ఎక్కడ ఆర్కుట్.. ఎక్కడ ఇన్స్టాగ్రామ్!! దశాబ్దాలు గడిచిపోయాయ్.. ఆధార్‌కార్డు నెంబర్‌లానే అందరికీ సోషల్ మీడియా ఐడీలు ఉన్నాయి. వందల్లో ఫొటోలు.. వేలల్లో పోస్టింగ్స్.. నిత్యం లైక్‌లు.. కామెంట్లు.. ఇక ఇప్పుడు సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఏంటి? అనుకుంటున్నారా! అయితే, సోషల్ మీడియా నిర్వహణలో మీరు కచ్చితంగా వెనకబడి ఉన్నారు అనుకోవచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్ని రంగాల్లోనూ సోషల్ మీడియా మంచి, చెడులకు వేదికగా మారుతున్నది. వ్యక్తిగత పలుకుబడిని పెంచుకోవడానికే కాదు.. మీ బ్రాండ్‌కి బెంచ్ మార్క్ చేసేందుకూ సోషల్ మీడియానే ఆధారం. అయితే, ఆన్లైన్ మోసాల్లో సింహభాగం సోషల్ మీడియా వేదికగానే సాగుతున్నాయని నిపుణుల మాట. ఇలాంటప్పుడు.. సోషల్ మీడియా తామరాకుపై మీ ప్రొఫైల్ నీటి బిందువులా జారిపోవాలంటే ఇదిగో ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఏం పోస్ట్ చేస్తున్నాం? ఎలాంటివి షేర్ చేస్తున్నాం? అనే అంశంపై నిశితమైన అవగాహన ఉండాలి. లేకపోతే ఊహించని సమస్యలు ఎదురవుతాయి అనడంలో సందేహం లేదు. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సున్నితమైన అంశం కారణంగా మీ ఉద్యోగం పోవచ్చు. చదువుకు ఆటకం ఏర్పడొచ్చు. ప్రాణ స్నేహితుడు శత్రువులా మారొచ్చు. మీ జీవిత భాగస్వామి మీ నుంచి దూరం కావచ్చు. ఎప్పుడో షేర్ చేసిన చిన్న సమాచారం పెద్ద సమస్యకు బీజం అవుతుందని మర్చిపోవద్దు. మీ మొత్తం రెప్యుటేషన్‌ని రిస్క్‌లోకి నెట్టేయొచ్చు. మీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఒకే ఒక్క పోస్ట్ నెగెటివ్ వ్యక్తిగా ముద్ర వేసే ప్రమాదం ఉంది. అందుకే.. ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు రివ్యూ చేసుకోండి.
ఈ రోజుల్లో ఒకరి గురించి తెలుసుకోవాలంటే? అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు జల్లెడ పట్టక్కర్లేదు. సింపుల్‌గా వారి సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తే చాలు. మొత్తం తెలిసిపోతుంది. అంతలా ఫ్యామిలీ వికీపీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేసేస్తున్నారు. అందుకే మీడియా సంస్థలు ఎవరి గురించైనా డేటా కావాలంటే.. వెంటనే సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ని వెతికేసి ఆరా తీస్తున్నాయి. ఇక హ్యాకర్లు అయితే.. చాలా సింపుల్‌గా వ్యక్తిగత సమాచారాన్ని లూటీ చేసి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రైవసీని క్షణాల్లో క్రాక్ చేస్తున్నారు.
మన టైమ్ బాగున్నప్పుడు ఓ అవకాశం పలకరిస్తే ఎగిరి గంతేస్తాం. కానీ, ఎప్పుడో మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్ట్.. ఆ గుడ్టైమ్ కాస్తా బ్యాడ్టైమ్గా మార్చేయొచ్చు! అదెలాగంటే.. మిమ్మల్ని ఉద్యోగిగా తీసుకుందాం అనుకున్న కంపెనీ మీ ప్రొఫైల్‌ని నిశితంగా పరిశీలిస్తుంది. కొన్నేళ్ల క్రితం మీరు చేసిన నెగెటివ్ పోస్టింగ్ వాళ్ల కంటపడిందే అనుకుందాం. మీ ప్రవర్తనపై ఓ అంచనాకు వచ్చేస్తుంది. ఇలాంటి తీవ్ర భావజాలం ఉన్న అభ్యర్థి తమకు అవసరం లేదని ఫిక్సవ్వడానికి పెద్ద సమయం కూడా పట్టదు. అప్పుడు మీ పరిస్థితి.. అదేదో సినిమాలో చెప్పినట్టు ‘అదృష్టం తలుపు తట్టే సమయానికి.. దురదృష్టం బెడ్రూమ్లో ముసుగు తన్ని పడుకుంది’ అనుకోవడమే మిగులుతుంది.
ఉన్నాయి కదా అని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అకౌంట్లు తెరిచేయడం సరికాదు. మీ అవసరాలకు ఏది సరైందో తెలుసుకోవాలి. మీరు స్టుడెంట్ అయితే ఏది అవసరం? కెరీర్లో సెటిల్ అయ్యేందుకు ఏది ఉపయోగకరం? వ్యాపారానికి ఏది సరైన ఎంపిక?.. ఇలా ఆలోచించాకే సోషల్ మీడియాలో సైన్ఇన్ అవ్వాలి. తర్వాత ఓ గోల్ సెట్ చేసుకుని అందుకు తగిన సమాచారాన్ని షేర్ చేస్తూ ముందుకుసాగాలి. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ ప్రొడక్ట్ బ్రాండ్ ఎక్కువమందికి చేరేలా ‘ఫేస్బుక్’ని ఎంపిక చేసుకోవాలి. మీ కెరీర్‌ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ‘లింక్డిన్’లో నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా సోషల్ మీడియా వేదిక ఎంచుకున్నాక.. తరచూ ప్రయోజనకరమైన కంటెంట్ పోస్టు చేస్తుండాలి. పేరొందిన ఇన్‌ఫ్లూయెన్సర్లతో జతకట్టి.. మీ ఫ్రొఫైల్ రేటింగ్‌ని పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ఫాలో అవుతూ సోషల్ నెట్‌వర్క్‌లో చలాకీగా సాగిపోవాలి.
నెట్‌వర్క్‌లో ఎంత ఎక్కవమంది ఫ్రెండ్స్ ఉంటే అంత తోపులం అనుకుంటే పొరపాటు. వచ్చిన ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్నూ యాక్సెప్ట్ చేయడం పాత ట్రెండ్. మీ ప్రొఫైల్‌కు, మీ లక్ష్యానికి దగ్గరగా ఉన్నవారిని మాత్రమే ఫ్రెండ్స్‌లా యాడ్ చేసుకోవాలి. కామన్ ఫ్రెండ్ అనో, ఎక్కడో చూసినట్టు ఉందనో.. నెట్‌వర్క్‌లోకి ఆహ్వానించొద్దు. ప్రొఫైల్, పోస్టుల పరంగా తేడాగా అనిపిస్తే తక్షణం అన్‌ఫ్రెండ్ చేసేయాలి. మిమ్మల్ని ఎవరైనా అన్‌ఫ్రెండ్ చేస్తే.. చిన్నబుచ్చుకొని మళ్లీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి నానాయాగీ చేసుకోవద్దు. ఇక మీ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ముచ్చటగా మూడు వాక్యాల్లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్తో సరిపెట్టండి. ఎదుటివారి ప్రొఫైల్ డిస్క్రిప్షన్ బాగుంది అనిపిస్తేనే.. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం గానీ, వచ్చిన రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేయడం గానీ చేయండి. సోషల్ మీడియా ట్రోల్స్, ఎఫైర్స్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో వచ్చే వారం తెలుసుకుందాం!
ఒక్కసారి బ్రౌజింగ్ స్టార్ట్ చేస్తే చాలు. బోలెడంత సమాచారం. ఇదేదో బాగుందని వెనకాముందు ఆలోచించకుండా షేర్ చేయడం మంచిది కాదు. దాంతో కాపీరైట్ సమస్యలు ఎదరవుతాయి. కొన్ని అలాంటి డేటాని సోషల్ అడ్డాల్లో పంచుకోవడం ద్వారా చట్టపరమైన సమస్యలు వస్తాయి. శిక్షర్హులుగా చట్టం ముందు తలదించుకోవాల్సి వస్తుంది.