా ఇష్ట ప్రకారమే.. నా యావదాస్తిని నా తమ్ముడు సుధాకర్ పేరిట రాస్తున్నా. ఇందులో ఎవ్వరి బలవంతమూ లేదు’ అని మీ నాన్న క్లియర్‌గా రాశాడు’ గొంతు పెంచి అన్నాడు రుద్ర.
‘అన్నీ పక్కాగా ప్లాన్ చేశారండీ..’ చెప్పింది యశోధర. ‘అయితే, ఇప్పుడు మనమేమీ చేయలేం. కోర్టుకు వెళ్లినా.. సాక్ష్యాలు చూస్తారు గానీ, మనం చెప్పేది వినరు’ చెప్పాడు రుద్ర. మౌనంగా ఉండిపోయింది యశోధర. చేసేదేమీలేక నిల్చుండిపోయాడు స్నేహిల్. ఇంతలో రుద్ర మొబైల్ రింగ్ అయ్యింది. అటునుంచి శ్యామల.. ‘చిన్నసారూ.. రీడ్ బిట్వీన్ ది లైన్స్ అంటే ఏంటో ఇంకా చెప్పలేదు?’ ఆత్రుతగా అడిగింది. అప్పటికే చిరాగ్గా ఉన్న రుద్ర.. ‘ఇప్పుడు అవసరమా? ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావ్’ అంటూ కసురుకొని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో రుద్ర మెదడులో మెరుపులాంటి ఆలోచన.
యశోధర చేతుల్లోని డాక్యుమెంట్లను మళ్లీ తీసుకొని నిర్ధారించుకొన్నాడు. నవ్వుతూ వెంటనే శ్యామలకు ఫోన్ కలిపాడు. ‘సారీ అక్కా.. ఏదో టెన్షన్లో అరిచా ఏమనుకోకు! రీడ్ బిట్వీన్ ది లైన్స్ అంటే.. మీదికి కనిపించే వాటిని మాత్రమే చూడొద్దు. లోపల దాగున్న అర్థాన్ని వెదుకు’ అనే సందర్భంలో వాడుతారు అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత స్నేహిల్ వైపు తిరిగి..
‘మై డియర్ బ్రదర్.. యశోధర గారి బాబాయ్ సృష్టించిన ఈ డాక్యుమెంట్లు ఫేక్ అని కరోనానే కనిపెట్టింది. అంతా ఫస్ట్‌వేవ్ మహిమ’ అంటూ రుద్ర నవ్వాడు. అర్థం కానట్టు యశోధర నిలబడింది. అప్పటికే విషయం అర్థమైన స్నేహిల్.. రుద్రను హగ్ చేసుకుని కేసు ఎలా సాల్వ్ చేయొచ్చో యశోధరకు వివరించాడు. ఇంతకీ, సుధాకర్ సృష్టించిన డాక్యుమెంట్లు ఫేక్ అని రుద్ర ఎలా నిరూపించాడో మీకు అర్థమయ్యిందా?
సుధాకర్‌కు యావదాస్తిని రాస్తూ.. ‘కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలో 2020, జూన్ 8న నా ఇంట్లో లాయర్ ముందు నా ఇష్ట ప్రకారమే.. నా యావదాస్తిని నా తమ్ముడు సుధాకర్ పేరిట రాస్తున్నా. ఇందులో ఎవ్వరి బలవంతమూ లేదు’ అని డాక్యుమెంట్లో కమలాకర్ రాసినట్టు ఉంది. చనిపోవడానికి ఒకరోజు ముందు అంటే 2020, జూన్ 8న కమలాకర్ ఈ వీలునామా రాసినట్టు సుధాకర్ పత్రాలు సృష్టించాడు. అయితే, అందులో కరోనా ఫస్ట్‌వేవ్ అని రాసిఉంది.
2021లో సెకండ్‌వేవ్ వచ్చాకే, 2020లో వచ్చిన కరోనాకు ఫస్ట్‌వేవ్ అని పేరుపెట్టారు. అయితే, జూన్ 8, 2020న రాసిన డాక్యుమెంట్లో కరోనా ఫస్ట్‌వేవ్ అని ఉంది. అప్పటికి కరోనా ఫస్ట్‌వేవ్ అనే పేరే వాడుకలో లేదు. అంటే ఈ డాక్యుమెంట్ కరోనా సెకండ్‌వేవ్ లేదా ఆ తర్వాత కమలాకర్ మరణించిన తర్వాత సృష్టించినట్టు అర్థమవుతుంది. ‘రీడ్ బిట్వీన్ ది లైన్స్’ సూత్రాన్ని మననం చేసుకొన్న రుద్ర.. అలా ఈ కేసు సాల్వ్ చేశాడు.
– రాజశేఖర్ కడవేర్గు