Ramayanam | ఎండాకాలం చన్నూరు కొండమీద ఒక అచ్చమైన పల్లెటూరి పెళ్లికి వెళ్లి ఇంటికి రాగానే.. వారంరోజులకు మరొక పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి అమ్మవైపు దగ్గరి బంధువులు. అమ్మ మేనమామ కొడుకు పెళ్లి. అవడానికి మేనమామ కొడుకే గానీ.. మేనమామ దగ్గరే అమ్మ పెరిగింది గనుక సొంత తమ్ముడి లాగానే!
ఈ పెళ్లి హైదరాబాదులో. నేనూ, అమ్మా, అక్కా రైలులో వెళ్లాం. రైల్లో నాకు కిటికీ పక్కన సీటు దొరికింది. ఎంతో పొంగిపోయి అసలు ఇవతలివైపు ఏం జరుగుతుందో కూడా గమనించకుండా.. కిటికీలోంచి బయటికి చూస్తూ యమ సంతోష పడిపోయాను. ఏమైందో ఏమోగానీ సడన్‌గా నా కంట్లో ఏదోపడి భగ్గున మండటం మొదలైంది. కన్ను తెరవడానికి లేకుండా ఒకటే మంట. అమ్మ కాసేపు కొంగుతో నోటి ఆవిరి పట్టి నా కంటిని కాపింది. మంచినీళ్లతో నా కన్నును కడుక్కోమంది. ఏం చేసినా అప్పటికప్పుడే తప్ప.. నా నొప్పి తగ్గలేదు.
రైల్లో మా పక్కన కూర్చున్న వాళ్లు, బోగీలో ఉన్న మిగతా ప్రయాణికులు.. “అమ్మాయి కిటికీ పక్కన కూచున్నది గద. కంట్లే రైలు బొగ్గు పడ్డది గావచ్చు” అన్నారు. ఆ వెంటనే నల్లబ్యాగు ఒళ్లో పెట్టుకుని కూచున్న ఒకాయన.. “కావొచ్చు ఏంది?! గంతే! కిటికీ దగ్గర కూచోంగనే గాదు, బయిటికి ఊరికే చూడొద్దు. చూస్తె గట్లనే బొగ్గు పడుతది” అన్నాడు అక్కసుగా. రైలు ఎక్కినప్పటి నుండీ గమనిస్తూనే ఉన్నాను. నేను కిటికీ పక్కన కూచోవడం ఆయన ఎందుకో భరించలేకుండా ఉన్నాడు. తను కూచుందామని అనుకున్నాడో ఏమో! కిటికీ పక్కన కూచునేదే బయటికి చూట్టానికి. లేకపోతే ఎందుకు?! అదైనా ఊచలున్న కిటికీలోంచి ఎవరైనా తల బయటికి పెట్టి చూడగలరా?! మొత్తానికి నాంపల్లి స్టేషన్లో దిగేసరికి నా కన్ను ఎర్రగా మారి పెద్దగా వాచి మూసుకు పోయింది.
ఇంటికెళ్లగానే.. “ఏమైంది?” అనే ప్రశ్నను నలభై మూడు మంది అడిగారు. అందరికీ ఒకటే సమాధానం.. “రైల్లో కిటికీ దగ్గర కూచున్నాను!” అని. చివరికి అలా కూచోవడమే పెద్ద తప్పు అని వాళ్లంతా నిజనిర్ధారణ చేసి.. నేర నిరూపణ చేశారు. కిటికీ దగ్గర కూచోవడం అంత నేరమా అనిపించింది.
అమ్మ ఎంత పెళ్లి సందడిలో ఉన్నా.. “ఎవరన్న మందుల షాపు దగ్గరికి పోయేటోళ్లు ఉంటే.. చుక్కల మందు తెప్పిస్త బిడ్డా!” అన్నది కానీ, ఆ పెళ్లిలో ఎవరి హడావుడిలో వాళ్లున్నారు. “ ఆ.. ఏమైతది?! రెండ్రోజులుంటే అదే తక్వయితది” అన్నవాళ్లూ ఉన్నారు. అది తక్కువయ్యేదో ఏమో కానీ, నాకోసం మరో ప్రమాదం ఎదురు చూస్తున్నదని అప్పుడు నాకు తెలియదు.
ఆ మర్నాడే మరో సంఘటన జరిగింది. పెళ్లికొడుకు వాళ్లింటికి చాలా దగ్గరలోనే బర్కత్‌పురలో పెళ్లి జరిగే రెడ్డి కాలేజీ హాస్టల్ బిల్డింగ్ ఉంది. నడిచి వెళ్లిపోవచ్చు. అయినా అప్పటి మర్యాద కోసం మగపెళ్లి వాళ్లమంతా మాకు ఏర్పాటు చేసిన విడిది-రెడ్డి హాస్టల్లోనే పడుకున్నాం. మిగతా ఎవరెక్కడ పడుకున్నారో తెలియదు. మా కజిన్స్ అందరికీ ఓ హాలులో వరుసగా పడకలు వేసారు. మేమంతా కబుర్లు చెప్పుకొంటూ నిద్రలోకి జారుకున్నాం. మధ్యరాత్రి ఉన్నట్టుండి నా ముఖం మీద ఏదో పడ్డట్టు అనిపించింది. ఎవరో గట్టిగా నా కంటి మీద కొట్టారు. గాఢనిద్రలో ఉన్న నేను లేవబోయేసరికి గబుక్కున లేవలేకపోయాను. నా ముఖం మీద ఎవరిదో కాలు. ముట్టుకుని చూద్దును కదా.. ఆ పాదానికున్న కడియం గట్టిగా తగిలింది. నా కన్ను మళ్లీ భరించలేనంత నొప్పితో నీళ్లు కారడం మొదలైంది. “అబ్బా!” అనేసరికి నా పక్కనున్న కజిన్ లక్ష్మి.. “ఏమైందే?” అంటూ లేచింది. ఆ వెంటనే ఇద్దరు ముగ్గురు లేచారు.
నా కంటిపై తన్నినామెను.. ఈ పెళ్లి సందర్భంగా పని చేయడానికి బమ్మెర నుండి వచ్చిన చాకలి నర్సమ్మగా గుర్తించారు. విషయమేమిటంటే ఆమె మేమున్న హాలులో ఫ్యాన్లు ఉన్నాయని, ఇక్కడికి వచ్చి ఎక్కడా చోటు కనిపించక మా తలాపున పడుకుంది. నిద్రలోనే నాపై కరుణించి ఫెడీల్మని తన్నిందన్న మాట.
ఆ మర్నాడు నా కన్ను మరింత వాచిపోయి అసలు తెరవడానికే వీలుకాలేదు. నర్సమ్మ కూడా లేవగానే నా కన్ను చూసి.. “అయ్యో! నేను కానలేదమ్మా! నా కాలు నిర్దల తలిగినట్టున్నది” అంది.
మా ఈడు పిల్లలందరూ కొత్తబట్టలేసుకుని ఫంక్షన్లో కలియతిరుగుతుంటే.. నేను మాత్రం చూస్తేనే భయమేసేలా కన్నంతా వాచిపోయి, ఓ కర్చీఫ్ అడ్డుపెట్టుకుని ఒంటి కన్ను రాక్షసిలా తిరిగాను. అఫ్ కోర్స్.. నేనూ కొత్తబట్టలు వేసుకున్నా గానీ, ఒకేచోట కూర్చోలేను గద! మొత్తానికి ఆ పెళ్లిలో.. ‘అయ్యో.. అయ్యోలు. ఏమైంది, ఏమైందిలు?” ఓ వందైనా ఎదుర్కొని ఉంటాను. ఆ మర్నాడు అమ్మావాళ్లు చెప్పడంతో మా కజిన్ లక్ష్మి నన్ను మలక్‌పేటలో వాళ్ల బంధువైన కృపాసాగర్ రావు అనే కళ్ల డాక్టర్ ఇంటికి తీసుకెళ్లింది. అప్పుడే మొదటిసారి ఆప్తమాలజిస్ట్ అంటే కళ్లకు సంబంధించిన డాక్టర్ అని బోర్డు చూసి తెలుసుకున్నాను. ఆయన నన్ను చూసి.. “అయ్యో! బాగా ఇన్ఫెక్షన్ అయింది. కన్నుకేమీ డ్యామేజ్ కాలేదు” అని ఐ డ్రాప్స్, ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇంతలోనే డాక్టర్ గారి భార్య వసంతా ఆంటీ కూడా వచ్చింది. వస్తూనే నన్ను చూసి.. “ఏం గాదు నానా! తక్కువైతది” అంటూ.. “ఏమండీ! ఎంత అందమైన పిల్ల కదా! ఆ కళ్లు చూడండి.. కలువరేకుల్లా ఎంత బాగున్నాయో! తొందరగా తక్వ చేయండి” అని నన్ను దగ్గరికి తీసుకుంది. “ఏం పర్వాలేదు! సాయంత్రం వరకు రిలీఫ్ ఒస్తుంది. రెండ్రోజుల్లో మొత్తం తగ్గిపోతుంది. మరి కలువరేకుల కళ్లు నా దగ్గరికి ఆలస్యంగా ఒస్తే నేనేం జెయ్యను?!” అన్నారు నవ్వుతూ. వసంతా ఆంటీ చాలా అందంగా ఉంటుంది. ఆమె నన్ను పొగుడుతుంటే నాకు సిగ్గేసింది. అప్పటివరకూ నా అందం ప్రసక్తి ఎవరూ తేలేదు. మా కజిన్స్లో మేమెప్పుడూ మా అందచందాల గురించి మాట్లాడుకోం కూడా! ఇంటికొచ్చాక నేనెంత వారించినా మా లక్ష్మి అందరిముందు.. “కలువ రేకులకు చుక్కల మందు వేసుకున్నావా?!” అంటూ నన్ను బనాయించింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి