మారిన జీవన విధానం, పురుగుమందులతో సావాసం చేసిన ఆహార ధాన్యాలు వెరిసి మనిషి ఆరోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. ఈ విషయం తెలిసినా.. దేన్నీ నియంత్రించ లేని పరిస్థితిలో ఉన్నాం. ఈ యువరైతు మాత్రం.. ఈ విష వలయం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని భావించాడు. తనతోపాటు పదిమందికైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని అనుకున్నాడు. తనకు ఎదురైన చేదు అనుభవాలకు పరిష్కారం సేంద్రియ వ్యవసాయమే అని నిశ్చయించుకున్నాడు. రాత్రిళ్లు ఉద్యోగం చేస్తూ, పగలంతా వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన ఫలసాయం పొందుతున్న 35 ఏండ్ల రైతు అయిలపురం అనిల్‌రెడ్డి సాగుబడి పాఠం చదివేయండి.
యువ రైతు అనిల్రెడ్డిది సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లి. అక్కడ వాళ్లకు నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఎంబీఏ చదివిన అనిల్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఇరవై ఏండ్ల కిందట అనిల్ తల్లికి క్యాన్సర్ సోకింది. కుటుంబం అంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆమెను కాపాడుకుంది. తల్లికి క్యాన్సర్ రావడానికి కృత్రిమ ఎరువులతో పండించిన పంటల ఉత్పత్తులు కూడా ఓ కారణమని వైద్యులు చెప్పిన మాట పదిహేనేండ్ల అనిల్‌ను ఆలోచనలో పడేశాయి. అప్పట్నుంచే సేంద్రియ వ్యవసాయం గురించి పరిశోధన మొదలుపెట్టాడు. తరచూ వ్యవసాయ అధికారులను సంప్రదించే వాడు.
ఏండ్లు గడిచిపోయాయి. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతల కారణంగా వ్యవసాయంపై అంతగా దృష్టి సారించలేదు. నాలుగేండ్ల కిందట సేంద్రియ పద్ధతిలో సాగు మొదలుపెట్టాడు. పశువుల జీవామృతం, కంపోస్టు ఎరువులు, వేప పిండిని ఎరువుగా మలిచి వరి పంట సాగు చేశాడు. అయితే, రసాయన ఎరువులతో సాగు చేసినప్పుడు ఎకరాకు 15 క్వింటాళ్ల ధాన్యం చేతికొస్తే.. సేంద్రియ పద్ధతిలో సాగు చేయగా 10 క్వింటాళ్ల దిగుబడే చేతికొచ్చింది. దిగుబడి కాదు.. ఆరోగ్య భద్రతే ప్రధానం అని భావించాడు అనిల్. మరింత కష్టపడి, సంప్రదాయ విధానాలు కూడా పాటిస్తూ వ్యవసాయం కొనసాగించి పంట దిగుబడి కూడా పెంచగలిగాడు.
సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్న అనిల్‌రెడ్డికి తక్కువ బరువుతో కొడుకు పుట్టాడు. మెరుగైన వైద్యం అందించి బిడ్డను కాపాడుకోగలిగాడు. కృత్రిమ ఎరువులతో పండించిన కూరగాయల వాడకం పుట్టే బిడ్డల మీద ప్రభావం చూపుతాయని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఆ మాటతో కాయగూరలు కూడా సేంద్రియ పద్ధతిలో పండించాలని నిర్ణయించుకున్నాడు అనిల్. వ్యవసాయ అధికారి నాగార్జున సహకారంతో సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించే విధానం గురించి తెలుసుకున్నాడు. తన పొలంలో 30 గుంటల స్థలంలో కూరగాయల సాగు మొదలుపెట్టాడు. భూమిలో నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు ప్రాణమిచ్చే అజటోబాక్టర్, భాస్వరం, పొటాష్ అందించడానికి రకరకాల బ్యాక్టీరియా ఎరువులను ఉపయోగించాడు. నాలుగు రకాల జీవ ఎరువులను తయారు చేసి.. వాడుకున్నాడు. దీంతోపాటు పదిహేను రోజులకు ఒకసారి వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని డ్రిప్ ద్వారా అందించాడు. తెగుళ్లు వచ్చినా, పురుగు పట్టినా పూర్తిస్థాయి సేంద్రియ ఎరువులనే ఉపయోగించాడు. సంప్రదాయ, సేంద్రియ పద్ధతిలో సాగుచేయడం వల్ల బియ్యం చాలా రుచిగా, నాణ్యత కలిగి ఉన్నాయని చెబుతాడు అనిల్. కూరగాయలు కూడా చాలా రుచిగా ఉన్నాయని వీటిని కొనుగోలు చేసినవాళ్లూ చెబుతున్నారు. తన పొలంలో పండించిన కాయగూరలను చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాడు. పెట్టుబడి ఖర్చులు పోను ప్రతినెలా రూ.25 వేల వరకు ఆదాయం వస్తున్నదని అనిల్ చెబుతున్నాడు. తన ఇంటి సమస్యను పరిష్కరించడానికి మొదలుపెట్టిన సేంద్రియ సాగు.. పదిమందికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుండటం ఆనందంగా ఉందంటున్నాడు. రైతులంతా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనీ, ఆరోగ్య సంరక్షణ కోసం అందరూ పాటుపడాలనీ సలహా ఇస్తున్నాడు.