చరిత్ర అంటే కళ్లతో చూడని గతాన్ని చెప్పేదేనని అనుకోవడం అక్షర సత్యమే. కానీ, ఇది అర్ధ సత్యం. ఇప్పటిదాకా అలాంటి పుస్తకాలే మన చేతికి రావడమే అందుకు కారణం. ఇటీవలే జరిగిపోయిన రాజకీయ పరిణామాలు చరిత్ర పుస్తకాల్లో కనిపించట్లేదు. ఆ లోటుని ఇనగంటి వెంకట్రావు రాసిన ‘విలీనం-విభజన’ పుస్తకం తీర్చింది. నడుస్తున్న చరిత్రను పత్రికలు వ్యాఖ్యానిస్తే.. ఆ పత్రికా రంగంలో సంపాదకుడి స్థాయికి చేరిన వెంకట్రావు మన కళ్ల ముందే జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైన రాజకీయ చరిత్రను అక్షరీకరించారు.
బూర్గుల, టంగుటూరి నుంచి నేటి ముఖ్యమంత్రుల పాలన, సంస్కరణ, అభివృద్ధిని ఇందులో వివరించారు. ఏ ముఖ్యమంత్రి కాలంలో ఏం జరిగింది? ఏ పార్టీ ఏ పూటకు ఏం మాట్లాడింది? ప్రజలు కోరుకున్నదేమిటి? ప్రభుత్వాలు చేసిందేమిటి? పార్టీలు చెప్పిందేమిటి? చివరికి జరిగిందేమిటి? ముఖ్యమంత్రులను ముందుపెట్టి తెలుగునాట రాజకీయాలను కాలక్రమంలో చక్కగా వివరిస్తుందీ పుస్తకం.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రులు, అధికార పార్టీలే కాకుండా పార్టీల్లోని ముఠాల ఘర్షణలు, అసంతృప్తుల బుజ్జగింపు బేరసారాలు, లోపాయకారీ విధానాలను రచయిత వివరించారు. పాత్రికేయుడిగా సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాలను అతి దగ్గరగా చూసిన వ్యక్తి ఆలస్యంగా రిపోర్ట్ చేస్తున్న వార్తలివి! పత్రికల్లో పనిచేసేవారికి పరిమితులు, పాలసీలు, పరిమితంగా రాయాలనే నిబంధనలు ఆటంకాలు. ఉద్యోగ జీవితం మానేసిన తర్వాత ఒక లక్ష్యంగా పెట్టుకున్న రచయిత దశాబ్దాల చరిత్రను తవ్వి కొత్త వార్తలు ప్రచురించారు.
అయినా ఇది గతమే కాబట్టి చరిత్రే! పార్లమెంటరీ రాజకీయాల్లో రాణించాలనుకునే నేతలకు ఈ పుస్తకం పాఠ్యపుస్తకంలా ఉపయోగపడుతుంది. వృత్తిలో అనుభవం సాధించాలనుకునే యువ పాత్రికేయులు ఈ ‘గతం – స్వగతం’ నుంచి ప్రేరణ పొందవచ్చు. ఈ రచనకు కేంద్రబిందువు తెలుగు రెండు రాష్ర్టాల ‘విలీనం-విభజన’. అయినప్పటికీ రాజకీయ వేదికల కింద నీరులా ప్రవహించే కులం, ముఠాలు, ప్రలోభాలు, అధికార యంత్రాంగం, అసెంబ్లీ సమావేశాలు, చట్టాలు, ఉద్యమాలు, ప్రతిపక్షాలు పరస్పరం ఎలా ప్రభావితం అవుతాయో? ‘విలీనం-విభజన’ కండ్లకు కడుతుంది.
రచయిత: ఇనగంటి వెంకట్రావు
ప్రచురణ: మోనికా బుక్స్
విక్రయకేంద్రాలు: నవోదయ (90004 13413), ప్రజాశక్తి, విశాలాంధ్ర
పేజీలు: 406 ధర: రూ.360
రచన: వారాల ఆనంద్
పేజీలు: 124;
ధర: రూ. 150
ప్రచురణ: పోయెట్రీ ఫోరం ప్రచురణ, కరీంనగర్.
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 94405 01281